- పదవీ విరమణ వయసు పెంచి రిటైర్‌మెంట్ భారాన్ని తప్పించుకున్న కేసీఆర్
- మార్చి నుంచి ప్రారంభం కానున్న రిటైర్‌మెంట్లు
- ఏటా 8 నుంచి 10 వేల మంది వరకు పదవీ విరమణ
- వచ్చే ఐదేళ్లలో రిటైర్ కానున్న ఉద్యోగులు 44.051 మంది
విధాత: ఉద్యోగులు పదవీ విరమణ భారం రేవంత్ సర్కారు మీద భారీగానే పడనున్నది. బీఆరెస్ సర్కారు ఉద్యోగుల పదవీ విమరణ ఖర్చుల నుంచి తప్పించుకోవడానికే నాటి సీఎం కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచారన్న అభిప్రాయాలు ఉన్నాయి. పదవీ విరమణ వయసు 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచిన తరువాత 2021 మార్చి 31 తరువాత ఇప్పటి వరకు ఉద్యోగులు ఎవరూ రిటైర్ కాలేదు. 2021లో పదవీ విరమణ చేయాల్సిన వారు వయసు పెరగడంతో ఈ ఏడాది మార్చి తరువాత పదవీ విరమణ చేయనున్నారు.
మూడేళ్ల తరువాత రిటైర్‌మెంట్లు
తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి మూడేళ్లు రిటైర్‌మెంట్లు బల్క్‌గా ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వానికి తాత్కాలికంగా వందల కోట్ల ఖర్చు మిగిలిపోయింది. నాటి కేసీఆర్ ప్రభుత్వం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అవసరం లేకుండా తప్పించుకోగలిగింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకు ఉద్యోగుల పదవీ విరమణలు పునఃప్రారంభం కానున్నాయి. మొదటి బ్యాచ్ రిటైర్‌మెంట్లు 2024 మార్చి 31 తరువాత మొదలవుతాయి. 2024 మార్చి నుంచి డిసెంబర్ వరకు 8,194 మంది వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేసే ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు.
రేవంత్ హయాంలో రిటైర్ కానున్న 44,051 మంది ఉద్యోగులు
ఒక్క కలం పోటుతో నాడు కేసీఆర్ ఉద్యోగుల పదవీ విరమణ ఖర్చులు తప్పించుకున్నారు. నాడు కేసీఆర్ తప్పించుకున్న ఈ భారాన్నినేడు రేవంత్ రెడ్డి మోయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా కాలం పూర్తయ్యే ఈ ఐదేళ్ల కాలంలో 44.051 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. 2024 డిసెంబర్ వరకు 8,194 మంది, 2025లో 9,213 మంది, 2026లో 9,231 మంది, 2027లో 8,917 మంది, 2028లో 8,496 మంది పదవీ విరమణ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఉద్యోగుల రిటైర్‌మెంట్ భారం రూ.33 వేల కోట్లపైనే..
రేవంత్‌రెడ్డి సర్కారుపై ఉద్యోగుల పదవీ విరమణ ఆర్థిక భారం 22 వేల కోట్లకు పైగా పడనుందని అంచనా. ఒక్కో ఉద్యోగికి పదవీ విరమణ తరువాత వారి వేతనాలు, సర్వీస్ కాలాన్ని బట్టి గ్రాట్యూటీ, 10 నుంచి 15 లక్షల మధ్య వస్తుందని చెబుతున్నారు. అలాగే పెన్షన్‌లో చాలా మంది 40 శాతం వరకు అమ్ముకుంటారు. ఇలా అమ్ముకున్న పెన్షన్ డబ్బులు రూ.30 నుంచి రూ. 50 లక్షల వరకు వస్తాయి. వీటితో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్ అని, పీఎఫ్ అని ఇలా వివిధ రూపాలలో పదవీ విరమణ చేసే ఉద్యోగికి నగదు లక్షల్లో వస్తుంది. ఇలా ఒక్కో ఉద్యోగికి పదవీ విరమణ చేసిన నాడు రూ. 50 లక్ష నుంచి కోటి రూపాయల మధ్యన డబ్బులు వస్తాయని చెబుతున్నారు. వీటన్నింటినీ సర్కారు లెక్క కట్టి రిటైర్ అయ్యే ఉద్యోగి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ సరాసరిన లెక్కించి తక్కువలో తక్కువగా రూ.75లక్షల వరకు వస్తాయని సమాచారం. ఈ లెక్కన 44,051 మంది పదవీ విరమణ చేసే ఉద్యోగులకు తక్కువలో తక్కువ రూ.33 వేల కోట్ల పైచిలుకే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ఒక అధికారి అన్నారు. ఈ భారం సగటున ఏడాదికి రూ.6,600 కోట్ల వరకు రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ భారమంతటిని ఆ నాడు ఒక్క సంతకంతో మాజీ సీఎం కేసీఆర్ తప్పించుకొని నేడు కాంగ్రెస్ సర్కారుపై మోపారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది.