Site icon vidhaatha

BREAKING: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

విధాత: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జీ సాయన్న ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయన్న యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. షుగర్ లెవల్ పడి పోవడం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సాయన్నను కుటుంబసభ్యులు యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

క్రమంలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. 1951 మార్చి 5న సాయన్న చిక్కడపల్లిలో జన్మించారు. 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (బీఎస్సీ), 1984లో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1994 నుంచి 2009 వరకు మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2009లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆయన 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియామకమయ్యారు.

ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 37,568 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయన మృతికి బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు నివాళులర్పించారు. సాయన్నకు భార్య గీత, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.

Exit mobile version