పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించిన కేంద్రం.. లోక్‌సభ ఎన్నికలకు తాయిలం?

లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించింది.

  • Publish Date - March 14, 2024 / 04:48 PM IST

Petrol Diesel Price | త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ప్రకటించారు. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తగ్గించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల అమలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించడం ద్వారా కోట్లాది మంది భారతీయులు, వారి కుటుంబ సంక్షేమం, సౌలభ్యమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించారని కేంద్రమంత్రి ట్వీట్‌ చేశారు. ఇంకా ఆయన స్పందిస్తూ ప్రపంచం కష్టకాలంలో ఉన్న సమయంలో అభివృద్ధి చెందిన.. చెందుతున్న దేశాల్లో పెట్రోల్‌ ధరలు 50-72శాతం పెరిగాయన్నారు.


మన చుట్టూ ఉన్న అనేక దేశాల్లో పెట్రోల్‌ అందుబాటులో లేదన్నారు. 1973 తర్వాత 50 సంవత్సరాల్లో అతిపెద్ద చమురు సంక్షోభం ఎదురైనా ప్రధాని మోదీ దూరదృష్టి, సహజమైన నాయకత్వం కారణంగా మోదీ కుటుంబం ప్రభావితం కాలేదన్నారు. గత రెండున్నరేళ్లలో భారత్‌లో పెట్రోల్ ధరలు పెరగడానికి బదులు 4.65 శాతం తగ్గాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. భారతదేశంలో ఇంధన సరఫరా స్థిరంగా ఉందని.. తక్కువ ధరలు కొనసాగాయన్నారు. తమ అడుగులు గ్రీన్‌ ఎనర్జీ వైపు పయనించడం కొనసాగించాయన్నారు. భారతదేశం ఇంధన లభ్యత, స్థోమత, స్థిరత్వాన్ని కొనసాగించింది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగని.. తగ్గిన ఏకైక దేశం భారత్‌ అన్నారు. దేశప్రజల కోసం ఎక్కడి నుంచైనా చమురు కొనుగోలు చేశామన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు 27 దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేసేవాళ్లం, కానీ ఆయన నాయకత్వంలో చౌకగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ను మన దేశ ప్రజలకు అందించేందుకు ఈ పరిధిని విస్తరించి ఇప్పుడు 39 దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వివరించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ మహిళా దినోత్సవం సందర్భంగా డొమెస్టిక్‌ గ్యాస్‌ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

Latest News