Site icon vidhaatha

FASTag | ఫాస్టాగ్‌కు మంగళం..! టోల్‌ వసూళ్లకు సరికొత్త విధానం తెస్తున్న కేంద్రం..!

FASTag | కేంద్ర ప్రభుత్వం రహదారులపై టోల్‌ఛార్జీల వసూలు కోసం ప్రస్తుతం ఫాస్టాగ్‌ విధానాన్ని తీసుకు వచ్చింది. దాంతో టోల్‌ప్లాజాల వద్ద చెల్లింపులు వేగవంతం చేసి.. ప్రయాణం సాఫీగా సాగేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నది. తాజాగా ఫాస్టాగ్‌ స్థానంలో సరికొత్తగా జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సైతం జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్లపై ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో రహదారులపై టోల్‌ప్లాజాలు మాయం కానున్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో పనిచేసే ఈ విధానం ద్వారా టోల్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థ అమలులోకి వస్తే ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్‌ చెల్లించేలా కొత్త విధానం రూపొందిస్తున్నారు.

ఈ వ్యవస్థ జీపీఎస్‌పై ఆధారపడి పని చేస్తుంది. ప్రస్తుత ఫాస్టాగ్‌ విధానంలో వాహనాల విండ్‌షీల్డ్‌పై చిప్‌ ఆధారిత ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ ఉంటుంది. టోల్‌ గేట్‌ నుంచి వెళ్లిన సమయంలో అక్కడ ఉండే స్కానర్లు వాటిని స్కాన్‌ చేస్తాయి. దాంతో ఫాస్టాగ్‌కు అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అవుతాయి. ఫాస్టాగ్‌ లేని సమయంలో నేరుగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. నగదు, కార్డుల ద్వారా టోల్‌ వసూళ్లతో చాలా సమయం వృథా అవుతున్నది. పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయేది. ఫాస్టాగ్‌ విధానంతో వాహనదారులకు సమయం ఆదా అవుతూ వచ్చింది. తాజాగా కేంద్రం మరో నయా సాంకేతిక విధానంపై దృష్టి పెట్టింది.

కొత్త జీపీఎస్‌ విధానంలో అన్ని వాహనాల్లో తప్పనిసరిగా జీపీఎస్‌ వ్యవస్థ ఉండాలి. త్రీజీ, జీపీఎస్‌ కనెక్టివిటీతో మైక్రో కంట్రోల్‌ ద్వారా టోల్‌ వసూళు చేయాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది. వాహనంలోని జీపీఎస్‌ ద్వారా వాహనాల మార్గాన్ని ఎన్‌హెచ్‌ఐఏ, రెగ్యులేటరీ ఏజెన్సీ పరిశీలించి.. ఏ వాహనాలు ఏ టోల్‌రోడ్ల మీదుగా వెళ్తున్నాయి.. ఎన్ని గేట్ల మీదుగా ప్రయాణం సాగిస్తున్నాయో గుర్తించి.. దాని ఆధారంగా వాహనాల యజమానుల నుంచి టోల్‌ను వసూలు చేస్తాయి. అయితే, ఈ విధానం ద్వారా వాహనదారులకు నష్టమేనని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు. ఎందుకంటే రెండు టోల్‌ప్లాజాల మధ్యనే ప్రయాణించే వారు సైతం జీపీఎస్‌ విధానంలో టోల్‌ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఈ విధానం కొద్దిరోజుల్లోనే అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తున్నది.

Exit mobile version