Covid-19 Nasal Vaccine | డ్రాగన్ కంట్రీ చైనా సహా పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి అత్యవసర వినియోగానికి నాసల్ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. బూస్టర్ డోస్‌గా వేయనున్నారు. నాసల్ వ్యాక్సిన్ మొదట ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నది. ఈ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ విస్తృతమైన రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడంలో సహాయపడనున్నది. SARS-CoV-2 వంటి అనేక వైరస్‌లు సాధారణంగా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ముక్కులోని శ్లేష్మ పొరలోని కణాలు, అణువులను వైరస్ అంటుకొని ఉంటుంది. దీంతో నాసికా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ముక్కులోనే వైరస్‌ను అంతం చేస్తుంది.
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ వ్యాక్సిన్ భిన్నమైందదని, ప్రభావవంతమైంది. టీకా ముక్కు ద్వారా ఇవ్వడం ద్వారా.. నాసికలో రోగ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అది వైరస్ లోపలికి ప్రవేశించిన వెంటనే అంతం చేసు్తంది. ఇప్పటి వరకు ఇస్తున్న వ్యాక్సిన్ల మాదిరిగా ఈ టీకాకు సూది అవసరం ఉండదు. దీన్ని ఉపయోగించడం సులభం. ఇంట్లో సైతం వేసుకోవచ్చు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు సైతం అవసరం లేదు. పిల్లలు, పెద్దలందరికీ వేసే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే వైరస్ శరీరంలోకి ప్రవేశించే ముందే దాన్ని చంపే సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో భవిష్యత్‌లో పోస్ట్ కొవిడ్ సమస్యలు ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు.