- ప్రతి ఒక్క ఓటూ కీలకమని గుర్తిస్తున్న పార్టీ
- ఓట్ల చీలకుండా చూసుకుంటేనే విజయాలు
- మరి క్షేత్రస్థాయి నాయకులను ఒప్పిస్తారా?
- ఢిల్లీ టార్గెట్ పోరులో రాష్ట్ర నేతలు పట్టువిడుపులు ప్రదర్శిస్తారా?
- కాంగ్రెస్‌కు కీలకంగా ‘జనవరి’ నిర్ణయాలు
(విధాత ప్రత్యేకం)
పార్టీ బలంగా ఉన్నప్పటికీ, కార్యకర్తలు కష్టపడినప్పటికీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలు కాంగ్రెస్ అధిష్ఠానానికి అర్థమైనట్టు ఉన్నది. బీజేపీని ఓడించాలంటే ప్రతి ఓటూ కీలకమే అన్నది అవగతమైంది. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీని కట్టడి చేయడానికి కలిసి వచ్చిన చిన్నపార్టీలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లి ఆయా రాష్ట్రాల నాయకత్వం అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల స్ఫూర్తితోనే తెలంగాణ విజయం సాధించడానికి కారణం ఇక్కడ ఉద్యమకాలంలో పనిచేసిన వారిని, సీపీఐ లాంటి పార్టీని కలుపుకోవడం, ప్రభుత్వ ఓట్లు చీలిపోకుండా వైఎస్‌ఆర్‌టీపీ, తెలంగాణ జన సమితి లాంటి పార్టీలను ఎన్నికలకు దూరంగా ఉంచడం వంటివి బీఆర్‌ఎస్ హ్యాట్రిక్‌కు అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడ్డాయి. తెలంగాణ విజయాన్ని రాహుల్ ప్రత్యేకంగా ప్రస్తావించడంలో ప్రత్యేకత ఉన్నది.
ఏడాది కిందటి వరకు ఆ పార్టీ మూడోస్థానంలో ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని పార్టీని విజయతీరాలకు చేర్చడం వెనుక కేంద్ర నాయకత్వ సూచనలతో పాటు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారందరినీ ఏకతాటికి మీదికి తేవడం, ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్లించడంలో రాష్ట్ర నాయకత్వం సక్సెస్ అయ్యింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలోనూ చిన్నపార్టీలను కలుపుకొని ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవన్నది ఆ పార్టీ అధిష్ఠానమే కాదు, రాజకీయ నిపుణులూ చెప్పారు. కానీ ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకత్వం ఏకపక్ష నిర్ణయాల ఫలితంగా బీజేపీ గెలువగలిగింది. ఇది బీజేపీ విజయం అనేకంటే ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకత్వాల వైఫల్యం అంటే బాగుంటుంది.
ఆ మూడు రాష్ట్రాల్లో అక్కడి నేతల వల్లే ఓటమి!
మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ వ్యవహారశైలి వల్ల సమాజ్‌వాదీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఆధిష్ఠానం బీజేపీని ఎదుర్కోవడానికి జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ సమయంలో సొంత పార్టీ నేతలే పార్టీ అధిష్ఠాన ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అనడనికి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ. రాహుల్‌గాంధీ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్టు సమాచారం. ఇదే సమయంలో రాహుల్ మరో ముందడుడు వేయడం ముదావహం. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చడమే కాకుండా ఎన్సీపీ, శిసేనన పార్టీల్లో బీజేపీ చీలిక తెచ్చింది. అక్కడ 48 లోక్‌సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. మొత్తం స్థానాల్లో బీజేపీ 23, శివసేన 18 స్థానాలు గెలుచుకున్నాయి. మిగిలిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్ 4, ఒక చోట ఎంఐఎం, మరోచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈసారి బీజేపీ గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎన్సీపీ కలిసి పోటీ చేస్తే బీజేపీకి రెండంకెల సీట్లు కూడా కష్టమే అన్నది ఆ పార్టీకి అర్థమైంది. అందుకే ఎన్సీపీలో కీలకనేత అయిన అజిత్ పవార్‌ను తమ వైపు తిప్పుకొన్నది.
ఈ విధంగా అయినా కొన్ని సీట్లు దక్కించుకోవచ్చన్నది కమలనాథుల వ్యూహం. కానీ శరద్‌పవార్, ఉద్ధవ్‌ఠాక్రే ఈసారి ఎలాగైనా బీజేపీకి షాక్ ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. అక్కడ మహావికాస్ అఘాడీలో పీసంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, వంచిత్ బహుజన్ అఘాడీలను కలుపుకోవాలన్నది పవార్ ఆలోచన. కొన్ని ప్రాంతాల్లో బలం ఉన్న పార్టీలను కలుపుకుని వెళ్తే కూటమికి మేలు జరుగుతుందని మహారాష్ట్రలో సీట్ల పంపకం గురించి చర్చ సందర్భంగా శరద్ పవార్.. రాహుల్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది.
సీట్ల పంపకంలో కాంగ్రెస్ వైఖరే కీలకం
జనవరి కల్లా ఇండియా కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి వస్తే ఏప్రిల్‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అలాగే ప్రచార వ్యూహాలు, అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవచ్చు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్న రాష్ట్రాల్లో ముందుగా సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎంపీ ముకుల్ వాస్నిక్ కన్వీనర్‌గా ‘నేషనల్ అలయెన్స్ కమిటీ’ని ఏర్పాటు చేసింది. బీజేపీని ఈసారి గద్దె దించాలంటే ప్రతి ఓటు, సీటు ముఖ్యమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం త్వరగా గ్రహించింది. మరీ ముఖ్యంగా ప్రాంతీయపార్టీల సహకారం లేకుండా కాషాయ పార్టీ కట్టడి కూడా సాధ్యం కాదనేది అవగతమైంది.
అందుకే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సమన్వయ లోపం వల్ల జరిగిన నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇండియా కూటమిని ఎన్నికల నాటికి మరింత బలోపేతం చేయడానికి ఇవి ఉపయోగపడుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కూటమిలో కాంగ్రెస్‌పార్టీ నిర్ణయమే ప్రధానం అనే విషయాన్ని ఇప్పటికే నితీశ్‌కుమార్, మమతా బెనర్జీ కూడా వెల్లడించారు. బీజేపీ వేసే ఎత్తుగడలను ఛేదిస్తూనే.. కూటమి బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ పెద్దన్నపాత్ర పోషించడానికి నడుం బిగించడం శుభపరిణామం. దీన్ని ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కొనసాగించాలని ప్రజలతో పాటు, కూటమిలోని ప్రాంతీయపార్టీల అధినేతలు కూడా కోరుకుంటున్నారు.