Site icon vidhaatha

కలకలం రేపిన కోవర్టు వెంకటరెడ్డి పోస్టర్లు

విధాత: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి , ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో వెలసిన వాల్ పోస్టర్లు పార్టీ వర్గాలలో కలకలం రేపాయి . కోవర్ట్ వెంకటరెడ్డి టైటిల్ తో నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన పేరుతో వెలసిన ఈ పోస్టర్లలో కోమటిరెడ్డిపై ఘాటైన విమర్శలు సంధించారు.

పోస్టర్లలో మొత్తం 13 ప్రశ్నలతో కోమటిరెడ్డిని కోవర్ట్ వెంకటరెడ్డిగా ఆరోపించారు. నల్గొండ జిల్లా హైదరాబాద్- విజయవాడ రహదారిపై చందంపల్లి వంతెన కింద ఈ వాల్ పోస్టర్లు వేశారు. మొన్నటిదాకా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో విభేదించిన వెంకటరెడ్డి ఇటీవలే ఆయనతో కలిసిపోయారు.

వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ఈ వాల్ పోస్టర్లు ఎవరు వేశారన్న దానిపై ఆ పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పార్టీ నుండి పొమ్మనలేక పొగ పెడుతున్న కోమటిరెడ్డి వ్యతిరేకులే ఆయనపై ఈ వాల్ పోస్టర్లు వేసి ఉంటారని భావిస్తున్నారు.

గతంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా కూడా ఇదే తరహాలో వాల్ పోస్టర్లు వేయడం ఈ సందర్భంగా గమనార్హం. అప్పట్లో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ వర్గీయులే పోస్టర్లు వేశారని ప్రచారం సాగింది.

అయితే ఇటీవల రేవంత్ రెడ్డితో వెంకట్ రెడ్డి రాజీ మంత్రం పఠించిన నేపధ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

Exit mobile version