Site icon vidhaatha

కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి పై అప్డేట్


విధాత‌: మాజీ ముఖ్యమంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు ఎర్ర‌వల్లి త‌న ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌లో గురువారం రాత్రి కాలుజారి కింద‌ప‌డ్డారు. దీంతో ఆయన ఎడమ కాలి తుంటిబాగంలో తీవ్రంగా గాయమైంది. అర్ధ‌రాత్రి రెండు గంట‌ల ప్రాంతంలో హుటాహుటిన కేసీఆర్‌ను కుటుంబ‌స‌భ్యులు సోమాజిగూడ య‌శోద ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఇత‌ర ప‌రీక్ష‌ల‌తోపాటు సీటీ స్కాన్ చేసిన వైద్యులు.. కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగిన‌ట్టు నిర్ధారించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉద‌యం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు.


మ‌ధ్యాహ్నం తుంటి మార్పిడి చికిత్స‌


కేసీఆర్‌కు ఎడ‌మ‌కాలి తుంటి ఎముక మార్పిడి శ‌స్త్ర చికిత్సను శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వైద్యులు చేయ‌నున్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను ఎనిమిది మంది వైద్య నిఫుణుల బృందం చేస్తున్న‌ది. అయితే, తుంటి ఎముకకు ఆప‌రేష‌న్ చేయాల‌ని తొలుత భావించినా, కేసీఆర్ వ‌య‌స్సు, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకొని తుంటి ఎముక మార్పిడి చికిత్సే ఉత్త‌మ‌మ‌నే నిర్ధార‌ణ‌కు వైద్య బృందం వ‌చ్చిన‌ట్టు తెలుస్తున్న‌ది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్‌కుమార్ చికిత్స ఏర్పాట్ల‌ను మానిట‌రింగ్ చేస్తున్నారు. తుంటి ఎముక మార్పిడి చికిత్స జ‌రిగితే కోలుకోవ‌డానికి 6-8 వారాల స‌మ‌యం ప‌డుతుంది. ఆ త‌ర్వాత కేసీఆర్‌ మెల్ల‌గా న‌డిచే ప‌రిస్థితి ఉంటుంది.


ప్ర‌భుత్వం త‌ర‌ఫున రిజ్వీ హాజ‌రు


కేసీఆర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. వెంటనే గ్రీన్‌చానల్‌ ద్వారా ఆయనను యశోద హాస్పటిల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నది. వైద్య చికిత్స‌కు సంబంధించిన వ్య‌వ‌హారాన్ని చూడాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి హెల్త్ సెక్ర‌ట‌రీ రిజ్వీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పురమాయించారు. కేసీఆర్ చికిత్స పొందుతున్న య‌శోద ద‌వాఖాన వ‌ద్ద పోలీసు బందోబ‌స్తు ఏర్పాటుచేయాల‌ని ఇంటెలిజెన్స్‌ చీఫ్ శివ‌ధ‌ర్‌రెడ్డిని ఆదేశించారు. ఒక‌వేళ అత్య‌వ‌స‌ర‌మైతే గ్రీన్ చాన‌ల్ వినియోగించాల‌ని కోరారు. కేసీఆర్ హెల్త్ ప‌రిస్థితిపై ఎప్ప‌క‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆదేశించిన‌ట్టు తెలిసింది. 

ద‌వాఖాన‌లోనే కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, క‌విత


కేసీఆర్‌ను అర్ధ‌రాత్రి ద‌వాఖాన‌కు తీసుకొచ్చిన‌ప్ప‌టి నుంచి మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, ఎమ్మెల్సీ క‌విత అక్క‌డే ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు. ఉద‌యం కాసేపు ఫ్రెష్అప్ అయ్యేందుకు బ‌య‌ట‌కు వెళ్లిన వీరంతా కొద్ది సేప‌టికే తిరిగి ద‌వాఖాన‌కు చేరుకున్నారు. కేసీఆర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న కోలుకొని బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ట్వీట్‌చేశారు. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌నేమీ లేద‌ని పేర్కొన్నారు. ధైర్యంగా ఉండాల‌ని కోరారు.


పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన పార్టీ శ్రేణులు


కేసీఆర్ బాత్‌రూమ్‌లో జారిప‌డి ద‌వాఖాన‌లో చేరిన విష‌యం తెలియ‌డంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో య‌శోద ద‌వాఖాన వ‌ద్ద‌కు చేరుకున్నారు. త‌మ నాయకుడికి ఏమైందోన‌నే ఆందోళ‌న‌కు గుర‌య్యారు. పార్టీ శ్రేణుల ర‌ద్దీని నియంత్రించేందుకు పోలీసులు అక్క‌డ భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేశారు.


ప్ర‌ధాని మోదీ ట్వీట్‌


తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలుసుకున్న ప్ర‌ధాని మోదీ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. కేసీఆర్‌కు గాయం కావ‌డంపై విచారం వ్య‌క్తంచేశారు. కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

Exit mobile version