AI Goldman Sachs | కృత్రిమ మేధ! దీని విస్తృతితో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది. అయితే ఈ భయాల్లో కొన్ని అతిశయోక్తులు కూడా ఉన్నాయని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ సాక్స్ ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ కారణంగా ఉద్యోగాల వృద్ధి ఏటా పది లక్షల నుంచి గరిష్ఠంగా 40 లక్షల వరకూ తగ్గుతుందని, అదే సమయంలో అంతకు మించి ఉద్యోగావకాశాలను ఏఐ కల్పిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. కానీ.. ఏఐ కారణంగా ఎన్ని ఉద్యోగాలైతే పోతున్నాయో… అంతకు మించిన సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని అంటున్నారు. ఫలితంగా భారీ స్థాయిలో జాబ్ క్రైసిస్ ఏర్పడే అవకాశాలు ఉండబోవని చెబుతున్నారు. ఈ మేరకు గోల్డ్‌మాన్ సాక్స్ ఆర్థికవేత్తలు, పరిశోధకులు ఒక నివేదికను పబ్లిష్ చేశారు.
గతంలో కొత్త టెక్నాలజీలు వచ్చిన ప్రతి సమయంలో ఇటువంటి భయాందోళనలే వ్యక్తమైన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఆటోమేషన్ ఒరవడి వచ్చినప్పుడు ఫిట్‌నెస్ శిక్షకులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల అవసరం ఉండబోదని అన్నారని, కానీ.. ఆ తర్వాతి కాలంలో ఇవి తగ్గకపోగా.. మరింత పెరిగాయని గుర్తు చేస్తున్నారు. ఫిట్‌నెస్ వీడియోలు ఎన్ని వచ్చినా.. రియల్ ఎస్టేట్‌లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాలు ఎన్ని వచ్చినా.. ట్రెయినర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అంటున్నారు. ఇప్పుడు ఏఐ అనేది ఆ టూల్‌ను ఉపయోగించే వారికి పని కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
ఈ నివేదికకు ముందు సిట్రిని రిసెర్చ్ (Citrini Research) విడుదల చేసిన నివేదిక వైరల్‌గా మారింది. దానికి ప్రతిస్పందనగా గోల్డ్‌మాన్ సాక్స్ నివేదికను భావిస్తున్నారు. ఏఐ సాఫ్ట్‌వేర్… అసంఖ్యాక హ్యూమన్ వర్కర్స్‌ను రీప్లేస్ చేస్తుందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని Citrini Research అంచనా వేసింది. గోల్డ్‌మాన్ సాక్స్ ఆర్థికవేత్తలు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే.. ఏఐ కారణంగా భారీ స్థాయిలో నిరుద్యోగ సంక్షోభం నెలకొంటుందనే ఆందోళనలు అతిశయోక్తిగా మిగిలిపోయే అవకాశం ఉంది.
ఏఐ అనేది భారీ స్థాయిలో విధ్వంసకరంగా ఉంటుందనే అభిప్రాయంతో గోల్డ్‌మాన్ ఆర్థికవేత్తలు ఏకీభవించడం లేదు. ఏఐ టెక్నాలజీ ఏటా కనీసం పది లక్షల నుంచి 40 లక్షల ఉద్యోగాలను తొలగిస్తుందని గోల్డ్‌మాన్ సాక్స్ గ్లోబల్ ఎకానమిస్ట్ జోసెఫ్ బ్రిగ్స్ అంటున్నారు. అయినప్పటికీ ఇది తీవ్ర స్థాయి నిరుద్యోగ సంక్షోభానికి దారితీయదని అంటున్నారు.
‘అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏటా మూడు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నది. దీర్ఘకాలిక ఉద్యోగిత వృద్ధికి ప్రధాన చోదకశక్తి సాంకేతిక మార్పే’ అని బ్రిగ్స్ ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ డైనమిక్స్ మళ్లీ పునరావృతమవుతాయని, ఏఐ తాను ఉద్యోగాలను నాశనం చేసినా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని తాము భావిస్తున్నామని ఆయన రాశారు. అందుకే ఉద్యోగాల అంతం అనే పరిస్థితి ఎదురవుతుందనే వాదనను తిరస్కరిస్తున్నామని పేర్కొన్నారు. సామర్థ్యాన్ని మెరుగుపర్చడం ద్వారా, ఏఐ టూల్స్‌ను ఉపయోగించే వ్యక్తులకు కొత్త పొజిషన్స్‌కు మార్గం తెరిచేలా ఏఐ ఉంటుందన్నారు. సర్వీసు వర్కర్ల కోసం డిమాండ్‌ను సృష్టిస్తుందని తెలిపారు.
ఏఐ అనేది ఇప్పటి వరకూ గణనీయమైన ఉద్యోగాల కోతకు దారి తీసిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని బ్రిగ్స్ అంటున్నారు. ఏఐ ఏదైనా పని చేయగలదు అనుకున్నంత మాత్రాన మనుషుల అవసరం లేకుండా పోదని స్పష్టంచేశారు. 2018 సమయానికి ఉన్న ఉద్యోగాలలో 60 శాతానికిపైగా 1940లలో లేవని ఎంఐటీ ప్రొఫెసర్ డేవిడ్ ఆటోర్ పరిశోధనను ప్రస్తావిస్తూ… గతంలో టెక్నలాజికల్ పురోగతుల సమయంలో జరిగినదే ఇప్పుడూ కొనసాగుతుందని గోల్డ్‌మాన్ సాక్స్ ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
గోల్డ్‌మాన్ సాక్స్ నివేదిక ఎలా ఉన్నా.. భారత్‌లో రాబోయే రెండు మూడేళ్ల వ్యవధిలో నాలుగు నుంచి ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు ఏఐ కారణంగా ప్రమాదంలో పడుతున్నాయని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా మిడ్, సీనియర్ మేనేజ్‌మెంట్ లెవల్ స్థాయి ఉద్యోగాలు, డెలివరీ రోల్స్, సాఫ్ట్‌వేర్ మెయింటనెన్స్ వంటి ఉద్యోగాలు ఈ ముప్పు బారిన పడనున్నాయని అంటున్నారు. భారతదేశంలోని ఐటీ పరిశ్రమలో మిడిల్ లేయర్ ఉద్యోగాలను తొలగించే అంశం ప్రధానంగా పరిశీలనలో ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉత్పాదకతను పెంచుకోవడానికి ఉద్యోగులను తగ్గిస్తాయని అంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దపెద్ద కంపెనీలు భారీ స్థాయి రిక్రూట్‌మెంట్ల స్థానంలో ఎంపిక చేసిన, ఏఐ ఆధారిత టీమ్‌లను నియమించుకోవడం ప్రారంభించాయని చెబుతున్నారు.
ప్రమాదంలో ఇవే…
సాఫ్ట్‌వేర్ టెస్టర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ స్టాఫ్, ఏఐ నైపుణ్యం లేని మేనేజ్‌మెంట్ పోస్టులు, సాఫ్ట్‌వేర్ మెయింటనెన్స్ ఉద్యోగాలు. అయితే.. ఇది పూర్తిగా ఉద్యోగాల తొలగింపు అనే అర్థంలో చూడరాదని, చాలా సందర్భాల్లో ‘పనుల స్వరూపం మారే’ అవకాశంగా చూడాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ డెవలప్‌మెంట్, డాటా సైన్స్, మషీన్ లర్నింగ్ ఆపరేషన్స్, ఏఐ సిస్టమ్ మానిటరింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి, నైపుణ్యం పెంచుకునేవారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఏఐ కారణంగా పూర్తిస్థాయి సంక్షోభం వస్తుందని ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.
Read Also |
Artificial intelligence | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంపన్నుల చేతుల్లో ఆయుధం..!
Gen Z | ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్ జెడ్‌లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
WhatsApp Plus | వాట్సాప్‌లో ఇక ప్రీమియం సేవలు.. డబ్బులు కడితేనే కొత్త ఫీచర్లు!
