WhatsApp Plus | వాట్సాప్‌లో ఇక ప్రీమియం సేవలు.. డబ్బులు కడితేనే కొత్త ఫీచర్లు!

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్రీమియం ప్లాన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

  • By: raj |    latest-news |    Published on : Mar 07, 2026 6:17 AM IST
WhatsApp Plus | వాట్సాప్‌లో ఇక ప్రీమియం సేవలు.. డబ్బులు కడితేనే కొత్త ఫీచర్లు!

WhatsApp Plus | ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్రీమియం ప్లాన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కస్టమర్లకు మరింత పర్సనలైజేషన్ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను రూపొందిస్తున్నది. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది.

 

వాట్సాప్ యాప్‌నకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించే WABetaInfo.. ఈ వాట్సాప్ ప్లస్‌కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు యాప్‌ను తమకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా యాప్ ఐకాన్‌ను మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. WABetaInfo ప్రకారం, 14 రకాల ఐకాన్ స్టైల్స్‌ను వాట్సాఫ్ అభివృద్ధి చేస్తోంది. అలాగే యాప్ థీమ్, యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా నచ్చిన రంగుల్లోకి మార్చుకోవచ్చు.

 

ప్రస్తుతం వినియోగిస్తున్న వాట్సాప్ యాప్‌లో గరిష్టంగా మూడు చాట్‌లను మాత్రమే పిన్ చేయడానికి అవకాశం ఉంది. కానీ వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే 20 చాట్‌ల వరకు పిన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఫోన్‌లో ఉండే రింగ్‌టోన్లు, అలర్ట్ టోన్స్ కాకుండా వాట్సాప్ ప్లస్ ప్రత్యేకంగా రింగ్‌టోన్‌లను కస్టమర్లకు అందించనున్నట్లు సమాచారం. దీనివల్ల ఇతర యాప్‌ల నోటిఫికేషన్లతో గందరగోళం ఏర్పడకుండా ఈజీగా వాట్సాప్ మెసేజ్ అలర్ట్‌లను గుర్తించవచ్చు.

సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లకు ఎక్స్‌క్లూజివ్ స్టిక్కర్ ప్యాక్‌ను కూడా వాట్సాప్ అందించనుంది. దీనిద్వారా చాటింగ్ చేసేప్పుడు మెసేజ్‌లకు ఇచ్చే రియాక్షన్లను కాస్త విభిన్నంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ప్లస్‌లో షెడ్యూల్డ్ మెసేజెస్ ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. దీనిద్వారా నిర్దిష్ట సమయానికి మనకు నచ్చిన వ్యక్తులకు మెసేజ్ వెళ్లేలా సెట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫ్రీ వెర్షన్‌లో మార్పు ఏమీ ఉండదు

 

వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న వాట్సాప్ సేవల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పటివరకు అందిస్తున్న కాలింగ్, మెసేజింగ్, వాయిస్ నోట్ వంటి ప్రాన ఫీచర్లు అన్నీ ఉచితంగానే కొనసాగుతాయి. ప్రీమియం ప్లాన్ తీసుకోకపోయినా యాప్‌ను సాధారణంగా ఉపయోగించవచ్చు.

 

అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో!

వాట్సాప్ ప్లస్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఫీచర్ల గురించి WABetaInfo తెలిపినప్పటికీ.. ఇది అభివృద్ధి దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఎప్పుడు విడుదల అవుతుంది? సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఎలా ఉండొచ్చు? ఏమేమీ ఫీచర్లు ఉన్నాయి? అనే వివరాలపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులు ఇరువురికీ అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.