దాని సృష్టికర్తనే భయపెడుతున్న కొత్త ఏఐ మోడల్‌ క్లాడ్‌ మైతోస్‌ ప్రివ్యూ.. కట్టడి చేసిన ఆంత్రోపిక్‌

రోబో సినిమా గుర్తుందా? అందులో వశీకర్‌ పాత్ర పోషించిన రజనీకాంత్‌.. చిట్టి రోబోకు బ్లూచిప్‌ ఏర్పాటు చేస్తాడు. కానీ.. ప్రొఫెసర్‌ బోరా పాత్ర పోషించిన డేనీ దానికి రెడ్‌ చిప్ పెట్టడంతో విధ్వంసం మొదలవుతుంది. మళ్లీ వశీకర్‌.. అందులో బ్లూచిప్‌ పెట్టడంతో కథ ముగుస్తుంది. ఇప్పుడు ఏఐతో ఇదే సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లాడ్‌ మైతోస్‌ ప్రివ్యూ.. దాన్ని తయారు చేసిన ఆంత్రోపిక్‌ కంపెనీనే భయపెడుతున్నది.

దాని సృష్టికర్తనే భయపెడుతున్న కొత్త ఏఐ మోడల్‌ క్లాడ్‌ మైతోస్‌ ప్రివ్యూ.. కట్టడి చేసిన ఆంత్రోపిక్‌

ఏఐ అంటే కోడ్‌ రాయడానికో, సమాధానాలు పొందేందుకో, మనం అడినట్టుగా ఫొటోలు, వీడియోలు తయారుచేయడానికే కాదు.. రానున్న రోజుల్లో ఊహించని స్థాయిలో ఏఐ ఉండబోతున్నదనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మనిషి నియంత్రణలో లేకుండా పోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఏప్రిల్‌ 7, 2026న ఆంత్రోపిక్‌ తన కొత్త ఏఐ మోడల్‌ క్లాడ్‌ మైతోస్‌ ప్రివ్యూను విడుదల చేసింది. ఆప్పటి నుంచి టెక్‌ ప్రపంచం యావత్తూ దాని గురించే మాట్లాడుకుంటున్నది. దానికో కారణం ఉంది. ఇది మీరు అడిగిన ప్రశ్నలకు లోతైన సమాధానాలు ఇచ్చే సాదాసీదా చాట్‌బాట్‌ కాదు. అదొక డిజిటల్‌ డిటెక్టివ్‌. దానికి హ్యాకర్‌కు ఉండే మెదడు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. దీన్ని తయారు చేసిన కంపెనీయే దీని గురించి భయపడేంత స్థాయిలో రూపొందిందని నిపుణులు అంటున్నారు.

చిన్న ప్రాంప్ట్‌తో సరి..

చిన్న ఉదాహరణతో చెప్పాలంటే.. ‘కంప్యూటర్‌లో ఉన్న ఫలానా సాఫ్ట్‌వేర్‌లో భద్రతా లోపాలు ఏమున్నాయో కనుక్కో..’ అనే చిన్న సూచన చేస్తే చాలు. ఆ వెంటనే ఆ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న వేల కొద్దీ కోడ్‌లను చదివి.. బగ్స్‌ ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో కనిపెట్టి.. దాన్ని తొలగించేందుకు దారి చూపెడుతుంది. ఇదంతా దానంతట అది చేసేదే. ఎక్కడా మానవ జోక్యం అవసరం లేదు. ఇదీ మైతోస్‌ చేసే పని. దీనిని టెస్ట్‌ చేయడం ప్రారంభించిన కొద్ది వారాల్లోనే ప్రతి ప్రధాన ఆపరేటింగ్‌ సిస్టమ్‌, ప్రతి ముఖ్యమైన వెబ్‌ బ్రౌజర్‌, ఇతర ముఖ్యమైన సాఫ్ట్‌వేర్‌లలో డెవలపర్లు అంతకు ముందు గుర్తించని వేల కొద్దీ ‘జీరో–డే’ లోపాలను బయటపెట్టింది. సాఫ్ట్‌వేర్‌ లేదా యాప్‌ భద్రతా వ్యవస్థలో ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్న లోపాలను ‘జీరో –డే వర్నలబిలిటీస్‌ అంటారు.

సాధారణంగా ఇటువంటి తీవ్రమైన లోపాలను కనిపెట్టడానికి నిపుణులైన ఎథికల్‌ హ్యాకర్స్‌ టీమ్‌కు చాలా రోజులు పడుతుంది. కొన్ని సందర్భాల్లో వారాలకు వారాలు తీసుకోవచ్చు. దానికితోడు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. కానీ.. ఈ పనిని మైతోస్‌ కొన్ని గంటల వ్యవధిలో అది కూడా కొన్ని డాలర్ల ఖర్చుతో చేస్తున్నది. ఫ్రీబీఎస్‌డీకి చెందిన ఎన్‌ఎఫ్‌ఎస్‌ సర్వర్‌లో పదిహేడు సంవత్సరాల నాటి రిమోట్‌ కోడ్‌ ఎగ్జిక్యూషన్‌ బగ్‌ను కనిపెట్టింది. ఓపెన్‌బీఎస్‌డీలోని 27 ఏళ్ల నాటి బగ్‌ను గుర్తించింది. వీటిని వేల మంది నిపుణులైన డెవలపర్లు దశబ్దాలుగా కనిపెట్టలేకపోయారు.

అంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఒకటుంది. సైబర్‌ సెక్యూరిటీలో పెద్దగా శిక్షణ పొందని ఇంజినీర్లు సైతం మైతోస్‌ను ఉపయోగించి ఈజీగా హ్యాకింగ్‌ టూల్స్‌ తయారు చేశారని నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలోనే ఆంత్రోపిక్‌ అసాధారణ నిర్ణయం తీసుకున్నది.

  • మైతోస్‌ను బయట మార్కెట్‌లోకి విడుదల చేయవద్దని తీర్మానించుకున్నది.
  • దానికి బదులు గ్లాస్‌వింగ్‌ పేరిట ప్రాజెక్టును ప్రారంభించింది.
  • ఇది ప్రధాన టెక్‌ కంపెనీల కన్సార్టియం. ఇందులోని 40కిపైగా కంపెనీలకు సేవలు అందిస్తుంది.
  • మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, యాపిల్‌, అమెజాన్‌, ఏడబ్ల్యూఎస్‌, నివిడా వంటి కంపెనీలు ఈ కన్సార్టియంలో ఉన్నాయి.
  • హ్యాకర్‌లు దాడి చేయడానికి ముందే రక్షణ పొందటం, బగ్స్‌ను కనుగొని, వెంటనే వాటిని తొలగించడం/మరమ్మతు చేయడం, తద్వారా సైబర్‌ ఎటాక్స్‌ను ముందుగానే నివారించడం దీని ఉద్దేశం.

దుష్టశక్తుల చేతిలో పడితే వినాశమే

రెండు వైపులా పదునున్న కత్తిలాంటి ఈ ఏఐ టెక్నాలజీ.. పొరపాటును సంఘ విద్రోహ శక్తుల చేతిలోకో, లేదా హ్యాకింగ్‌ మాఫియా చేతిలోకో వెళ్లిందేంటే పెను ప్రమాదాలు చోటు చేసుకుంటాయని సైబర్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. తగిన సేఫ్‌గార్డ్స్‌ లేకుండా ఇటువంటి మోడల్‌ను ఎవరైనా తయారు చేస్తే.. కనిపెట్టడానికి వీల్లేని విధంగా బగ్స్‌ తయారుచేసి సైబర్‌ ప్రపంచాన్ని హ్యాకర్స్‌ గడగడలాడిస్తారని అంటున్నారు. ఇప్పటికి ఈ స్థాయిలో ఆంత్రోపిక్‌ ఒక మోడల్‌ను తయారు చేసింది. భవిష్యత్తులో మరికొన్ని కంపెనీలు ఇదే స్థాయిలో తయారుచేయబోవనే గ్యారెంటీ ఏమీ లేదు. ఆ సంగతిని ఆంత్రోపిక్‌ సైతం అంగీకరిస్తున్నది. డౌన్‌లోడ్‌ చేసుకుని, వ్యక్తిగతంగా మార్చుకోగలిగిన ఓపెన్‌ వెయిట్‌ ఏఐ మోడళ్లు వస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి పాత సాఫ్ట్‌వేర్‌లు, చిన్న చిన్న కంపెనీలకు ఇది పెనుముప్పుగా దాపురించే అవకాశాలు లేకపోలేదన్న చర్చలు కూడా సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

Economic Survey | ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలకు ముప్పేనా.. ఆర్థిక సర్వేలో ఆసక్తికర విషయాలు..!
AI Replacing Software Jobs | ‘ఏఐ’తో లక్షల ఉద్యోగాలు ఊస్ట్.. తీవ్ర ఒత్తిడిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు!
Brain Weaponization | ఇక మెదడే మారణాయుధం! చదవితేనే మైండ్‌ బ్లాక్‌ అయ్యే న్యూరోటెక్నాలజీ అప్‌డేట్‌!