Brain Weaponization | ఇక మెదడే మారణాయుధం! చదవితేనే మైండ్‌ బ్లాక్‌ అయ్యే న్యూరోటెక్నాలజీ అప్‌డేట్‌!

ఒక వ్యక్తిని ఆజ్ఞాపిస్తే ఒక పని చేసుకుని వస్తాడు! ఒకరిని అంతం చేయాలనుకుంటే సుపారీ తీసుకుని పనిపూర్తి చేసే వాళ్లు ఉన్నారు! కానీ.. ఒకరి మనసును వేరొకరి నియంత్రణలోకి తీసుకుని ఒక విధ్వంసానికి, ఒక మారణహోమానికి ప్రేరేపిస్తే? అదెలా సాధ్యమంటారా? అవుననే హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకూ సైన్స్‌ఫిక్షన్‌ సినిమాల్లో చూసినవి అతి త్వరలో మన అనుభవంలోకి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదే న్యూరోటెక్నాలజీ!

Brain Weaponization | ఇక మెదడే మారణాయుధం! చదవితేనే మైండ్‌ బ్లాక్‌ అయ్యే న్యూరోటెక్నాలజీ అప్‌డేట్‌!

Brain Weaponization | గడిచిన దశాబ్దాలుగా మానవ సమాజం యుద్ధాల గురించి భయపడింది.. అణ్వాయుధాల ప్రయోగంతో వణికిపోయింది. డ్రోన్‌ యుద్ధాలు, సైబర్‌ ఎటాక్స్‌తో నిద్రలేని రాత్రులు గడుపుతున్నది. తాజాగా ఏఐ దాడులు ప్రజల్లోనే కాదు.. యావత్‌ వ్యవస్థల్లో కొత్త భయాన్ని నింపుతున్నాయి. కానీ.. వాటన్నింటికీ మించిన ఒక యుద్ధానికి మానవ మెదడు రణక్షేత్రంగా మారడానికి ఎంతో కాలం పట్టబోదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి దాకా సైన్స్‌ ఫిక్షన్‌లో చూసినవి.. అతి త్వరలో మన ముందు సాక్షాత్కరించబోతున్నాయని చెబుతున్నారు. ఆ సమయంలో యుద్ధభూమి.. మనిషి మెదడేనని హెచ్చరిస్తున్నారు.

మానవ ప్రవర్తన, మనిషిలో భయాలు, కోపాలు, ఆక్రోశాలు, మనిషి తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ ఎందుకు? ఎలా పనిచేస్తాయో న్యూరోసైన్స్‌ అత్యంత వేగంగా తెలుసుకుంటున్నది. నిజానికి శాస్త్రవిజ్ఞానం ఎప్పుడూ సమాజ హితాన్నే కోరుకుంటుంది. కానీ.. అదే శాస్త్రవిజ్ఞానాన్ని ప్రభుత్వాలు తప్పుదోవ పట్టిస్తున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో అభివృద్ధి చెందే న్యూరో సైన్స్‌ను కూడా ప్రభుత్వాలు దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలను శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. మెదడుకు మత్తునిచ్చే రసాయనాలు, మనిషి ఆలోచనలను కకావికలం చేసే పద్ధతులు, మనిషి వ్యవహార శైలిని మార్చివేయగల ప్రయోగాలు.. వీటినే భవిష్యత్తులో యుద్ధ సామగ్రిగా మార్చే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చరిత్రలో దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఇది మరింత భయానకంగా తయారు అవుతుందని అంటున్నారు.

ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్రాల్లో న్యూరోసైన్స్‌ ఒకటి. అయితే.. దానిని నైతిక మార్గాల్లో ఉపయోగించడం కూడా అంతే వేగంగా ఉందని చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. పీటీఎస్‌డీ, అల్జీమర్స్‌, లేదా డిప్రెషన్‌లో ఉన్నవారికి చికిత్స చేసేందుకు ఉపయోగించే సాంకేతికతను ప్రభుత్వాలు తారుమారు చేసి, తమ ప్రయోజనాలను రక్షించుకునేందుకు ఉపయోగించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. మానవ స్పృహ, అవగాహన, జ్ఞాపకశక్తి లేదా ప్రవర్తనలపై దాడి చేయగల, లేదా మార్చివేయగల అధునాతన, ప్రాణాంతకమైన బ్రెయిన్ వెపన్స్‌ ఇక ఎంతమాత్రమూ సైన్స్‌ఫిక్షన్‌కే పరిమితం కాదని, బ్రాడ్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన మైఖలే్‌ క్రౌలీ, మాల్కం డాడో వాదిస్తున్నారు. వారు రచించిన న్యూరోసైన్స్‌, ఫార్మకాలజీ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ అనే పుస్తకాన్నిరాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ ప్రచురించింది.

ఏంటీ న్యూరోసైన్స్‌ చేయబోయేది?

మానసికంగా భయం ఉన్నప్పుడు దానిని తగ్గించే సాంకేతికత, చికిత్సా విధానాలు ఉన్నాయి. అది సాధ్యమైనప్పుడు మనిషిలో భయాన్ని పెంచడం కూడా సాధ్యమేనని అంటున్నారు. అల్లకల్లోలంగా ఉన్న మనుసును శాంతపర్చే పద్ధతి ఉన్నప్పుడు మొత్తంగా మెదడు పనిచేయకుండా చూడటమూ సాధ్యమేనంటున్నారు. నిర్ణయాలు తీసుకునే శక్తిని మెరుగుపర్చేందుకు శాస్త్రం ఉపయోగపడినప్పుడు అదే శాస్త్రం ఉపయోగించి.. ఆ నిర్ణయాలను ప్రభావితం చేయడం కూడా సులభమేనని పేర్కొంటున్నారు. ఏ సాంకేతిక అయినా తటస్తంగానే ఉంటుందని కానీ.. ప్రభుత్వాలు మాత్రం కాదని గుర్తు చేస్తున్నారు.

గత అనుభవాలేంటి?

  • బ్రెయిన్‌ కెమిస్ట్రీని ఆయుధంగా మార్చేసిన ఉదంతాలు ఇప్పటికే ఉన్నాయి.
  • ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఇంటరాగేషన్‌ల సమయంలో మతిమరుపు కలిగించే రసాయనాలు వాడారు.
  • మనసు రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు సీఐఏ తన ప్రయోగాల ద్వారా ప్రయత్నాలు చేసింది.
  • మనిషి ప్రవర్తనను నిర్దేశించే ఔషధాలపై నాటి సోవియట్‌ రష్యా అన్వేషించింది. 2002 మాస్కో థియేటర్‌ దాడి సమయంలో ఫెంటానిల్‌ ఆధారిత గ్యాస్‌ను రష్యా ఉపయోగించింది. దీని ప్రభావంతో 120 మంది బందీలు చనిపోయారు.
    వీటిని గమనిస్తే.. వ్యవస్థపై సంపూర్ణ నియంత్రణను ప్రభుత్వాలు కోరుకున్న సమయాల్లో నైతికత అనేది.. అట్టడుగు స్థానానికి వెళ్లిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు.

భయం ఎప్పుడు కలుగుతుంది? ఆక్రోశం దేన్ని పెంచుతుంది? విధేయతను నియంత్రించే నాడీ సంబంధ సర్క్యూట్‌లు ఏమిటి? జ్ఞాపకాలు ఎలా ఏర్పడతాయి? ఏ ఆలోచనలను అడ్డుకోవచ్చు? ఏ భావోద్వేగాలను తగ్గించవచ్చు? ఏ భావోద్వేగాలను పెంచవచ్చు? వీటన్నింటికి సంబంధించి జ్ఞానం చేతిలో ఉంటే.. ప్రభుత్వాలకు తుపాకులతో పనిలేదని, కొన్ని బటన్స్‌ వారికి కావల్సిన పని చేసిపెడతాయని నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి రసాయనిక ఆయుధాలు వాడటాన్ని అంతర్జాతీయ చట్టాలు నిషేధిస్తున్నాయి. కానీ ఒక లోపం ఏమిటంటే.. చట్ట అమలులో మాత్రం స్పష్టత లేదు. దీంతో చాలా దేశాలు మత్తెక్కించే గ్యాస్‌లు, ఆలోచనలను గందరగోళం పర్చే, భావోద్వేగాలను దెబ్బతీసే రసాయనాలు, విధేయతను పెంచే కంప్లయన్స్‌ ఔషధాలు.. వీటిని ప్రజల మీద ఉపయోగించినా.. ప్రజా భద్రతకింద తప్పించుకునేవాళ్లు.

దుష్ఫలితాలేంటి?

  • విప్లవాత్మక న్యూరోసైన్స్‌ అత్యంత కఠినమైన అంతర్జాతీయ నియంత్రణలు కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. లేని పక్షంలో మెదడును లక్ష్యంగా చేసుకుని ఈ టెక్నాలజీని అత్యంత దారుణంగా దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
  • ప్రధానంగా.. ప్రజా నిరసనలను అణచివేయడానికి, సమూహాలను నియంత్రించేందుకు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు, ప్రవర్తనలను మార్చి, విధేయులుగా తయారు చేసుకునేందుకు దీనిని దీనిని దుర్వినియోగం చేసే ఆస్కారం ఉందని హెచ్చరిస్తున్నారు.

పరిశోధకుల డిమాండ్లివే..

న్యూరోసైన్సెస్‌పై ప్రపంచవ్యాప్త నియంత్రణ అవసరమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఒకసారి ఈ ఆయుధాలు ఉనికిలోకి వస్తే.. వాటిని కనిపెట్టడం కూడా దుస్సాధ్యమని చెబుతున్నారు. అందుకే..