Gold in human body | మానవుల శరీరంలో బంగారం, వెండి? ఎలా వచ్చాయి? శాస్త్రవేత్తలు చెబుతున్న అద్భుత నిజం..

మన ఒంట్లోని రక్తంలో ఉన్న ఇనుము.. ఎక్కడి నుంచి వచ్చింది? మనం తినే పాల కూర నుంచా? లేక వందల కోట్ల సంవత్సరాల క్రితం పేలిపోయిన నక్షత్రాల నుంచి వచ్చిందా? శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికర వాస్తవాలు..

Gold in human body | మానవుల శరీరంలో బంగారం, వెండి? ఎలా వచ్చాయి? శాస్త్రవేత్తలు చెబుతున్న అద్భుత నిజం..

Gold in Human Body | మనిషి శరీరం మాసం, రక్తం, ఎముకల సముదాయం! ప్రతి వ్యక్తి సహజంగా అనుకునే విషయమే ఇది అంటారా? అక్కడే వస్తున్నా.. ఈ విషయంలో ఆధునిక ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని చెబుతున్నాయి. మన శరీరంలో ఇనుము, కాల్షియం, కాపర్‌ వంటి మూలకాలు కూడా ఉన్నాయి. అలాగే.. అతి స్వల్పంగా బంగారం, వెండి వంటివి కూడా ఉన్నాయట. ఇవన్నీ ఒకప్పుడు నక్షత్రాల్లో తయారైనవేనని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. మన శరీరంలోని ఈ మూలకాల పుట్టుక కథ తెలియాలంటే.. మనం కోట్ల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో చోటు చేసుకున్న సూపర్‌నోవా అనే మహా పేలుళ్ల గురించి తెలుసుకోవాలి.

ఏమిటీ సూపర్‌నోవా?

సూపర్‌నోవా అనేది ఒక భారీ నక్షత్రం.. తన జీవితచరమాంకంలో పేలిపోవడం. ప్రతి నక్షత్రానికి లోపల అణు ఇంధనం ఉంటుంది. అది పూర్తిగా అయిపోయిన తర్వాత.. సదరు నక్షత్రం తన గురుత్వాకర్షణ శక్తిని తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆ కూలిపోవడమే భయంకరమైన పేలుడుగా మారుతుంది. ఆ సమయంలో విడుదలయ్యే శక్తి.. కొన్ని రోజులపాటు.. కొన్ని సందర్భాల్లో కొన్ని వారాలపాటు వెలుతురు చిమ్ముతుంది. ఒక గెలాక్సీలోని కోటానుకోట్ల నక్షత్రాల వెలుతురుతో ఈ వెలుగు సమానంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇనుముకంటే భారీ మూలకాలైన బంగారం, వెండి, యురేనియం వంటివి.. సూపర్‌నోవా పేళుళ్లు లేదా న్యూట్రాన్‌ నక్షత్రాలు ఢీకొనడంతో తయారవుతాయని నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ వంటి సంస్థల పరిశోధనలు చెబుతున్నాయి.

ai creation of A massive supernova explosion

భూమిపై ఉన్న మూలకాల కథేంటి?

భూమి ఏర్పడటానికి ముందు మన సౌర కుటుంబం ఉన్న ప్రాంతంలో పాత నక్షత్రాలు పేలి.. వాటి అవశేషాలు అంతరిక్షంలో వ్యాపించాయి. ఆ ధూళి, వాయువుల నుంచే సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు ఏర్పడ్దాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే.. ఇప్పుడు మన భూమిలో ఉన్న ఇనుము, కాల్షియం, కాపర్‌, బంగారం వంటి మూలకాల మూలం.. పాత నక్షత్రాలేనన్నమాట. ఈ విషయాన్ని మూలకాల ఐసోటోప్స్‌పై ల్యాబ్స్‌లో చేసిన పరిశోధనలు, ఉల్కలపై చేసిన విశ్లేషణలు స్పష్టంగా నిరూపించాయి.

మన ఒంట్లో నిజంగానే ఈ మూలకాలు ఉన్నాయా?

వైద్య శాస్త్రం ప్రకారం.. మన ఒంట్లో ఇనుము తప్పనిసరిగా ఉంటుంది. రక్తంలోని హీమోగ్లోబిన్‌.. దాని ఆధారంగానే ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని ప్రాంతాలకూ తీసుకుపోతుంది. కాల్షియం అనేది ఎముకలు, దంతాల నిర్మాణానికి అవసరం. ఇక కాపర్‌, జింక్‌, మెగ్నీషియం వంటి మూలకాలు అనేక ఎంజైమ్‌ల పనితీరుకు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇవే కాకుండా బంగారం, వెండి వంటి లోహాలు కూడా మన శరీరంలో ఉంటాయి. కాకపోతే.. చాలా స్వల్ప (trace) పరిమాణంలోనే. ఇవి శరీరానికి కీలకమైన జీవక్రియల నిర్వహణలో లేకపోయినా.. భూమిపై ప్రతి జీవిలోనూ సహజంగా కనిపించే మూలకాల్లో భాగమే.

అంటే మనం నక్షత్రాల నుంచి పుట్టామా?

శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే అవును. మన శరీరంలోని ఇనుము ఒకప్పుడు ఒక నక్షత్రం లోపల తయారైంది. సదరు నక్షత్రం పేలిన సమయంలో దాని అవశేషాల నుంచి భూమి ఏర్పడింది. ఆ భూమిలోని మూలకాలతో మన శరీరం నిర్మితమైంది. అందుకే ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కార్ల్‌ సాగన్‌.. ‘వీ ఆర్‌ మేడ్‌ ఆఫ్‌ స్టార్ స్టఫ్‌..’ అని అంటారు. అంటే మనమంతా నక్షత్రాల పదార్థంతోనే తయారయ్యాం. ఇది కవిత్వం కాదు.. తత్వవాదమూ కాదు.. ఇది ఆధునిక ఖగోళ, అణు భౌతిక శాస్త్రం నిర్ధారించిన శాస్త్రీయ వాస్తవం.

ఇక్కడ కొందరికి ఒక అనుమానం రావచ్చు.. ఇనుము, బంగారం, వెండి.. ఇవన్నీ లోహాలు కదా? మన శరీరంలో ఎలా ఉంటాయి? దానికీ సమాధానం చూద్దాం.

  • వస్తువుల తయారీకి వాడే ఇనుము, మన శరీరంలోని ఇనుము.. రెండూ ఒకటే మూలకం. అదే.. Iron – fe.
  • ఇనుము రసాయన గుర్తు (అటామిక్‌ నంబర్‌ 26).
  • కానీ.. వాటి రూపం, వాడుక వేర్వేరు.
  • కాస్త వివరంగా చెప్పుకోవాలంటే..
  • ఇనుపరాడ్‌లోని ఇనుము, రక్తంలోని ఇనుము.. ఈ రెండింటి మూలకం ఒక్కటే.
  • వస్తువులు, రాడ్లు, కత్తులు, వాహనాల తయారీకి ఉపయోగించే ఇనుము మెటాలిక్‌ ఫామ్‌లో ఉంటుంది.
  • శరీరంలోని ఇనుము.. హీమోగ్లోబిన్‌, ఫెరిటిన్‌ వంటి మాలిక్యూల్స్‌లో ఇమిడి ఉంటుంది. అది అయాన్‌ ఫామ్‌ (Fe²⁺ లేదా Fe³⁺)లో ఉంటుంది.
  • అదే ఆక్సిజన్‌ను రక్తం ద్వారా శరీరంలోని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లే పని చేస్తుంది.

మన శరీరంలోని ఇనుము.. మనం తినే పాలకూర, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, మాంసాహారం నుంచి సమకూరుతుంది. వాటిలోని ఇనుము.. శరీరంలో ఇంకిపోగల కెమికల్‌ రూపంలో ఉంటుంది. శరీరం దాన్ని మార్చుకొని రక్తంలో కలుపుకొంటుంది. మరో ఉదాహరణ చెప్పాలంటే.. నీరు, ఐస్‌, ఆవిరి.. ఈ మూడూ కూడా ఒకటే పదార్థం. అదే H₂O. కానీ.. వాటి రూపం మారితే వాటి ప్రవర్తన కూడా మారుతుంది. సరిగ్గా ఇదే పద్ధతిలో ఇనుపరాడ్‌లోని ఇనుము, రక్తంలోని ఇనుము కూడా!

Read Also |

Washington State Housing Crisis | నిత్యం కత్తులు దూసే రెండు సంస్థలు.. ఇంటి వసతి కోసం చేతులు కలిపాయి!
Kids Smartwatch | పిల్లల కోసం షావుమీ ప్రత్యేక స్మార్ట్​ వాచ్​ : భద్రతే ముఖ్యం
Ponguleti Srinivas : ధరణి పోర్టల్ అక్రమాలు.. భూ భారతితో రట్టు