Telangana Corruption | బాగో ఒడిశా… చలో ఛత్తీస్‌గఢ్.. కాంగ్రెస్ ఏలుబడిలో కమీషన్ల మోత.. కాంట్రాక్టర్ల బేజార్!
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి కేంద్రీకృతంగా జరిగేందన్న చర్చ అప్పట్లో నిత్యం వినిపించేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వికేంద్రీకరణ జరిగినప్పటికీ రెట్టింపు అయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికి డబ్బులు ముట్టచెప్పినా సరే సకాలంలో బిల్లులు చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
విధాత, హైదరాబాద్:
Telangana Corruption | తెలంగాణ ప్రభుత్వంలో అవినీతిపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. టెండర్ దక్కించుకునే సమయంలోనే కాదు.. పని పూర్తి చేసిన తర్వాత బిల్లుల చెల్లింపులకు సైతం ముడుపులు ముట్టచెప్పుకోవాల్సి వస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు జంకుతున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనులకు టెండర్లు వేసేందుకు పెద్దగా ఆరాటపడటం లేదని, దానికి బదులుగా కేంద్ర ప్రభుత్వ పనులకు టెండర్లు వేసుకుంటున్నారని కాంట్రాక్టర్ల వర్గాలు చెబుతున్నాయి.
అధికారవర్గాలు, కాంట్రాక్టు అసోసియేషన్ వర్గాలు చెబుతున్న కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో నానాటికి పెచ్చరిల్లుతున్న అవినీతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రతి పనికీ నిర్దిష్ట కమీషన్ నిర్ణయించడమే కాకుండా.. ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. దీంతో ఇక్కడ పనులు మానేసి.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పనులు వెతుక్కుంటున్నారని చెబుతున్నారు.
అవినీతి ఇప్పటిది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ కలుపుకొని పది శాతం వరకూ కమీషన్లు ఉండేవని, తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆరెస్ హయాంలో అది కాస్తా రెట్టింపు అయిందనే వాదన వినిపిస్తున్నది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరింత పెరిగి, మోయలేని భారంగా మారిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అడిగినట్లు కమీషన్లు ముట్టచెప్పితే పనిలో నాణ్యత లోపిస్తుందని, నాణ్యతలో రాజీ లేకుండా చేయాలంటే కమీషన్లు ఇవ్వడం సాధ్యం కాదని ఒక కాంట్రాక్టర్ వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంతకు దిగజారిందనేది అర్థమవుతుంది.
కొద్ది రోజుల క్రితం విద్యార్థుల యూనిఫామ్ కోసం టెండర్లు ఆహ్వానించారు. ఎవరూ రాకపోవడంతో మొత్తం నాలుగుసార్లు టెండర్లు ఆహ్వానించినా స్పందన లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. కింది నుంచి పై స్థాయి వరకు లంచాలు ముట్టచెప్పుకోవడంతో పాటు పని పూర్తయిన తర్వాత బిల్లుల కోసం సచివాలయంలో ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేసి, మళ్లీ ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తున్న కారణంగానే ఎవరూ ముందుకు రాలేదని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఈ టెండర్ నోటిఫికేషన్‌ను కూడా యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు కొద్ది రోజుల ముందు జారీ చేశారు. సాధారణంగా నోటిఫికేషన్ చూసిన తరువాత పలువురు ముందుకు వచ్చి టెండర్ వేస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, చెల్లింపుల్లో కమీషన్లు తీసుకోవడాన్ని గమనించి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రాథమికంగా తేలింది. మరో మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ స్పందించలేదని తెలుస్తున్నది. దీంతో చేసేది లేక అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారని సమాచారం.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి కేంద్రీకృతంగా జరిగేందన్న చర్చ అప్పట్లో నిత్యం వినిపించేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వికేంద్రీకరణ జరిగినప్పటికీ రెట్టింపు అయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికి డబ్బులు ముట్టచెప్పినా సరే సకాలంలో బిల్లులు చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతేడాది తెలంగాణ సచివాలయంలో చిన్న కాంట్రాక్టర్లు తమ పెండింగ్ బకాయిల కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చాంబర్ ముందు మెరుపు ఆందోళనకు దిగడం చిన్న కాంట్రాక్టర్ల దుస్థితికి అద్దం పట్టింది.
ఉమ్మడి రాష్ట్రంలో కాని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ.. ఇప్పటి వరకు పెండింగ్ బకాయిల కోసం మెరుపు సమ్మెకు దిగిన సందర్భాలు ఎప్పుడూ లేవు. మొదటిసారి చిన్న కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. పైగా.. ఎన్నడూ లేనంతంగా ఆర్థిక శాఖపై ఆరోపణలు రావడంతో ఈ మధ్య కాలంలో సచివాలయంలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చాంబర్ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులను మోహరించి, బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అనుమతి ఉంటే తప్ప ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడం లేదు.
గతేడాది ఒక ముఖ్య నేత సోదరుడు రాష్ట్రంలోని మునిసిపాలిటీలలో పనులు అప్పగించేందుకు కొందరు కాంట్రాక్టర్లను పిలిపించి మాట్లాడారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.450 కోట్ల విలువైన పనులు ఉన్నాయని, ఎవరైనా ముందుకు వస్తే నామినేషన్ పద్ధతిపై అప్పగిస్తానని ఆయన ప్రతిపాదన చేయగా.. అంతా విని సరేనన్న కాంట్రాక్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారే తప్పించి.. తెల్లారి ఎవ్వరూ ముందుకు రాలేదట. విషయం ఏంటని ఆరా తీయగా.. పనులు దక్కించుకుని పూర్తి చేసేందుకు కమీషన్లు ఇస్తున్నామని, బిల్లుల కోసం అదనంగా కమీషన్లు ఇవ్వాల్సి వస్తోందనే ఎవ్వరూ ముందుకు రాలేదని తెలిసి.. ముఖ్య నేత సోదరుడు కంగుతిన్నారని సమాచారం. రెండు కమీషన్ల కారణంగా ఏమీ మిగలడం లేదని, ఆదాయం ఉంటేనే కదా పనులు చేసేది అంటూ కాంట్రాక్టర్లు నిట్టూర్చారని తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు బదులు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్నది. చాలా మంది కాంట్రాక్టర్లు ఇక్కడ పనులు చేయడం బదులు ఊరుకోవడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారనే చర్చలు వినిపిస్తున్నాయి. తమ వద్ద సంవత్సరాలుగా పనిచేస్తున్న కూలీలు, ఉద్యోగుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి పనులు తీసుకుంటున్నారని తెలుస్తున్నది. ఎక్కువగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వెళుతున్నారని సమాచారం. ఆ రాష్ట్రాల్లో అన్ని కమీషన్లూ కలుపుకొన్నా.. పది శాతం మించడం లేదని, వేధింపులు కూడా లేవని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇక్కడ అయితే 30 శాతం వరకు కమీషన్లు ముట్టచెప్పుకోవాల్సి వస్తున్నదని, ఈ స్థాయిలో కమీషన్లు ఇస్తే తమకు ఏమీ మిగలదని, పనుల నాణ్యత కూడా ఉండదని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
Read Also |
TUWJ| అక్రిడిటేషన్ల సవరణ జీవోపై టీయూడబ్ల్యూజే హర్షం
silver, gold price hike| వెండి, బంగారం ధరల పరుగు..10వేలు పెరిగిన వెండి
HYD to BNG – NH-44 | రూపుమారిన హైదరాబాద్-బెంగళూరు హైవే – గ్రీన్ఫీల్డ్ నుండి యాక్సెస్ కంట్రోల్డ్ : 5 గంటలే ప్రయాణం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram