ACB cases weakened|సర్కార్ నిర్వాకం..ఏసీబీ కేసుల నిర్వీర్యం

ప్రభుత్వ వైఖరి కారణంగా ఏసీబీ కేసులు నిర్వీర్యం అవుతున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నర్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి విమర్శించారు. వందల కోట్ల రూపాయలు అవినీతి చేసిన అధికారులు.. రాజకీయ నేతల పైరవీలతో తప్పించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 100 శాతం కేసుల్లో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే శిక్షలు పడుతున్నాయన్నారు.

ACB cases weakened|సర్కార్ నిర్వాకం..ఏసీబీ కేసుల నిర్వీర్యం

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ(Telangana Government) వైఖరి కారణంగా ఏసీబీ కేసులు నిర్వీర్యం(ACB cases weakened) అవుతున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నర్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి(Padmanabha Reddy) విమర్శించారు. వందల కోట్ల రూపాయలు అవినీతి చేసిన అధికారులు.. రాజకీయ నేతల పైరవీలతో తప్పించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 100 శాతం కేసుల్లో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే శిక్షలు పడుతున్నాయన్నారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అవినీతి అధికారులు సైతం మరోసారి అదే శాఖలో విధులు నిర్వహిస్తున్నారని, మళ్లీ తమ చేతి వాటం కొనసాగిస్తున్నారని తెలిపారు. సచివాలయంలో పైరవీలు చేసుకుని అవినీతి అధికారులు కేసుల నుంచి బయటపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో భారీగా అవినీతి జరుగుతుందన్నారు. ప్రజలు లంచం ఇవ్వకపోతే పనులు కావడం లేదు అన్నది సాధారణమైపోయిందని వ్యాఖ్యానించారు. దీంతో అధికారులు, ఉద్యోగులు ఆదాయానికి మించి ఆస్తులు పోగేస్తున్నారన్నారు.

పైరవీలతో వీగిపోతున్న కేసులు

ఏసీబీ కేసుల ప్రాసిక్యూషన్ కోసం సచివాలయం నుండి అనుమతులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని పద్మనాభారెడ్డి ఆరోపించారు. నెలలోపుల ప్రాసిక్యూషన్ కు అనుమతివ్వాలన్నారు. నెలలోపున చార్జ్ షీట్ వేసేలా చర్యలు ఉండాలన్నారు. ఐదేళ్లలో ఏసీబీ అధికారులు 660 కేసులు నమోదు చేశారని, ఏడాదికి సగటున 120కేసులు నమోదు చేస్తున్నారని..ఇందులో 12కేసులు శిక్షలు పడ్డాయని, 10కేసులు విచారణ పూర్తయ్యాయన్నారు. ఏసీబీ కేసులలో 50శాతానికి పైగా వీగిపోతున్నాయన్నారు. ఏసీబీ కేసులంటే అధికారులు, ఉద్యోగులకు భయం అనేది లేకుండా పోయిందన్నారు. అందుకే అవినీతి కొనసాగుతుందన్నారు. పైరవీలు చేసుకోలేని వారి కేసులు మాత్రమే పూర్తిస్థాయి విచారణ జరుగుతోందన్నారు. పట్టుబడిన వారిలో కేవలం 25 శాతం మందిపై మాత్రమే ప్రభుత్వం ప్రాసిక్యూషన్ కు అనుమతినిస్తోందని..మిగిలిన 75 శాతం మందిపై కేవలం శాఖాపరమైన చర్యల పేరుతో లేదా ట్రిబ్యునళ్లకు బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వం వారిని పరోక్షంగా కాపాడుతోందని ఆరోపించారు. సగం మందికి పైగా సాంకేతిక కారణాలతో నిర్దోషులుగా బయటపడుతున్నారని.. 2023-24లో 19 కేసులు క్లోజ్ అవ్వగా, కేవలం 9 మందికి మాత్రమే శిక్ష పడిందని తెలిపారు.

ప్రభుత్వానికి కీలక సూచనలు

ఏసీబీ కేసుల దర్యాప్తు విషయంలో ప్రభుత్వానికి మూడు రకాల సూచనలు చేశాం అని పద్మనాభారెడ్డి తెలిపారు. ఏసీబీ కేసులలో సచివాలయం నుండి ప్రాసిక్యూషన్ కి వెంటనే అనుమతులు ఇవ్వాలని, ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ అధికారిని కేసు తేలే వరకు మళ్లీ విధుల్లో తీసుకోవద్దు అని, రెండు, పదోన్నతులు ఇవ్వరాదని ..మూడు ఏళ్లలోనే ఏసీబీ కేసులు దర్యాప్తు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పద్మనాభరెడ్డి సూచించారు.