Finance Department Pending Files | డిప్యూటీ సీఎం చాంబర్‌లో కదలని ఫైళ్ల ‘కత’లు! ఆర్థిక ప్రయోజనాలుంటేనే మోక్షం?

తెలంగాణ ఆర్థిక మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చాంబర్‌లో సాధారణ ఫైళ్లు మోక్షానికి నోచుకోవడం లేదని సచివాలయ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆర్థిక ప్రయోజనాలు ఉన్న ఫైళ్లకే మోక్షం కలుగుతున్నదనే విమర్శలు కూడా సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Finance Department Pending Files | డిప్యూటీ సీఎం చాంబర్‌లో కదలని ఫైళ్ల ‘కత’లు! ఆర్థిక ప్రయోజనాలుంటేనే మోక్షం?

హైదరాబాద్, అక్టోబర్ 8 (విధాత ప్రతినిధి):

Finance Department Pending Files | ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, ఇతర ఉద్యోగుల బిల్లులు, ఉద్యోగుల పోస్టింగులు, చిన్న చిన్న పనులకు సంబంధించిన బిల్లులు.. ఇలా సాధారణమైన వివిధ రకాల బిల్లులకు చెందిన ఫైళ్లు నిత్యం పెండింగే… ఇలాంటి సాధారణ ఫైల్ ఒకటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉందని సచివాలయ ఉద్యోగి ఒకరు చెప్పారు. సాధారణ ఫైళ్లను నిత్యం పెండింగ్ లో పెడుతున్న ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాత్రం ఆర్థిక ప్రయోజనాలున్న ఫైళ్లనే క్లియర్ చేస్తారన్న ఆరోపణలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఆర్థిక శాఖలో కొన్ని ఫైళ్లు క్లియర్ అవుతాయి కానీ చిన్న వాళ్ల ఫైళ్లు క్లియర్ కావడం లేదని ఫైల్ క్లియరెన్స్ కోసం సచివాలయానికి వచ్చిన ఒకాయన వాపోయారు. ఆర్థిక శాఖ మంత్రి సంతకం చేయకపోవడం మూలంగానే తమకు వేతనాలు రావడం లేదని ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వేతనాలు రావాలంటే ప్రతి ఏటా బడ్జెట్ ఆమోదం పొందిన తరువాత ఆర్థిక మంత్రి ఫైనాన్స్ కాంకరెన్స్ ఇస్తూ సంబంధిత ఫైల్‌పై సంతకం చేస్తేనే వేతనాలు వస్తాయని ఆయన తెలిపారు. ఈ ఫైల్ పై సంతకం చేయకపోవడం వల్లనే వేతనాలు ఆగిపోయాయి. ఇరత బిల్లుల పరిస్థితి కూడా అదే తీరుగా ఉన్నది.

ఒక్క సంతకంపై 2 లక్షల మంది జీతాలు!

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలంటే అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందిన తరువాత ఫైనాన్స్ కాంకరెన్స్ ఇస్తూ ఆర్థిక శాఖ మంత్రి సంతకం పెట్టాలి. ఆయన ఒక్క సంతకంపై ఆధారపడి 2 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపు ఆధారపడి ఉన్నది. తరువాత చూద్దాంలే అంటూ ఇప్పటి వరకు సంతకం పెట్టకపోవడంతో ఇంత వరకు వారికి వేతనాలు అందడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు కార్మికశాఖ సంక్షేమ బోర్డులో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నా కూడా డిప్యూటీ సీఎం ఆ ఫైల్ పై సంతకం చేయకపోవడం వల్లనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక పోతున్నామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వేతనం రాక ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. నెలకు 10 నుంచి 20 వేల రూపాయల మధ్య వేతనం వచ్చే ఈ చిరుద్యోగులు వేతనాలు రాక ఇంటి ఖర్చులు వెళ్లదీయలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అయినా ఈ డిప్యూటీ సీఎంకు మాత్రం వీరిపై కనీస దయ, కనికరం లేకపోయిందని సచివాలయ ఉద్యోగి ఒకరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ పోస్టింగ్ ఫైళ్లు కూడా ఈ ఆర్థిక శాఖ మంత్రి పెండింగ్ లో పెడుతున్నారన్న చర్చ సచివాలయ వర్గాలలో జరుగుతున్నది. సకాలంలో ఫైల్ ఫై సంతకం చేయకపోవడం వల్ల కొంత మంది అధికారులు పోస్టింగ్ లేక, వెయిటింగ్‌లో ఏడాది కాలంగా ఉంటున్నారని అంటున్నారు. సదరు అధికారులు చేయాల్సిన పని ప్రదేశం ఖాళీగా ఉండటంతో మరో అధికారికి అదనపు బాధ్యతలు ఇవ్వాల్సి వస్తున్నది. దీంతో అడిషనల్ వర్క్ చేసిన అధికారికి అదనపు వేతనం ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. తరువాత సదరు అధికారికి ఎప్పుడు పోస్టింగ్ ఇచ్చినా వెయిటింగ్ పిరియడ్ వేతనం మొత్తం తీసుకుంటారని, ఫలితంగా ఆర్థిక శాఖకు అదనపు భారమే అవుతుందని సచివాలయ బిజినెస్ రూల్స్ తెలిసిన ఒక అధికారి చెప్పారు. అదే మంత్రి వెంట వెంటనే ఫైల్ క్లియర్ చేస్తే ఈ అదనపు బాదుడు ఉందడని అన్నారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఫైల్స్ చూసుకోవాలని, కానీ దీనికి భిన్నంగా మరో సారి చూద్దాంలే… తొందరేముందంటే అధికారులు ఏమి సమాధానం చెపుతారని మరో అధికారి నిట్టూర్చారు.

ఉద్యోగులకు మొండి చెయ్యే..

తమ బకాయిలు రూ.10 వేల కోట్లు కనీసం విడుతల వారీగా నైనా చెల్లించాలని ఉద్యోగుల జేఏసీ ఒకసారి సమ్మెకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. నెలకు రూ.700 కోట్లైనా విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారు ప్రభుత్వం ఇవ్వాల్సిన వారి సొమ్ము కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరో వైపు ఆరోగ్యశ్రీ బకాయిల కోసం నెట్ వర్క్ ఆసుపత్రులు ఇప్పటికే పలు సార్లు సమ్మె చేస్తామని హెచ్చరించాయి. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థులు, ప్రైవేట్ కళశాలల యజమాన్యాలు కూడాఆందోళనలు చేపట్టాయి. చిన్న కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం ఏకంగా డిప్యూటీ సీఎం చాంబర్ ముందే ధర్నాలు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి రోజు వారి ఫైళ్లు క్లియర్ చేస్తే ఇలాంటి పరిస్థితులు తలెత్తవని సీనియర్‌ అధికారులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడూ లేని విధంగా ఆర్థిక శాఖ కారిడార్ ముందు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదని చెపుతున్నారు.

గత మంత్రులతో పోలిక

ప్రస్తుత ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పనితీరును గత ఆర్థిక మంత్రుల పనితీరుతో పలువరు సచివాలయ ఉన్నతాధికారులు పోల్చి చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పనితీరును గుర్తు చేసుకుంటున్నారు. రోశయ్య జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు మినహా హైదరాబాద్‌లో ఉంటే ఏ రోజు ఫైళ్లు ఆ రోజే క్లియర్ చేసే వారని చెపుతున్నారు. ఏ కారణం చేతనైనా హైదరాబాద్‌లో ఉండి సచివాలయానికి రాలేక పోతే తను ఉన్న దగ్గరికే ఫైళ్లు తెప్పించుకొని క్లియర్ చేసి పంపించే వాడని గుర్తు చేసుకున్నారు. దీంతో చాలా మందికి ఫైళ్ల కోసం ఎదురు చూడ కుండ సంతోషంగా వెళ్లే వాళ్లని అప్పట్లో ఆర్థిక శాఖలో పని చేసిన ఒక అధికారి నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. అలాగే టీడీపీలో ఆర్థిక మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడు సైతం ఎప్పటికప్పుడు ఫైళ్లు క్లియర్ చేసేవారని చెపుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయిన తరువాత ఆర్థిక మంత్రిగా బాధ్య తలు నిర్వర్తించిన ఈటల రాజేందర్ ఏ ఫైల్ ఎలా ఉన్నా సామాన్యులకు చెందిన ఫైళ్లను మాత్రం వెంటనే క్లియర్ చేసే వాడని చెపుతున్నారు. గత ఆర్థిక శాఖ మంత్రుల తీరుకు భిన్నంగా ప్రస్తుత మంత్రి తీరు ఉన్నదని అధికార వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఫైళ్లు పెండింగ్ లో పెట్టడంలో మాజీ సీఎం కేసీఆర్‌కు వారసుడిలా ఉన్నట్లు అర్థం అవుతోందని ఒక అధికారి నిట్టూర్పు విడిచారు.

ఇవి కూడా చదవండి..

Tesla Robot Optimus | కుంగ్‌ ఫూ యుద్ధ కళ ప్రదర్శిస్తున్న రోబో ఆప్టిమస్‌! వీడియో అదుర్స్‌!
CP Sajjanar Warning | డ్రైవింగ్‌లో మొబైల్‌ వాడితే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
Vegetables Farming | ఆ గ్రామంలోని రైతులంద‌రూ కోటీశ్వ‌రులే.. కూర‌గాయ‌ల సాగుతో రూ. 16 కోట్ల సంపాద‌న‌..!