CP Sajjanar Warning | డ్రైవింగ్‌లో మొబైల్ వాడితే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
హైదరాబాద్‌లో డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. మొబైల్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని పిలుపు.

CP Sajjanar warns motorists in Hyderabad: Stop using mobile phones while driving or face strict legal action
విధాత సిటీ బ్యూరో, హైదరాబాద్:
CP Sajjanar Warning | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలపై నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం, ఇయర్‌ఫోన్లు పెట్టుకోవడం వంటి చర్యలు ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. నగరంలో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, బైక్ ట్యాక్సీ రైడర్లు వంటి వర్గాల్లో మొబైల్ వాడకం ఒక ప్రమాదకర అలవాటుగా మారిందని సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తన అసహ్యకరమని, ఇక సహించేది కాదని ఆయన స్పష్టం చేశారు.
డ్రైవింగ్‌లో మొబైల్ ప్రాణాంతకం
ప్రమాద కారణాల్లో మొబైల్ వాడకమే ప్రధాన కారణమని ఆయన చెప్పారు. రోడ్డు మీద ఒక క్షణం కూడా దృష్టి మళ్లించడం కూడా ప్రాణాంతకమవుతుందని ఆయన హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వీడియోలు చూడటం, కాల్స్ ఎత్తటం, ఇయర్‌ఫోన్లతో మాట్లాడటం వంటి అలవాట్లు కేవలం డ్రైవర్ ప్రాణానికే కాదు, తోటి ప్రయాణికులకూ, పాదచారులకూ ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ తరహా ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సజ్జనార్ తెలిపారు – “ఈ తరహా ప్రవర్తన ఇక సహించే ప్రసక్తే లేదు. వాహనం నడుపుతూ మొబైల్ వాడితే భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవు. రోడ్డు మీద ప్రతి ఒక్కరి భద్రత ప్రధానమైన బాధ్యత.” ఆయన స్పష్టం చేశారు – “జీవితం కంటే పెద్ద సమస్య ఏదీ ఉండదు. ఒక చిన్న కాల్ కోసం లేదా వీడియో కోసం ప్రాణాలు కోల్పోవడం అవివేకమైన పని. భద్రతను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి.”
ఇకనుండి మొబైల్ వాడకంపై స్పెషల్ డ్రైవ్
సమాజంలో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ డ్రైవ్‌లో మొబైల్ వాడుతున్న డ్రైవర్లను గుర్తించి భారీ జరిమానాలు విధించనున్నారు. ఈ చర్యలో భాగంగా ఆటో, క్యాబ్, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు ప్రధాన లక్ష్యంగా ఉంటారని అధికారులు తెలిపారు. అలా అని సాధారణ పౌరులను కూడా వదలిపెట్టబోమని అధికారులు హెచ్చరించారు.
పోలీసు రికార్డుల ప్రకారం, 2023లో హైదరాబాద్‌లో 23 ప్రమాదాలు మొబైల్ వాడకం కారణంగా చోటుచేసుకున్నాయి. వీటిలో ముగ్గురు మరణించగా, 26 మంది గాయపడ్డారు. 2022తో పోలిస్తే మొబైల్ కేసులు 50 శాతం పెరిగాయి. 2023లో 35,000 కేసుల నుంచి 53,000 కేసులకు చేరాయి. 2024 మొదటి ఆరునెలల్లోనే 42,758 కేసులు నమోదయ్యాయి. వీటిలో రూ.46 లక్షల జరిమానాలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
“రోడ్డు మీద క్రమశిక్షణ పాటించకపోతే ఏ సాంకేతికత, ఏ చట్టం రక్షించలేవు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడటం కేవలం ఒక చిన్న తప్పు కాదు, అది ఒక ప్రాణం తీసే నిర్లక్ష్యం.” అని సజ్జనార్ పునరుద్ఘాటించారు
రోడ్డు మీద ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర కాల్ వస్తే, వాహనం ఆపి మాట్లాడాలని, ప్రయాణికుల, పాదచారుల భద్రత మనందరి బాధ్యత అని గుర్తు చేస్తూ, . నగరంలో రోడ్డు భద్రతా చైతన్యం పెరగడానికి ప్రతి డ్రైవర్, ప్రతి పౌరుడు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రజలకు పిలుపునిచ్చింది.