Harish Rao | నియోపోలిస్‌లో సీఎం మేనల్లుడి మనుషుల అక్రమ మైనింగ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆరెస్‌ఎల్‌పీ ఉప నేత హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనకు పాలన చేతకాదని అన్నారు. అందుకే ఇష్టానుసారంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తున్నారని విమర్శించారు. నియోపోలిస్‌లో ముఖ్యమంత్రి మేనల్లుడి మనుషులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. యంగ్ ఇండియా స్కూళ్ల టెండర్ల బాగోతాన్ని త్వరలో బయటపెడతానని ప్రకటించారు.
- సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకాదు..
- ఇష్టానుసారంగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు
- సీఎస్‌కు ఐటీ శాఖ ఎలా కేటాయిస్తారు?
- లగచర్ల కోసమే ప్రతీక్ జైన్ బదిలీ
- సింగరేణిలో నలుగురు సీఎండీలు మారారు
- విద్యుత్ శాఖలోనూ ఇదే దుస్థితి
- వందల మంది రిటైర్డు ఇంజినీర్ల సర్వీసు పొడిగింపు
- బీఆరెస్‌ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు విమర్శలు
విధాత, హైదరాబాద్:
Harish Rao | రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికు పాలన చేయడం రావడం లేదని బీఆరెస్‌ఎల్పీ ఉప నేత టీ హరీశ్‌రావు మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పూట పూటకు మార్చడం వల్ల పాలనలో ఫలితాలు రావని అన్నారు. ఇప్పటి వరకు ఐదుసార్లు భారీ మార్పులు చేర్పులు జరిగాయని విమర్శించారు. సచివాలయంలో విభాగ అధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయలేదని, విద్యుత్ శాఖలో ఈ రెండేళ్ల కాలంలో ఐదుగురు అధికారులు మారారని హరీశ్‌రావు ఆరోపించారు. విద్యుత్ శాఖలో అధికారుల మార్పు తీవ్ర ప్రభావం చూపిందని, ఈ ఆకస్మిక బదిలీలతో విద్యుత్ శాఖ అతలాకుతలం కావడమే కాక అవినీతి మయమైందని హరీశ్ రావు బుధవారం మీడియాతో చిట్‌చాట్‌లో మండిపడ్డారు. సింగరేణిలో నలుగురు సీఎండీలను మార్చారని, జీహెచ్ఎంసీలో నలుగురు కమిషనర్లు మారారని ఐఅండ్ పీఆర్‌లోనూ నలుగురు స్పెషల్ కమిషనర్లు మారారని విమర్శించారు. పాఠశాల విద్యాశాఖలో డైరెక్టర్లు నాలుగుసార్లు, ఆరోగ్య శ్రీ లో ఎనిమిది మంది సీఈవోలు, పంచాయతీ రాజ్ శాఖలో నలుగురు, మున్సిపల్ శాఖలో ఐదుగురు, ఐటీ శాఖలో ముగ్గురు, మైనింగ్ శాఖలో ఆరుగురు, నేషనల్ హెల్త్ మిషన్‌లో ముగ్గురు చొప్పున అధిపతులు మారారని ఆయన వివరించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉన్నతాధికారులను ఇట్లా మారిస్తే పాలన ఎలా నడుస్తుంది? అని ప్రశ్నించారు. ఐఏఎస్‌లు అంటే జోక్ అయిపోయిందన్నారు.
140 మంది ఐఏఎస్‌ల బదిలీ
ఇప్పటి వరకు 140 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారని, 20 మంది జిల్లా కలెక్టర్లను మార్చారని, రంగారెడ్డి జిల్లాలో నలుగురు కలెక్టర్లను బదిలీ చేశారని చెప్పారు. ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందన్నారు. జిల్లా కలెక్టర్‌కు జిల్లా పరిస్థితుల పై అవగాహన రావడానికే ఆరునెలలు పడుతుందని, అలాంటిది ఆరునెలల లోపే మార్చిన కలెక్టర్లు ఎంతో మంది ఉన్నారన్నారు. ముఖ్యంగా యువ కలెక్టర్లను బదిలీ చేయడం వల్ల వారి నైతిక స్థైర్యం దెబ్బ తింటోందన్నారు.
పాలకులకు వాళ్లకు నచ్చితే మంచి పోస్టింగ్ లు ..లేకపోతే బదిలీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊ అంటే పోస్టింగ్ ఆ అంటే పోస్టింగ్ మార్చుతున్నారన్నారు. సీఎం, మంత్రులకు నచ్చక పోతే అధికారులకు బదిలీలు తప్పడం లేదని చెప్పారు.
డజన్ మందికి సర్వీసు పొడిగింపు
పదవీ విరమణ చేసిన అధికారులకు సర్వీస్ పొడిగింపు సాధారణం అయిపోయిందని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ఏలుబడిలో డజన్ మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సర్వీసు పొడిగింపు ఇచ్చారని గుర్తు చేశారు. వందల మంది ఇంజినీర్లకు పదవీ కాలాన్ని పెంచుతూ పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో అధికారుల పదవీ కాలం పొడిగింపుపై ఇదే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు.. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదేమిటి? అని నిలదీశారు.
యంగ్ ఇండియా స్కూళ్ల టెండర్ల బాగోతం బయటపెడతా
యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లలో ఐదు శాతం ఎక్కువ కు ఇస్తున్నారని, వీటన్నిటి వివరాలు త్వరలో బయటపెడతానని హరీశ్‌రావు వెల్లడించారు. ఇంజినీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్లకు కనీసం రేండేళ్లు ఒకే చోట ఉంటే ఫలితాలు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను బెదిరించడం మంచి పద్దతి కాదని హరీశ్‌రావు అన్నారు. వారి అక్రమాలకు అధికారులు సహకరించడం లేనందుకే సీఎం వారిని బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం తప్పులకు తామెందుకు భాద్యులం కావాలని అధికారులు భావిస్తున్నారన్నారని చెప్పారు. ఈ బదిలీలు, ఎక్స్‌టెన్షన్ విధానం మంచిది కాదని, పదేళ్లు ప్రభుత్వం నడిపిన వారిగా ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నామని తెలిపారు. ఈ సలహాలను విమర్శలుగా కాకుండా నిర్మాణాత్మక సూచనలుగా స్వీకరించాలని హరీశ్‌రావు కోరారు. అధికారులను సీఎం బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు.
ప్రతీక్ జైన్ బదిలీ అందుకే
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయనను అక్కడ్నుంచి బదిలీ చేశారని హరీశ్ రావు ఆరోపించారు. ఐటీ కార్యదర్శిగా సీఎస్ రామకృష్ణారావు ఎలా పని చేయగలుతారు ?, సీఎస్ కు బోలెడన్నీ భాద్యతలు ఉంటాయని, అదనంగా ఐటీ కార్యదర్శిగా ఎలా భాద్యతలు నిర్వర్తిస్తారు ? అని నిలదీశారు. 20 శాతం జీఓ లు ఆన్ లైన్ లో ఉంచుతున్నారు.. 80 శాతం జీఓ లు ఆఫ్ లైన్లో ఉంచుతున్నారన్నారు. హైకోర్టు ఆదేశించినా జీఓ లు ఆన్ లైన్ లో పెట్టడం లేదని, ప్రతిపక్షం లో ఉండగా కాంగ్రెస్ జీఓ ల పై ఏం మాట్లాడింది ? ఇపుడేం చేస్తున్నారన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాడుకోవడానికి అనువుగా కట్టిన మార్చురీ లను ఈ ప్రభుత్వం వాడుకోవడం లేదన్నారు. ఫిరాయింపుల విషయం లో కౌన్సిలర్ల కు ఓ నీతి ? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఓ నీతా ? పాలన అంతా జోక్ అయిపోయిందన్నారు. అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, అసెంబ్లీ అసెంబ్లీ లా లేదని, హౌజ్ కమిటీలు వేయడం లేదని, డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయడం లేదని, చీఫ్ విప్ పదవి ఖాళీగా ఉంది.. ఇట్లా ఎపుడు జరగలేదన్నారు అసెంబ్లీ లైబ్రరీ కూడా సరిగా లేదని హరీశ్ రావు అన్నారు.
నియోపోలిస్‌లో సీఎం మేనల్లుడి అక్రమ మైనింగ్
సీఎం రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పొలీస్ లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్ కు మాత్రమే నిబంధనలుండగా ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ నార్సింగ్ సమీపంలోని నియోపోలిస్ లో పెట్టారన్నారు. ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలని, అనుమతి లెటర్ లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోందన్నారు. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారని, అక్కడ రెడీమిక్స్ కు పర్మిషన్ లేదన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి మైనింగ్ కంపెనీకి పెనాల్టీ వేశారన్నారు. దీనికోసం దాదాపు 8 నుంచి 9 పర్మిషన్లు తీసుకోవాలని, ఓఆర్ఆర్ కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి కంపెనీ, మైనింగ్ పెట్టవద్దని జీఓ ఉన్నా, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్ మండలంలో మైనింగ్ దందా నడుపుతున్నదన్నారు. రేపు నిజానిర్ధారణ కోసం బీఆర్ఎస్ బృందం వెళ్తుందన్నారు. ఖమ్మంలో ఇళ్ళు కూలగొట్టి జాగా ఇస్తామని అంటున్నారు. నేను మంత్రిగా వున్నప్పుడు హెల్త్ కార్డు జీఓ ఇచ్చాను, జర్నలిస్టుల కోసం కేటాయించిన రూ.16 కోట్ల బడ్జెట్ లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. ఎడ్యుకేషన్ పాలసీని వెబ్ సైట్ నుంచి ఎందుకు తీసివేశారని, పాలసీ బాగుంటే ఎందుకు మాయం అయిందన్నారు. అసెంబ్లీలో ఇద్దరు సెక్రటరీల సిస్టం ఎప్పుడూ లేదని అన్నారు. మా ఒత్తిడికి తలొగ్గే ప్రభుత్వం వివిధ అంశాలపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram