Hyderabad Ferrari Crash | జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం: లగ్జరీ కారు అదుపుతప్పి ఢీ – ముగ్గురికి గాయాలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో రూ.4 కోట్ల ఫెరారీ కారు అదుపుతప్పి పలువురు వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. బ్రేక్ ఫెయిల్యూర్ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కొంతసేపు స్థంభించింది.

Reported by: ADHARVA | హైదరాబాద్​ | Feb 22, 2026, 8:00 pm IST
Read Time: 4 mins
Hyderabad Ferrari Crash | జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం: లగ్జరీ కారు అదుపుతప్పి ఢీ – ముగ్గురికి గాయాలు

Hyderabad Ferrari Crash: Luxury Car Rams Vehicles in Jubilee Hills, 3 Injured

విధాత సిటీ బ్యూరో | 22 ఫిబ్రవరి 2026 | హైదరాబాద్​:

Hyderabad Ferrari Crash | హైదరాబాద్‌లో మరోసారి లగ్జరీ కారు ప్రమాదం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఆదివారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో ఎర్ర రంగు ఫెరారీ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ వారి ప్రాణాలకు ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.

సాక్షుల కథనం ప్రకారం, వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌పై ఉన్న ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి, ఆపై రోడ్డుకు అవతలికి దూసుకెళ్లి మరో కారును ఢీకొట్టింది. దీంతో వెనుక వస్తున్న వాహనాలు కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి. మధ్యలో ఉన్న లైట్ మాస్ట్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రముఖ నటుడు బాలకృష్ణ నివాసానికి సమీపంలో ఉండటంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బ్రేక్ ఫెయిల్యూర్స్టీరింగ్​ లాక్​డ్రైవర్ మద్యం సేవించలేదు

తెలంగాణ రవాణా శాఖ వెబ్‌సైట్‌లో ఫెరారీ కాలిఫోర్నియా T వాహన రిజిస్ట్రేషన్ వివరాలు చూపిస్తున్న స్క్రీన్‌షాట్

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కారులో బ్రేక్ ఫెయిల్యూర్​ కారణంగా కారు నడుపుతున్న క్రాంతి రెడ్డి నియంత్రణ కోల్పోయినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. స్టీరింగ్​ కూడా లాక్​ అయినట్లు తెలుస్తోంది. డ్రైవర్ క్రాంతి మద్యం సేవించలేదని ఆల్కహాల్ టెస్ట్‌లో తేలింది. ఓ పెళ్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కారు విలువ సుమారు రూ.3.5 నుంచి 4 కోట్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. వాహనం ఈ. వెంకట రాజా రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ అయ్యినట్లు రికార్డుల్లో ఉంది. ప్రమాదం అనంతరం గాయపడిన వారిని సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది.  ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డును క్లియర్ చేసి, కేబుల్ బ్రిడ్జ్ వైపు వాహనాలను మళ్లించారు. కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లగ్జరీ కార్ల ప్రమాదాలపై ఆందోళన

జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో మరో కారును ఢీకొన్న తర్వాత ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్న ఎర్ర ఫెరారీ కారు

ఇటీవలి కాలంలో లగ్జరీ, ప్రీమియం కార్లతో జరుగుతున్న ప్రమాదాలు పెరుగుతున్నాయి. వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, సాంకేతిక లోపాలు వంటి అంశాలపై కఠిన పర్యవేక్షణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువత, మైనర్ల డ్రైవింగ్‌పై మరింత నియంత్రణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.