Mallu Bhatti Vikramarka | ఆరోగ్య తెలంగాణకు కట్టుబడ్డాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • By: TAAZ    news    Jun 25, 2025 4:40 PM IST
Mallu Bhatti Vikramarka | ఆరోగ్య తెలంగాణకు కట్టుబడ్డాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka | ఆదాయాన్ని సృష్టించి, పెద్ద ఎత్తున ఉపాధి సృష్టించే కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి, ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన బీసీ చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకానికి సంబంధించిన స్టాల్స్ ను భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కళాకారులు, చేతివృత్తులు సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని చెప్పారు. ఈ నెల 25 నుంచి 29 వరకు చేతివృత్తుల ప్రదర్శన కొనసాగుందని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబీషన్ ను రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు భట్టి విక్రమార్క.

హైదరబాద్ నగరానికి చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి చేతివృత్తుల కళాకారులు చేసిన వస్తువులు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తుల ఎగ్జిబీషన్ ఉంటుందన్నారు. ఈ ప్రదర్శనను సందర్శించి నచ్చిన వస్తువులు, పర్యవరణహితమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. దీంతో చేతివృత్తుల కళకారులకు చేయూతగా ఉంటుందని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయిస్తున్నదని పేర్కొన్నారు.

ఈ ఎగ్జిబీషన్ లో కుమ్మరులు తయారుచేసిన మట్టి పాత్రలు, మేదరి వారు తయారు చేసిన వెదురు వస్తువులు, పూసల వారి సామగ్రి వస్తువులు, అదే విధంగా పోచంపల్లి, గద్వాల, నారాయణపేట మొదలైన చేనేత ఉత్పత్తులను, నీరా ఉత్పత్తులు, వారు తయారు చేసిన వస్తువులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశిలించి వస్తువులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బెస్త వారు ఏర్పాటు చేసిన చేపల వంటకాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, వాకిటి శ్రీహరి లతో కలిసి డిప్యూటీ సీఎం ఆరగించారు.