Singareni Compassionate Appointments | ‘కారుణ్యం’పై కాంగ్రెస్ సర్కార్ కక్ష.. సింగరేణిలో వారసుల అరణ్య రోదన!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కాలరీస్‌లో కారుణ్య నియామకాలు నిలిచిపోయాయి. దాదాపు 5వేల కుటుంబాలు.. కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ.. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చొరవ చూపడం లేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Singareni Compassionate Appointments| బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిన కార్మికుల కారుణ్య నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆటంకాలు ఎదురవుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. గత తొమ్మిది నెలలుగా నియామకాలు నిలిచిపోవడంతో సుమారు ఐదు వేల మంది కార్మికుల కుటుంబాలలో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. గతంలో ప్రతి నెలా మెడికల్ బోర్డు సమావేశాలు జరగ్గా ఇప్పుడు అవి సక్రమంగా జరగడం లేదని సింగరేణి కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యూనియన్ నాయకులు, దళారులు, కొందరు ఆఫీసర్లు అక్రమాలకు పాల్పడుతున్నారనే నెపంతో మెడికల్ బోర్డు సమావేశాలు నిలిపివేసి కార్మికుల ఉసురు పోసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, యాజమాన్యం ఉదాసీనత మూలంగా అన్ ఫిట్ కార్మికుల కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. భార్యా, భర్తలు, సంతానం మధ్య నిత్యం కీచులాటలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు.
రోగాలబారిన పడితే అన్‌ఫిట్
బొగ్గు బావులలో పనిచేసే కార్మికులు యాభై సంవత్సరాల వయస్సు దాటిన తరువాత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. అండర్ గ్రౌండ్‌లో పనిచేయడం మూలంగా తొందరగా రోగాల బారిన పడతారనేది జగమెరిగిన సత్యం. ఈ విషయం సింగరేణి కాలరీస్ సీఎండీ మొదలు కిందిస్థాయి అధికారుల వరకు అందరూ అంగీకరించేదే. కొందరు గుండె శస్త్ర చికిత్సలు, మరికొందరు పక్షవాతం, నరాల బలహీనత వంటి పలు రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. ఇలాంటి రోగాల బారిన పడిన కార్మికులను బావుల లోపలికి వెళ్ళి పనిచేసేందుకు అన్‌ఫిట్‌గా ప్రకటిస్తారు. కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ ప్రధాన ఆసుపత్రిలో సంబంధిత కార్మికులకు పరీక్షలు నిర్వహించి మెడికల్‌గా అన్‌ఫిట్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇలాంటి కార్మికుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు లభిస్తాయి. కారుణ్య నియామకాలకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు 2018లో మెడికల్ బోర్డును ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు 13,500 మంది కార్మికుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించారు. ప్రతి నెలా తప్పకుండా సమావేశం నిర్వహించి, ఆ నెలలో అందిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణయాలు తీసుకునేవారని, ఒకవేళ వీలు కాని పరిస్థితులు ఏర్పడితే మరుసటి నెలలో రెండు బోర్డు సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు సాఫీగా జరిగేలా చూసేవారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్నిసార్లు మాత్రమే మెడికల్ బోర్డు సమావేశాలు జరిగాయి. అయితే తొమ్మిది నెలలుగా జరగకపోవడంతో దరఖాస్తుల సంఖ్య ఐదువేలకు పెరిగిందంటున్నారు.
అవినీతి పేరుతో కారుణ్య నియామకాలకు బ్రేక్
మెడికల్ బోర్డు అవినీతి మయం అయ్యిందంటూ సింగరేణి యాజమాన్యం కారుణ్య నియామకాలకు బ్రేకులు వేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.7 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో డైరెక్టర్ (పర్సనల్ అండ్ వెల్ఫేర్) గౌతమ్ పొట్రు విచారణ జరిపారు. దీంతో గతంలో రూ.7 లక్షలు తీసుకునే దళారులు తమ రేట్లు పెంచారు. హైదరాబాద్ నుంచి స్పెషలిస్టు డాక్టర్లు వస్తున్నారు, ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తేనే అన్ ఫిట్ చేస్తారని కొత్త దందాకు తెరదీశారు. వారసత్య ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఊరికే ఇవ్వడం లేదు. కార్మికులు, యువకులు పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టి సాధించుకున్నారు. వారి పోరాట ఫలితమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కేవలం వారసత్య ఉద్యోగాలే కాదు. ఇందులో చనిపోయిన వాళ్ళతో పాటు అనారోగ్యంతో ఉన్నవాళ్లు ఉన్నారు. వీళ్లను మెడికల్ గా అన్ ఫిట్ చేసి, వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు.
అన్‌ఫిట్ కార్మికుడికి పదిహేను లక్షలు నష్టం?
అన్‌ఫిట్‌కు దరఖాస్తు చేసుకున్న తరువాత నెలవారీ జీతం నిలిపివేస్తారు. తొమ్మిది నెలలుగా నిలిపివేయడం మూలంగా ఒక్కో ఉద్యోగి కనీసం రూ.10 నుంచి పదిహేను లక్షల వరకు నష్టపోయినట్టు బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ఇలా ఐదు వేల మంది కార్మికుల కుటుంబాలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాయంటున్నారు. కారుణ్య నియామకాలు లేకపోవడంతో తల్లిదండ్రులు మానసికంగా ఆందోళనకు గురవుతుండగా, వారసులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందినవారే ఉన్నారు. ఈ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎస్సీ కులానికి చెందిన వారు కాగా, సింగరేణి కాలరీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఎస్టీ కులానికి చెందిన వారు. అయినా న్యాయం జరగడం లేదని కార్మికుల కుటుంబాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి.
రేపు మాపు అంటూ వాయిదాలు:
మెడికల్ బోర్డు మీటింగ్ రేపు మాపు అంటూ వాయిదా వేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారసుల ఉద్యోగాలపై చర్చిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా మెడికల్ బోర్డు సమావేశాలు జరిగేవి
– కొరిమి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్.
వేల మంది దరఖాస్తు:
సింగరేణి కాలరీస్ లో గత ఏడెనిమిది నెలలుగా కారుణ్య నియామకాలు నిలిపివేశారు. మెడికల్ బోర్డు సమావేశాలు జరగడం లేదు. వేల కొద్దీ కార్మికుల వారసులు నియామకాల కోసం దరఖాస్తులు సమర్పించారు. పరిష్కరించి ఉపాధి కల్పించకపోతే చెడ్డపేరు వస్తుందని సింగరేణి అధికారులకు చెప్పాం. ఈ సమస్యను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలనకు కూడా తీసుకువెళ్లాం. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ప్రభుత్వం మెడికల్ డిపెండెంట్ ఉద్యోగాల నియామకాలపై ఒక స్థిర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
– సీ త్యాగరాజు, ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్
ఇవి కూడా చదవండి..
Outsourcing Scam | ఔట్‌సోర్సింగ్‌లో బోగస్ ఉద్యోగులు.. అధికారులు, ఏజెన్సీలు నొక్కేసింది 15వేల కోట్లు?
Outsourcing Employees | తొందరేముంది.. చూద్దాంలే! ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై డిప్యూటీ సీఎం నాన్చుడు?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram