Revanth Reddy 99 days action plan| 99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారం, భాగస్వామ్యంతో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Mar 03, 2026, 7:48 pm IST
Read Time: 4 mins
Revanth Reddy 99 days action plan| 99డేస్ యాక్షన్ ప్లాన్ సక్సెస్ చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారం, భాగస్వామ్యంతో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ నెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ అమలుపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

10 రకాల థీమ్స్ తో 5 స్థాయిలలో 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు.
2వ తేదీన గ్రామ స్థాయి, 16వ తేదీన మండల స్థాయి కార్యక్రమాలు, మే 2వ తేదీ నియోజకవర్గ, మే 22వ తేదీ జిల్లా స్థాయి కార్యక్రమాలు జరపాలని, జూన్ 2వ తేదీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

యాక్షన్ ప్లాన్ లో భాగంగా నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని, గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి దారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.

విద్యా వ్యవస్థలో ప్రజా ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలని సూచించారు. తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లుల చెల్లింపులు కచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.