Kavitha : మీడియా కథనాలపై బీఆర్ఎస్ రాజకీయం

మీడియా కథనాల విషయంలో బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కవిత విమర్శించారు. మహిళా ఐఏఎస్‌లపై కథనాలను ఖండించలేదని, కేటీఆర్‌పై మాత్రం దాడులు జరిగాయన్నారు.

Kavitha : మీడియా కథనాలపై బీఆర్ఎస్ రాజకీయం

విధాత, హైదరాబాద్ : మహిళల ఐఏఎస్ లను కించపరుస్తూ వచ్చిన మీడియా కథనాలపై ఓ రకంగా, కేటీఆర్ పై వచ్చిన మీడియా కథనాలపై మరో రకంగా బీఆర్ఎస్ సాగిస్తున్న రాజకీయాలను తెలంగాణ సమాజం గమనించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుకల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు వేశారు. కేటీఆర్ మీద మహాన్యూస్ చానెల్ లో వార్త కథనం వస్తే దాడులు చేశారని, మహిళా అధికారులను కించపరుస్తూ ఎన్టీవీలో కథనాలు వస్తే చానల్ కు మద్దతునిచ్చి , మహిళ అధికారులపై కథనాలు ఖండించలేదని కవిత తప్పుబట్టారు.మహిళలు అంటే నీకు గౌరవం లేదా అంటూ కేటీఆర్ పైన కవిత మండిపడ్డారు. మహిళా అధికారులపై వచ్చిన కథనాల పరంపర మీడియ వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ పోరుగా మారిపోవడంతో పాటు సింగరేణి బొగ్గు గనుల అక్రమాలు, నైనీ బ్లాక్ టెండర్ రద్దు, ఫోన్ ట్యాపింగ్ కేసుల వైపు సాగిన తీరుతో ఆ రెండు పార్టీల అక్రమాలు వెలుగులోకి వచ్చాయన్నారు.

సింగరేణిలో ఫీల్డ్ విజిట్ ఎత్తివేయాలి

సింగరేణి, ఫోన్ ట్యాపింగ్ అక్రమాలపై గుంటనక్క హరీష్ రావు, కేటీఆర్ ల తీరు అవకాశవాదంగా ఉందని కవిత విమర్శించారు. గుంటనక్క హరీష్ రావు సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని కోరడం హాస్యాస్పదమని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ ఎలా వస్తుందని కవిత ప్రశ్నించారు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి గుంటనక్క కోరగానే కమిటీ వేయడం, కమిటీలో సింగరేణిలో పనిచేసిన అధికారినే నియమించడం మరింత విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాం నుంచి జరిగిన సింగరేణి అక్రమాలపై విచారణ జరిపించాలని హరీష్ రావు కోరడం విడ్డూరంగా ఉందని, కేసీఆర్ లక్ష్యంగా గుంటనక్క, గుంపు మేస్త్రీ రేవంత్ రెడ్డిలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, కేటీఆర్ గుంటనక్కను గుడ్డిగా ఫాలో అయ్యి గుంటలో పడ్డారని కవిత ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాం నుంచి ఇప్పటిదాక సృజన్ రెడ్డి మినహా మిగతా సింగరేణి టెండర్లు అన్ని కూడా బీఆర్ఎస్ వారికే వచ్చాయని అలాంటప్పుడు హరీష్ రావు విచారణ డిమాండ్ చేయడం గమ్మత్తుగా ఉందన్నారు. సింగరేణిలో ఫిల్డీ విజిట్ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

‘కార్తీకదీపం’ సీరియల్‌‌లా ఫోన్ ట్యాపింగ్ కేసు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతూ ‘కార్తీకదీపం’ సీరియల్‌ను తలపిస్తోందని, ప్రజల్లో ఇది హాస్యాస్పదంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. కేవలం మున్సిపల్ ఎన్నికల లబ్ధి కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల కోసం వాడాల్సిన ట్యాపింగ్‌ను రాజకీయాలకు వాడటం సరికాదని, విచారణను సాగదీయకుండా వెంటనే బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.అసలు సిట్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ చేసినోళ్లకు ఇస్తున్నారా లేక బాధితులకు ఇస్తున్నారో కూడా ఎవరికి అర్ధం కావడం లేదన్నారు.

నా పార్టీలో మహేశ్‌‌‌కుమార్‌‌కి పదవి ఇస్తా!

కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, అయితే తాను అందుకు వ్యతిరేకమని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నాని, నేను కాంగ్రెస్‌లో చేరను అని కవిత స్పష్టం చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అని, భవిష్యత్తులో తాను స్థాపించే జాగృతి పార్టీనే అధికారంలోకి వస్తుంది, అప్పుడు మహేష్ గౌడ్‌కు నా పార్టీలో కీలక పదవి ఇస్తా అని కవిత వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికలకు మేం గట్టిగా సిద్దమవుతున్నామని కవిత తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Pakistan Announce T20 WC Squad : ఐసీసీ హెచ్చరికల షాక్.. పాక్‌ జట్టు ప్రకటన
Ponguleti Srinivas : ధరణి పోర్టల్ అక్రమాలు.. భూ భారతితో రట్టు