BRS : రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ రైతు భరోసా అస్త్రం!

రైతు భరోసా పెండింగ్ నిధులపై బీఆర్ఎస్ దాడి తీవ్రం. రైతులకు రూ.27,000 కోట్ల బాకీ ఉందని ఆరోపిస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్ రావు తీవ్రంగా నిలదీశారు.

BRS : రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ రైతు భరోసా అస్త్రం!

విధాత : సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు..పాలనా వైఫల్యాలపై విమర్శల దాడి సాగిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి తాజాగా రైతు భరోసా రూపంలో మంచి అస్త్రం అందివచ్చింది. భూదాన్ భూముల నుంచి తరిమివేయబడ్డ పేదలు, మూసీ ప్రక్షాళన, గాంధీ ప్రాజెక్టు బాధితుల సమస్యలపై ఓ వైపు గళమెత్తుతునే..మరోవైపు పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న రైతుల ఆదరణ తిరిగి సంపాదించేందుకు రైతు భరోసా పెండింగ్ నిధులపై సర్కార్ నిలదీసే పని పెట్టుకుంది. డిసెంబర్ లో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధుల విడుదలపై తొలుత సంక్రాంతికి ముందు..తర్వాత అని…మున్సిపల్ ఎన్నికల తర్వాత అంటూ సీఎం రేవంత్ రెడ్డి ధాటవేత వైఖరి అనుసరిస్తుండటంతో రైతాంగంలో నెలకొన్న అసంతృప్తిని గమనించిన బీఆర్ఎస్ నాయకత్వం ఇదే అంశాన్ని అస్త్రంగా మలుచుకుని ప్రభుత్వంపై విమ్శర్శల దాడికి పదును పెట్టింది.

మూడు సీజన్ల రైతు భరోసా ఎగవేశారని ధ్వజం

పార్టీ పరంగా ప్రజల మధ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలలో…మీడియా సమావేశాల్లోనే కాకుండా…సోషల్ మీడియా వేదికగా రైతు భరోసా పెండింగ్ సమస్యపై ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శల దాడి ఉదృతం చేసింది. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ. 27,000 కోట్ల రైతు భరోసా బాకీ పడిందని..ఇది రైతు ద్రోహి రేవంత్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తుంది.

రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన నాటి నుండి కేవలం ఒక్క సీజన్‌కు మాత్రమే రైతుబంధు ఇచ్చి, మిగతా మూడు సీజన్ల డబ్బులు ఎగ్గొట్టిందని…ఒక్కో సీజన్ కు రూ.9000కోట్లు ఇవ్వాల్సి ఉందని బీఆర్ఎస్ చెబుతుంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కార్ రైతులకు బాకీ పడ్డ మొత్తం రూ. 27,000 కోట్లను ఎప్పుడిస్తావంటూ కాంగ్రెసోళ్లను నిలదీద్దామంటూ రైతాంగాన్ని కదిలించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటిదాక 3 ఎకరాల రైతుకు రూ. 72,000 రేవంత్ సర్కార్ బాకి పడిందని…రైతన్నా ఇది నీకు హక్కుగా రావాల్సిన రైతు భరోసా నిధులని గుర్తు చేస్తుంది.

రైతులకు నిధుల కరవు మాటలపై హరీష్ రావు ఫైర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోంది అని, రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని, పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వానికి.. అన్నంపెట్టే రైతన్నకు రైతు భరోసా ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయని మండిపడ్డారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమకు తాజా పరిణామాలే సాక్ష్యం అని దుయ్యబట్టారు.

ఫిబ్రవరి 4న మిర్యాలగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమచేస్తాం.. ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నాం అని ప్రగల్భాలు పలికారు అని, పత్రికల్లో లీకులు ఇచ్చి అనుకూల వార్తలు రాయించుకున్నారని హరీష్ రావు విమర్శించారు. తీరా ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు దాటుతున్నా రైతు భరోసా ఊసే లేదు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లోనూ దీనిపై ఉలుకు లేదు, పలుకు లేదు అని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఎకరానికి 15,000 ఇస్తామని రైతులను నిలువునా మోసం చేసి, ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం ఓట్ల కోసమే రైతు భరోసా పేరుతో నాటకాలు ఆడిందని ఇప్పుడు బట్టబయలైందని విమర్శించారు.

రైతులకు సకాలంలో రైతు భరోసా ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డికి.. మూసీ సుందరీకరణకు వేల కోట్లు, సుందరీకరణలో భాగంగా కూల్చే ఇండ్లకు వేల కోట్లు పంచిపెట్టడానికి, మూసీ చుట్టు పార్కులు కట్టడానికి వేలకోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు వేలకోట్లు, రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం 25 వేల కోట్ల బిల్లులు చెల్లించిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదని ఆరోపించారు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి వేల కోట్లు ఉంటాయి కానీ, కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతు భరోసా ఇవ్వడానికి మాత్రం చేతులు రావా? అని హరీష్ రావు నిలదీశారు.

ఇదేనా ప్రజాపాలన..?

ఒకవైపు ఇనుప కంచెలు లేని ప్రజా పాలన అని గొప్పలు చెప్తూనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో వందల కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయం కట్టుకుంటున్నారు అని, ఆ క్యాంప్ ఆఫీస్ చుట్టూ బలమైన ఇనుప కంచెల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేస్తుండటం చూస్తుంటే.. మీ ఏడో గ్యారెంటీ ‘ప్రజాస్వామిక పాలన’ ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో అర్థమవుతోందంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.

ఆ ప్యాలెస్ పక్కనే 5 కోట్లతో ఫుట్ బాల్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ప్లే కోర్టు కట్టుకుంటున్నారు అని, అందాల పోటీలకు, ఫుట్ బాల్ మ్యాచ్ లకు వందల కోట్లు ఖర్చు పెడుతూ.. అన్నంపెట్టే రైతన్న నోట్లో మాత్రం మట్టి కొడుతున్నారు అని హరీష్ రావు విమర్శించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ మోసపూరిత వైఖరిని, అన్నదాతలను పెడుతున్న తిప్పలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పగటివేషాలు, ఓట్ల కోసం నాటకాలు కట్టిపెట్టి, వెంటనే రైతులందరికీ రైతు భరోసానిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Rythu Bharosa

ఇవి కూడా చదవండి :

Jubilee Hills fire accident| జూబ్లీహిల్స్ మంగళగౌరీ షోరూమ్ లో అగ్ని ప్రమాదం
Sleep | స‌రైన నిద్ర లేకుంటే గుండెకు న‌ష్ట‌మే..! తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!!