శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ !
కోకాపేట్ నియోపోలిస్‌లో శారద పీఠం భూములపై బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. జలమండలి కోసం భూకేటాయింపే కారణం.
విధాత, హైదరాబాద్ : జలమండలికి శారదా పీఠం భూములపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రచ్చ ముదురుతంది. జలమండలి వాటర్ వెల్స్ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శారదా పీఠంకు అప్పగించిన భూమిని కేటాయించడం వివాదం రేపింది. కోకాపేట్ నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ హరీశ్‌రావు హుటాహుటిన అక్కడికి చేరుకోవడంతో వివాదం ముదిరింది. ఈ సందర్బంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. “పీఠాలు, ఆలయాలు కూల్చడమేనా పాలనా? కూల్చివేతలపై కనీసం పీఠం నిర్వాహకులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు” అని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియలు పాటించాలన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన తయారైందని హరీశ్‌రావు విమర్శించారు.
అడ్డగోలు వ్యవహారాలకు, అక్రమాలకు పాల్పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా దేవాలయాలు, మఠాలను కూడా కూల్చే స్థాయికి దిగజారిందని విమర్శించారు. 2019లో కేసీఆర్ ప్రభుత్వంలో కోకాపేట సర్వే నెంబర్ 240లో విశాఖ శారద పీఠానికి చట్టబద్ధంగా క్యాబినెట్ ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి 1.05 కోట్లు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని పేర్కొన్నారు. అలాగే హెచ్ఎండీఏ కు రూ. 23 లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ అన్నీ తీసుకున్నారని చెప్పారు. ఇక్కడ అద్భుతమైన శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయం, గోశాల, నిత్య అన్నదాన సత్రం, వేద పాఠశాల నిర్మించారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల సమక్షంలో పెద్ద స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం జరిగిందని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో శారద పీఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా అంటూ.. కేసీఆర్ కట్టిన గుళ్లు, గోపురాలు, మఠాలను కూల్చడమేనా రేవంత్ రెడ్డి ఉద్దేశమని మండిపడ్డారు. నిన్నమొన్నటిదాక హైడ్రా పేరుతో కూల్చివేతలు, మూసీ నిర్వాసితుల ఇళ్లను, భూదాన్ భూములలో పేదల ఇళ్లను కూల్చేశావని విమర్శించారు.
కోకాపేటలో మైనింగ్ కోసం భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ వాళ్లకు 10 ఎకరాలు కేటాయిస్తే.. 17 ఎకరాలు కబ్జా పెట్టారు అని, వాటిలో రిజర్వాయర్ కట్టవచ్చుకదా అని హరీశ్ రావు పేర్కొన్నారు. అసలు ORRకి కిలోమీటర్ లోపల మైనింగ్ చేయొద్దని HMDA చెప్పిందని.. అయినా అక్కడ మైనింగ్ కోసం రేవంత్ రెడ్డి అల్లుడికి క్రషర్ ను అప్పజెప్పాడు అని హరీశ్ రావు ఆరోపించారు. భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైనింగ్ వెనక రేవంత్ రెడ్డి మేనల్లుడు రమేష్ రెడ్డి, దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి లు ఉన్నారని, వాటర్ వెల్స్ కట్టడానికి నీ మేనల్లుడికి ఇచ్చిన 17 ఎకరాల భూమి పనికిరాదా.. శారాద పీఠమే కావాలా కూల్చడానికి..? అని హరీశ్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లని చెప్పి రైతుబంధు, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ చేసినావు.. ఇప్పుడు గుళ్లను కూడా వదులుతలేవని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు. దేవుని మీద పడ్డవాడు ఎవడూ బాగుపడలేదు అన్నారు.
హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్
కోకాపేట లో ఉన్న శారద పీఠం భూమిని ప్రజా హితం కోసం ప్రభుత్వం తీసుకుంటే.. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గు చేటు అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజల్లో మైలేజ్ వస్తుంటే ఓర్వలేక ఇలాంటి చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని, ఎక్కడ అభివృద్ది పనులు చేపట్టినా ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. నియోపోలిస్ లో 150కోట్లకు ఎకరం పోతుంటే బీఆర్ఎస్ ఒక్క రూపాయికి శారద పీఠానికి కేటాయించడాన్ని ఏ రకంగా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. ప్రజలకు నీళ్లు ఇవ్వడం కోసం మంచినీటి రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రభుత్వం ఈ భూమిని తీసుకోవాలని నిర్ఱయించిందన్నారు. శారద పీఠానికి ప్రత్యామ్నాయంగా శంషాబాద్ ప్రాంతంలో భూమి కేటాయించేందుకు నిర్ణయించిందని, అనవసరంగా ఇందులో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వివాదం రేపుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం వివరణ…
శారదా పీఠం భూములపై హరీష్ రావు చేసిన విమర్శలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నియోపోలిస్‌లో జలమండలికి అదనంగా 3.95 ఎకరాల భూమి కేటాయింపులు చేశామని, ఇప్పటికే ఉన్న 8.75 ఎకరాలు MBR, ELSRల నిర్మాణానికే సరిపోతాయని తెలిపింది. OHT, సైట్ ఆఫీస్, మెయింటెనెన్స్ కోసం అదనపు భూమి అవసరమని జలమండలి అభ్యర్థించిందని, +592 మీటర్ల ఎత్తులో భూభాగం – గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అనుకూలంగా ఉండటం, పంపింగ్ అవసరం లేకుండా నియోపోలిస్, కోకాపేట్ ప్రాంతాలకు నీటి సరఫరా చేయడం కోసం భూసేకరణకు నిర్ణయించామని పేర్కొంది. బోజగుట్ట రిజర్వాయర్‌కు గోదావరి జలాలను గ్రావిటీ సరఫరా చేస్తారనరి, ఓల్డ్ సిటీ, షేక్‌పేట్, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతాలకు లాభం చేకూరుతుందని, కరెంట్ చార్జీలు భారీగా ఆదా కానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
గోదావరి ఫేజ్-II, అలాగే III ప్రాజెక్ట్ ద్వారా అదనంగా 300 MGD నీటి తరలింపు లక్ష్యంగా నియోపోలీససస్ లో రిజర్వాయర్ నిర్మాణం తలపెట్టినట్లుగా పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
Kuno National Park | కూనో పార్కులోకి మరో తొమ్మిది చీతాలు!
అరగంట చాలు..ఎముకలు విరక్కుండా కొట్టగలను: రఘురామరాజు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram