వైరల్ గా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భాగ్యనగర్ వ్యాఖ్యలు!

మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాలని చెప్పడంతో పాటు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి వ్యక్తం చేశారు.

వైరల్ గా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భాగ్యనగర్ వ్యాఖ్యలు!

విధాత, హైదరాబాద్ : పాలమ్మినా..పూలమ్మినా అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తన డైలాగ్ లతో అందరిని నవ్వించడం తరచూ చూస్తుంటాం. ఆయన అసెంబ్లీలో మాట్లాడినా..బయట మాట్లాడిన నవ్వులు విరబూస్తుంటాయి. తన డైలాగ్ లతో మల్లారెడ్డి ఎంత పాపులారిటీ సాధించారో..ఆయన కోడలు ప్రీతిరెడ్డి కూడా తన సామాజిక సేవా కార్యక్రమాలతో తరచూ సందడి చేస్తూ అంతే పాపులారిటీ సంపాదించారు. మల్లారెడ్డి విద్యాసంస్థలను, మెడికల్ కాలేజీ, ఆసుపత్రులను పర్యవేక్షిస్తున్న ప్రీతిరెడ్డి పలు ఈవెంట్లలో కనిపిస్తూ అందరికి సుపరిచితులయ్యారు. మల్లారెడ్డి రాజకీయ వారసురాలు ప్రీతిరెడ్డినే అనే స్థాయిలో గుర్తింపు పొందారు.

ఈ నేపథ్యంలో ప్రీతిరెడ్డి భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న ప్రచారం బలపడింది. ఇదే క్రమంలో ఆమె తాజాగా ఓ ప్రైవేట్ యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తను రాజకీయాల్లోకి రావడం పక్కా అని తేల్చేశారు. అది ఏ పార్టీ నుంచి అనికూడా హింట్ ఇచ్చేశారు. నేను ఎంపీ కావాలని కోరుకుంటున్నాను అని, జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు నాకు కన్నడ, మరాఠీ ,హిందీ భాషలు కూడా వచ్చాంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఈ రోజు ఇండియా ప్రపంచ స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందంటే అందుకు ప్రధాని మోదీ పాలన కారణమంటూ పొగిడేశారు.

మరో అడుగుముందుకేసి హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మార్చాలంటూ బీజేపీ వాయిస్ వినిపించేశారు. పాకిస్తాన్ లో కూడా హైదరాబాద్ ఉందని..అందుకు మన హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మార్చాలన్నది నా అభిప్రాయం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన ఇంటర్వ్యూలో ప్రీతిరెడ్డి వెల్లడించిన అభిప్రాయాల మేరకు ఆమె రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తరుపునా ఎన్నికల బరిలోకి దిగడానికి ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం మరింత బలపడింది.

అయితే తాను ఏ పార్టీలో ఉన్నా.. రాజకీయాల్లోకి వచ్చినా, రాకున్నా కేసీఆర్ నా అభిమాన నాయకుడు అని ప్రీతిరెడ్డి తెలిపారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు అని, పదేళ్లు ఆయన చేసిన అభివృద్ధి ఏ సీఎం చేయలేరు అని ప్రీతిరెడ్డి చెప్పడం విశేషం.

ఇవి కూడా చదవండి :

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో విచారణ ముగించిన సుప్రీంకోర్టు
GHMC Property Tax : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ఆఫర్ !