Pawan Kalyan Project Hanuman| పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !

ఏపీలో మనుషులకీ వన్య ప్రాణులకీ మధ్య సంఘర్షణ నివారణకు అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ (హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్)ను అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్బంగా ప్రారంభించారు.

Pawan Kalyan Project Hanuman| పవన్ కల్యాణ్ ‘ప్రాజెక్టు హనుమాన్ ’ స్టార్ట్ !

అమరావతి: ఏపీలో మనుషులకీ వన్య ప్రాణులకీ మధ్య సంఘర్షణ నివారణకు అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ (హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్)ను అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్బంగా ప్రారంభించారు. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం ఉదయం హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వీటిలో వన్య ప్రాణుల సంరక్షణతోపాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అంబులెన్స్, రెస్క్యూ వాహనాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘వసుధైక కుటుంబం అనే ఉన్నతమైన సిద్ధాంతాన్ని బలంగా నమ్మే దేశం మనది. సమస్త జీవకోటి, వన్యప్రాణులు ఇందులో అంతర్భాగం. మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యం. దీనిని దృష్టిలో పెట్టుకొనే అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్ (హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్) ముందుకు తీసుకొచ్చామని పేర్కొన్నారు.

“హనుమాన్ ప్రాజెక్ట్ మానవ-వన్యప్రాణి మధ్య ఉన్న సంఘర్షణను నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకువెళ్లబోతున్నాం. వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ చేపట్టేలా హనుమాన్ ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు తక్షణ ప్రతిస్పందన, ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వర్తిస్తుంది. పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతోపాటు ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ అటవీశాఖ హనుమాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు.

గ్రామ స్థాయిలో ‘వజ్ర’ బృందాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా తీసుకొచ్చిన ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలను ప్రారంభించాం అని, అందులో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు కాగా, మరో 7 వాహనాలు వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అవసరమైన అంబులెన్స్ లు ఉన్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లుటిల్లో నాలుగు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు, 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉంచాం. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్ (గిరిజన), పారా వెటరేనియన్స్ తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్య జీవి రక్షక్ (వజ్ర)లను అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తున్నాం. గ్రామ స్థాయిలో పాములు, ఇతర జంతువుల నుంచి ఎదురయ్యే సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇచ్చాం.

పరిహారం రూ.10 లక్షలకు పెంపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ- వన్యప్రాణి సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తున్నాం అని, 2025-2026 ఆర్ధిక సంవత్సరంలో ఈ తరహా కేసులు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,107 వరకు నమోదు కాగా పరిహారం కింద దాదాపు రూ. 4 కోట్లు చెల్లించాం అని పవన్ వెల్లడించారు. ఇది బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అందించిన భరోసా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చే ఎక్స్ గ్రేషియా, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని గణనీయంగా పెంచాం. జంతువుల దాడిలో మనిషి చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. గాయపడిన వారికి ఇచ్చే పరిహారం రూ.2 లక్షలు చేశాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తున్నాం.
చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఇప్పటి వరకు 8 ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల బారి నుంచి ప్రజలకు, పంటలకు రక్షణ కల్పించాం అని తెలిపారు.

ఏఐ సహయంతో వన్యప్రాణుల కదలికలు

వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం అని, దీనిని పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించాం అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో జంతువుల వచ్చే ముందు ముందస్తు హెచ్చరికలు ఇచ్చే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. వన్యప్రాణుల వల్ల మానవ భద్రతకు ముప్పు కలగకుండా వశుధైక కుటుంబంలా కలిసి బతికే లక్ష్యంతో హనుమాన్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చాం. ఈ ప్రాజెక్ట్ కోసం అటవీశాఖ అధికారులు, ఫ్రంట్ లైన్ సిబ్బంది ఎంతో అంకితభావంతో కష్టపడి పని చేశారు. వారందరి సేవలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటి, ఈస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ సోసైటీ వంటి నిబద్ధతతో పని చేస్తున్న స్వచ్చంద సంస్థలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కలిసి జీవిద్దాం. కలిసి అభివృద్ధి చెందుదాం” అని అన్నారు.

వణ్యప్రాణుల సంరక్షణ పురోగతిపై పరిశీలన

ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ పరిధిలో సంచరించే వన్యప్రాణులు వివరాలు, సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, రెస్క్యూ ఆపరేషన్స్ లో వినియోగించే కిట్లు, జనావాసాల్లోకి వచ్చిన పులులు లాంటి వన్య మృగాలను బంధించే బోన్లు, అటవీశాఖ పరిధిలో పెరిగే ఔషదాల మొక్కలు, ఉత్పత్తుల వివరాలను అధికారులు, ఎన్జీవోలు గ్యాలరీల రూపంలో పవన్ కల్యాణ్ కు వివరించారు. ఈస్ట్రన్ ఘాట్స్ లో సంచరించే కింగ్ కోబ్రా తదితర పాముల వివరాలు తెలియజేస్తూ ఇచ్చిన ప్రజంటేషన్ ఆకట్టుకుంది. అటవీశాఖకు సంబంధించి వివిధ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన సిబ్బంది, సేవలు అందిస్తున్న ఎన్జీవోలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. హనుమాన్ డిజిటల్ యాప్, అధునాతన సాంకేతికతతో అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జి.పి.ఎస్. ట్రాకింగ్ సిస్టంను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పి.వి. చలపతిరావు, అటవీశాఖ సలహాదారు పి. మల్లికార్జునరావు, అటవీశాఖ ఐటీ సలహాదారు పి. నాగేశ్వరరావు, అటవీశాఖ సలహాదారు అంకారావు, రాష్ట్ర మెడికల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిల్లపల్లి శ్రీనివాసరావు, అడిషనల్ పీసీసీఎఫ్ రాహుల్ పాండే, గుంటూరు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియాలు పాల్గొన్నారు.