సింగరేణి కార్మికులకు దసరా కానుక! సగటున ఒక్కో కార్మికునికి 1.53 లక్షలు బోనస్

  • By: Somu    latest    Oct 05, 2023 12:33 PM IST
సింగరేణి కార్మికులకు దసరా కానుక! సగటున ఒక్కో కార్మికునికి 1.53 లక్షలు బోనస్
  • రూ.711.18 కోట్ల లాభాల బోనస్
  • సగటున ఒక్కో కార్మికునికి 1.53 లక్షలు
  • 16న ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ
  • సీఅండ్ఎండీ శ్రీధర్ ప్రకటన


విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: సింగరేణి కార్మికులకు యాజమాన్యం దసరా కానుకను అందించనుంది. లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను ఈనెల 16న చెల్లించనుంది. ఈ మేరకు సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీధర్ గురువారం ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన విధంగా గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్లలో 32 శాతం లాభాల బోనస్ ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.53 లక్షల వరకు లాభాల బోనస్ అందనుందని ఆయన తెలిపారు. సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతంలో కన్న ఎక్కువ శాతాన్ని లాభాల వాటాగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్ర శేఖరరావుకు సింగరేణి ఉద్యోగుల తరఫున చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపుపై డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్ బలరామ్ సర్క్యులర్ జారీ చేశారు. తెలంగాణ రాకపూర్వం 2013 -14లో 20 శాతం ఉండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ దానిని పెంచుతూ, ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలు రూ.2222 కోట్లలో 32 శాతం ప్రకటించారన్నారు.


ఈ నేపథ్యంలో రూ.711.18 కోట్లను లాభాల బోనస్ గా కార్మికులకు చెల్లించాలని ఇటీవలే ఆదేశించారు. భూగర్భ గని ఉద్యోగులకు రోజుకు రూ.749.58 చొప్పున వారు పని చేసిన మొత్తం దినాలకు లెక్కగట్టి లాభాల బోన‌స్‌ చెల్లిస్తారు. ఓపెన్ కాస్ట్ గనులు, ఇతర సర్ఫేస్ శాఖల్లో పనిచేసే వారికి రూ.627.41 చొప్పున చెల్లిస్తారు. వీరు కాక మిగిలిన విభాగాలు, శాఖల్లో పనిచేసే వారికి రోజుకు రూ.578.69 చొప్పున వారు పనిచేసిన దినాలకు లెక్క కట్టి బోనస్ చెల్లిస్తారు. మొత్తం మీద చూస్తే సగటున ఒక్కో కార్మికునికి రూ.1,53,516 వరకు లాభాల బోనస్ పొందే అవకాశం ఉంది.


ఇటీవలనే చెల్లించిన 11వ వేజ్ బోర్డు ఎరియర్స్ రూ.1450 కోట్లలో సగటున ఒక్కో కార్మికునికి రూ.3.65 లక్షల వరకు అందాయి. ఈ విధంగా వేజ్ బోర్డు ఎరియ‌ర్స్‌, లాభాల బోనస్, దీపావళి బోనస్ కలిపితే సగటున ప్రతి కార్మికుడి ఖాతాలో దాదాపు రూ.6 ల‌క్ష‌ల వరకు జమ అయ్యే అవకాశం ఉంది. ఒక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో తమ క‌ష్టార్జితం చేతికంద‌డం ఇదే ప్ర‌థ‌మం క‌నుక, దీనిని వృథా చేసుకోకుండా భవిష్యత్తు అవసరాలకు దాచుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని యాజ‌మాన్యం విజ్ఞ‌ప్తి చేసింది.