Supreme Court : న్యాయవ్యవస్థను అభాసు పాలు చేసే కుట్ర..ఆ పాఠ్యాంశం
ఎన్సీఈఆర్‌టీ 8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థపై అవినీతి పాఠ్యాంశం చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద పుస్తకాన్ని తక్షణమే ఉపసంహరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ : జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం చేర్చడాన్ని సుప్రీంకోర్టు మండిపడింది. దీని వెనుక న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర కనిపిస్తుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారణ కొనసాగించింది.ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. మీరు ప్రయోగించిన బుల్లెట్‌తో న్యాయవ్యవస్థ రక్తమోడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయవ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా ఎన్సీఆర్టీ నిర్ణయం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే ప్రజలు, యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పటిష్టత, విశ్వసనీయత దెబ్బతినే అవకాశం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతిని వివరించేందుకు ఒక పూర్తి అధ్యాయాన్ని కేటాయించిన ఎన్సీఆర్టీ…అదే సమయంలో కోర్టుల విశిష్ట చరిత్రను మాత్రం విస్మరించిందని చురకలేశారు. జవాబుదారీతనం ఏర్పడే వరకు ఈ వ్యవహారాన్ని మేము వదిలిపెట్టబోమన్నారు. దీనికి వెనక ఎవరు ఉన్నారో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోర్టు ఐదు ఆదేశాలు జారీ చేసింది. వాటిని అతిక్రమిస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్‌సీఈఆర్‌టీ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించిందని, ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తే.. కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఆ సంస్థ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఆదేశించింది.
ఈ ఐదు అంశాలను అమలు చేయండి
వివాదాస్పదమైన 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకానికి సంబంధించిన అన్ని హార్డ్ కాపీలను (పుస్తకాలను), డిజిటల్ వెర్షన్లను తక్షణమే మార్కెట్ నుండి, పాఠశాలలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పుస్తకానికి సంబంధించిన ముద్రణను, పంపిణీని పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. పుస్తకాల స్వాధీనంపై నివేదిక సమర్పించాలని, ఇప్పటికే పంపిణీ అయిన అన్ని పుస్తకాలను స్వాధీనం చేసుకోవాలని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ను ఆదేశించింది. ఒకవేళ ఎక్కడైనా ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నా ఉపాధ్యాయులు వాటిని ఉపయోగించి పాఠాలు బోధించకూడదు అని స్పష్టం చేసింది. భౌతిక లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారా వివాదస్పద పాఠ్యంశాన్ని ప్రచారం చేయకూడదు అని పేర్కొంది. వివాదాస్పద పాఠ్యాంశాన్ని రూపొందించిన నేషనల్ సిలబస్ బోర్డ సభ్యుల పేర్లు, వారి అర్హతలు, ఆ చాప్టర్‌ను ఆమోదించిన సమావేశం తాలూకు అసలు మినిట్స్ (చర్చా పత్రాలు) కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.
నోటీసుల జారీ..తదుపరి విచారణ 11కు వాయిదా
వివాదానికి కారణమైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఆదేశిస్తూ కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, ఎన్సీఆర్టీ చైర్మన్‍కు ఈ సందర్భంగా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందంటూ తదుపరి విచారణ వచ్చే నెల 11కు వాయిదా వేసింది. కాగా ఈ సందర్భంగా ఈ వ్యవహారాన్ని తాము సమర్థించుకోవడం లేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు.సుప్రీంకోర్టుకు ఎన్‍సీఈఆర్‍టీ తరుపున భేషరతుగా క్షమాపణలు చెప్పారు. వివాదస్పద పాఠ్యంశాన్ని పుస్తకంలో చేర్చడానికి కారణమైన వారిని గుర్తిస్తామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.న్యాయవ్యవస్థకు తామెప్పుడూ అండగా ఉంటామన్నారు. పబ్లిక్ నోటీసు ద్వారా బేషరతుగా క్షమాపణలు చెప్తామని కోర్టుకు తెలియజేశారు.
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదం రేపింది. పుస్తకంలో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
బుధవారం దానిపై స్పందించిన సీజేఐ..‘‘న్యాయవ్యవస్థకు కళంకం ఆపాదించేలా ఎవరు ప్రవర్తించినా అనుమతించను’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించిన పాఠ్యాంశంతో కూడుకున్న పుస్తక పంపిణీని నిలిపివేయాల్సిందిగా ఎన్‌సీఈఆర్‌టీ (NCERT)ని కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది. అసంబద్ధమైన విషయాలు పాఠ్యాంశంలో వచ్చాయని, నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు వల్ల ఇలా జరిగిందని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. పాఠ్యపుస్తకాన్ని అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. అసంబద్ధమైన అంశాలను ప్రచురించినందుకు క్షమాపణ చెప్పింది.
ఇవి కూడా చదవండి :
Python : నగర వీధుల్లో భారీ కొండచిలువ.. ఎలా తిరుగుతోందో చూడండి
Earthquake : తెలంగాణలో భూకంపం అలజడి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram