తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలు కూడా కారుణ్య నియామకాలు అర్హులేనంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి స్థానంలో ఇచ్చే కారుణ్య నియామకాలకు (Compassionate Appointments) వివాహిత కుమార్తెలు కూడా పూర్తి అర్హులేనని న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. కేవలం పెళ్లి అయిందనే ఒకే ఒక్క కారణంతో మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయలేరని..అలా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం, లింగ వివక్ష అని కోర్టు తేల్చి చెప్పింది. ఉద్యోగి మరణించినప్పుడు కుమార్తె పెళ్లి జరిగిందా? లేదా? అనేది కాకుండా, ఆమె ఆ కుటుంబంపై లేదా ఉద్యోగిపై ఆధారపడి ఉందా లేదా అనేదే ప్రధాన అర్హతగా పరిగణించాలని స్పష్టం చేసింది.

వివాహిత మహిళలకు సుప్రీం తీర్పు కొండంత అండ

వివాహం అనేది ఒక మహిళ యొక్క అర్హతలను గానీ, ఆమె బాధ్యతలను గానీ ఏమాత్రం మార్చలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల, కారుణ్య నియామకాల్లో కుమారులతో పాటు వివాహిత కుమార్తెలకు కూడా సమానమైన అర్హత మరియు హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. వివాహాన్ని ప్రాతిపదికగా చూపి వారిని కారుణ్య నియామకాల నుంచి మినహాయించడం, కేవలం పెళ్లి అయిందనే కారణంతో కుమార్తెలను కుటుంబ సభ్యుల జాబితా నుండి తొలగించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది.ముఖ్యంగా పెళ్లయినప్పటికీ ఇప్పటికీ తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటూ, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది వివాహిత మహిళలకు ఈ తీర్పు పెద్ద భరోసాగా నిలువనుంది.

కారుణ్య నియమకాల ప్రక్రియలో సంచలన మార్పు

సాధారణంగా కుటుంబ పోషకుడైన ప్రభుత్వ ఉద్యోగి అకాల మరణం చెందితే, ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా అందించేందుకు కారుణ్య నియామకాల పథకాన్ని ప్రవేశపెట్టారు.ఇప్పటివరకు అమలులో ఉన్న అనేక ప్రభుత్వ నిబంధనల్లో కేవలం కుమారులు లేదా అవివాహిత కుమార్తెలకు మాత్రమే ఈ నియామకాల్లో అవకాశం కల్పిస్తూ, పెళ్లయిన కుమార్తెలను పూర్తిగా మినహాయిస్తూ వచ్చారు. ఈ రకమైన వివక్షాపూరిత నిబంధనలపై తాజాగా సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం.. ఇకపై దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ కారుణ్య నియామక నిబంధనల్లో ఉన్న ‘అవివాహిత’ అనే పరిమిత పదాన్ని తక్షణమే తొలగించాల్సి ఉంటుంది. ఆ స్థానంలో వివాహిత కుమార్తెలను కూడా చేర్చి వారికి సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా కారుణ్య నియామకాల్లో సమ న్యాయం కోసం వేచి చూస్తున్న ఎంతోమంది బాధిత మహిళలకు ఇన్నాళ్లకు సరైన న్యాయం దక్కినట్లయ్యింది.