Mallu Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయా?
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసాల్లో, గురుగ్రామ్‌లోని ఆయన అత్తమామల ఇళ్లలో ఆదాయం పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారనే వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నది.
- బదనాం అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- ఐటీ, ఈడీ దాడులతో కాంగ్రెస్‌కు సంకటం
- ఎన్నికల వేళ కట్టడి చేస్తున్న బీజేపీ పెద్దలు!
- హర్యానా ఎన్నికల సమయంలో పొంగులేటి..
- బీహార్ ఎన్నికల సందర్భంగా డిప్యూటీ సీఎం..
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Mallu Bhatti Vikramarka | రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పైసా దక్కకుండా చూడటంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దృష్టిపెడుతుందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎన్నికలకు నిధులు సమకూర్చుతారనే అభిప్రాయం ఉన్నవారే లక్ష్యంగా వారిపై సోదాలు జరుగుతూ ఉంటాయి. వీటితో కారణంగా కాంగ్రెస్ అభ్యర్థులకు నిధులు దక్కకుండా పోవడమే కాకుండా అవినీతి మంత్రులుగా ముద్ర వేయించుకుంటున్నారు. దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉండగా, కర్ణాటకతో పాటు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచే నిధులు వెళ్తున్నాయనేది బీజేపీకి పక్కా సమాచారం ఉండటంతోనే కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల ఎన్నికలకు నిధులు సమకూర్చిన విధంగానే, తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు నిధులు మళ్లిస్తున్నదనే ఆరోపణలను మూటగట్టుకుంటున్నది.
గురుగ్రామ్‌లోని అత్తమామల ఇంట్లో తనిఖీలు?
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసాలు, ఢిల్లీ గురుగ్రామ్‌లోని ఆయన అత్తమామల ఇళ్లలో నెల రోజుల క్రితం ఐటీ సోదాలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, కీలకమైన డాక్యుమెంట్లను తీసుకువెళ్లారంటున్నారు. మల్లు భట్టి ఢిల్లీ వెళ్తే గురుగ్రామ్‌లోని అత్తమామల ఇంట్లో ఉంటారని, తెలంగాణ భవన్‌లో బస చేయరనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. సోదాలు రెండు రోజుల పాటు జరిగినప్పటికీ బయటకు పొక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. సాధారణంగా సోదాలు జరిగిన తరువాత ఐటీ శాఖ అధికారికంగా ఒక ప్రకటన ఒకటి రెండు రోజుల తరువాత మీడియాకు జారీ చేస్తుంది. అలాంటి ప్రకటన రాకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు నెల రోజుల ముందు ఐటీ సోదాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. మల్లు భట్టి ఆర్థిక శాఖతో పాటు, విద్యుత్ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి బిల్లుకు 15 శాతం కమీషన్లు తీసుకుని నిధులు విడుదల చేస్తున్నారనే ఆరోపణలు మల్లు భట్టి కుటుంబంపై ఉన్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అవినీతిపై విమర్శలు చేశారు. కమీషన్ల మంత్రి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తమకు పెండింగ్ బకాయిలు ఇవ్వడం లేదంటూ చిన్న కాంట్రాక్టర్లు సచివాలయంలోని మల్లు భట్టి చాంబర్ ముందే మెరుపు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మొదలు కాంట్రాక్టులు చేసే వారికి ఈ అవినీతి అంతా తెలిసిపోయింది. ఆర్థిక శాఖలో కమీషన్లు ఇస్తేనే పనులు అవుతాయంట కదా అని నలుగురు కలిసిన చోట సాధారణ పౌరులు సైతం చర్చించుకుంటున్నారు. కమీషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బదనాం అయ్యిందని, కర్నాటకలో ప్రభుత్వాన్ని మించిపోయిందని కాంగ్రెస్ కార్యకర్తలు సైతం వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ఇలా వసూలు చేసిన కమీషన్లు ఎక్కడికి వెళ్తున్నాయనేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిఘా పెట్టిందంటున్నారు. ఇలా సమకూరిన మొత్తం నుంచి రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సందర్భంలో పంపిస్తున్నారనే పక్కా సమాచారం నిఘాలో రూడీ అయ్యిందని, అందుకే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో మంత్రులపై కేంద్ర ఏజెన్సీలు నిఘా పెట్టాయని సమాచారం. నిఘా సమాచారం ప్రకారం సంబంధిత మంత్రి నివాసాలు, కార్యాలయాలు, బంధువుల నివాసాలపై ఐటీ లేదా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులకు వెళ్లాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. ఈ నిధుల కోసం ఎదురు చూసిన అభ్యర్థులకు నిరాశే ఎదురవుతున్నది.
గతేడాది పొంగులేటి నివాసాల్లో
గతేడాది సెప్టెంబర్ నెల 27వ న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించాయి. తెల్లవారుజాము నుంచే సీఆర్పీఎఫ్ బలగాల భద్రత నడుమ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి సన్నిహితుల ఆస్తులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 3, 2023 లో ఖమ్మంలోని ఆయన నివాసాలుతో పాటు హైదరాబాద్ లోని నందగిరి హిల్స్ లో ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు జరిపారు. బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 10 లో రాఘవ ఫ్రైడ్ లో కూడా సోదాలు నిర్వహించారు. ఖమ్మంతో పాటు పొరుగున ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు నిధులు సమకూర్చుతున్నారనే పక్కా సమాచారంతోనే దాడులు జరిగాయని అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకున్నారు. హర్యానా ఎన్నికలకు ముందు, గతేడాది సెప్టెంబర్ 27న రెండోసారి ఈడీ దాడులు జరిగాయి. హర్యానాలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు నిధులు తరలిస్తున్నారనే సమాచారం అందడం కూడా కారణమంటున్నారు. అయితే ఈ దాడులపై నెల రోజుల తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందని, దాడులు జరిగి నెల అవుతున్నా కేసు నమోదు చేయలేదన్నారు. దాడుల తరువాత అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీతో నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో శ్రీనివాస్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని ఆయన ఆరోపించారు.
Read Also |
Venkaiah Naidu | ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు
Jubilee Hills By Election | తెలంగాణలో ఉప ఎన్నికల సీన్ రివర్స్! నాడు బీఆరెస్.. నేడు కాంగ్రెస్!
Nara Lokesh : మంత్రి లోకేష్ సంచలన పోస్ట్..ఆ కంపెనీ తుపాన్ లా ఏపీకి తిరిగొస్తుంది!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram