• Telugu News
  • /Telangana

Telangana Budget 2026-27 | రేషన్‌ కార్డుంటే.. ఐదు లక్షల బీమా.. తెలంగాణ బడ్జెట్‌లో కొత్త పథకాల వెల్లువ

తెలంగాణ బడ్జెట్‌లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల మేరకు ఇందిరమ్మ జీవిత బీమా కల్పిస్తామని తెలిపింది. మరిన్ని వివరాలు...

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Mar 20, 2026, 9:14 pm IST
Read Time: 8 mins
Telangana Budget 2026-27 | రేషన్‌ కార్డుంటే.. ఐదు లక్షల బీమా.. తెలంగాణ బడ్జెట్‌లో కొత్త పథకాల వెల్లువ

Telangana Budget 2026-27 |  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించని పథకాలను 2026-27వార్షిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నూతన పథకాలను వివరించారు. ఆ పథకాల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కొరకు సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా పథకం ప్రకటించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందించే విధంగా రూపొందించారు. జూన్ 02, 2026 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి బడ్జెట్ లో రూ.4,000 కోట్లు ప్రతిపాదించారు. రేషన్ కార్డు కలిగియున్న ప్రతి లబ్ధిదారుడు దీనికి అర్హులుగా ప్రకటించారు.

చేయూత

చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించారు.

తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ళు:

ఎంపిక చేసిన ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థలతో అన్ని వనరులతో కూడిన తెలగాణ పబ్లిక్ స్కూళ్ళుగా మార్పు చేయాలని నిర్ణయించారు. ప్రతి స్కూల్ లో ప్రి–ప్రైమరీ నుండి 12 వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు విద్య అందిస్తారు. ఈ పథకం మొత్తానికి బడ్జెట్లో రూ.500 కోట్లు ప్రతిపాదించగా, రాష్ట్రవ్యాప్తంగా తొలుత 200 స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

సర్కార్ స్కూల్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం

రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రి–ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు పోషకాలతో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్ర‌తి విద్యార్థికి వారానికి మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ అందచేస్తారు. ఈ పథకం కోసం బడ్జెట్ లో రూ.800 కోట్లు ప్రతిపాదించారు.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించారు.

నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం:

సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రైవేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు. ప్రతి ఉద్యోగి తో పాటు పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డు అందచేస్తారు.

ఉద్యోగుల ప్రమాద బీమా పథకం:

ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1 కోటి 20 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. 60 ఏండ్ల వరకు 10 లక్షల రూపాయాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2కోట్ల అదనపు కవరేజి లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. ఈ పథకం 7 లక్షల 57 వేల ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ రెండు పథకాలు అమలు చేసేందుకు బడ్జెట్ లో రూ.1,056 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు.

సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం

రాష్ట్ర యువతకు వివిధ రంగాలలో తగిన నైపుణ్య శిక్షణ, వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం. వీసా మార్గదర్శకత, విదేశీ ప్రయాణానికి కావలసిన రక్షణను ఇచ్చి విదేశాలలో ఆరోగ్య సేవలు, హస్పిటాలిటీ, నిర్మాణపు పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం “సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం”ను ప్రారంభిస్తున్నారు. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం పథకానికి రూ.1,056 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడి.

ఏటీసీ ట్రైనీలకు స్కాలర్ షిప్

ఉపాధి కల్పన, శిక్షణ శాఖకు చెందిన ఏటీసీలలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల రూ.2 వేలు స్కాలర్ షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదించింది. ఈ బడ్జెట్ లో ఏటీసీ ట్రైనీలకు స్కాలర్ షిప్ పథకానికి రూ.80 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి ప్రకటించారు.