Jubilee Hills By Election | తెలంగాణలో ఉప ఎన్నికల సీన్ రివర్స్! నాడు బీఆరెస్‌.. నేడు కాంగ్రెస్!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో.. బీఆరెస్‌ హయాంలో అధికార పార్టీ చేసిన డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగం సీన్‌ రిపీట్‌ అయ్యిందని, కాకాపోతే ఇప్పుడు ఆ పాత్ర కాంగ్రెస్‌ పోషించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Jubilee Hills By Election | తెలంగాణలో ఉప ఎన్నికల సీన్ రివర్స్! నాడు బీఆరెస్‌.. నేడు కాంగ్రెస్!

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Jubilee Hills By Election | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉప ఎన్నికలు జరిగిన సందర్భాల్లో అధికార దుర్వినియోగం, అమలుకాని పథకాల ప్రకటన, భారీగా ప్రలోభాలు, పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులను మోహరించడం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక విషయంలో అదే తీరున అధికార దుర్వినియోగం జరిగిందనే చర్చలు ఓటర్లలో వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అధికార పక్షం ఇబ్బందులకు గురిచేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. వేయి రెండు వేల ఓట్ల బలమున్న బీఆర్ఎస్ నాయకులను భయాందోళనకు గురిచేసి దారిలోకి తెచ్చుకున్నారని, మాట వినని వారి బలహీనతలను తెలుసుకుని పార్టీలోకి చేర్చుకున్నారని అంటున్నారు. ఇలా సామ దాన బేధ దండోపాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకున్నదనే చర్చ నియోజకవర్గంలో మొదలైంది.

హుజూరాబాద్‌లో ప్రవహించిన నగదు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు దేశంలోనే సంచలనం సృష్టించాయి. ఒకటి హుజూరాబాద్ ఎన్నిక, మరోటి మునుగోడు ఉప ఎన్నిక. ఈ రెండు ఉప ఎన్నికల్లో వందల కోట్ల నగదు వరదలా పారిందన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై కక్షకట్టిన సీఎం కేసీఆర్.. ఈటల కుటుంబానికి చెందిన హేచరీస్‌ భూముల్లో అసైన్డ్‌ భూములు ఉన్నాయన్న పేరుతో మంత్రి వర్గం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. కేసీఆర్ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఉద్యమకారుడు అయిన రాజేందర్‌ను తొలగించడం అమానుషం, అన్యాయం అంటూ తెలంగాణ వాదులు ఆందోళనలు నిర్వహించి, ఈటలకు సంఘీభావం ప్రకటించారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో రాజేందర్‌ను ఓడించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సర్వశక్తులను ఒడ్డింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం దళిత బంధు పథకాన్ని ప్రారంభించారన్నది అందరికీ తెలిసిందే. రూ.10 లక్షల పూర్తి సబ్సిడీతో ఎంపికైన లబ్ధిదారులకు అందచేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగి అయినా అర్హుడిగానే పరిగణిస్తామని తెలిపారు. బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేయగా, బీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను రంగంలోకి దింపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈటలను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకూడదనే పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారన్న వాదనలు ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లను మోహరించడం ద్వారా పూర్తి స్తాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఒక్క ఉప ఎన్నిక కోసమే బీఆర్ఎస్ రూ.400 కోట్లు పంపిణీ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రజల తీర్పుతో రాజేందర్ గెలుపొంది తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

ఇది మునుగోడు కథ

మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అవమానాలు భరిస్తూ ఉండలేనంటూ ఆగస్టు 2, 2022లో తన పదవికి రాజీనామా చేసి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సంవత్సరం నవంబర్ మొదటి వారంలో ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ తరఫున రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి నిల్చున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, మంత్రులు నియోజకవర్గంలో మకాం వేసి, నిరంతరం ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం మద్ధతును కేసీఆర్ తీసుకున్నారు. మూడు ప్రధాన పార్టీలకు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికగా మారింది. దీంతో ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి అయినా విజయం సాధించాలనే పట్టుదల బీఆర్ఎస్, బీజేపీలకు ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. నోటిఫికేషన్ రావడానికి ముందుగానే రాజగోపాల్ రెడ్డి తన అనుచరుల వద్ద డబ్బులు నిలువపెట్టారని, ఇలా మండలానికి ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకుల చొప్పున సొమ్ములు దాచారని, విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వారిని పోలీసుల బలప్రయోగంతో తమ దారిలోకి తెచ్చుకున్నారని నాటి ఎన్నికను దగ్గరుండి గమనించిన పరిశీలకులు కొందరు చెబుతున్నారు. పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందు రాజగోపాల్ రెడ్డి అనుచరులు నియోజకవర్గం నుంచి మాయమయ్యారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి నిధుల కటకట ఏర్పడిందని నియోజకవర్గంలో పెద్ద చర్చ జరిగింది. ఒక ఓటుకు రూ.10 వేల చొప్పున ముట్ట చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ ఎక్కడా తగ్గకుండా పెద్ద ఎత్తున తాయిలాలు పంచినట్టు వార్తలు వచ్చాయి. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి 10,113 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తమ అభ్యర్థి విజయం కోసం బీఆర్ఎస్ ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోలేదు. ఆఖరికి పోలీసు పెట్రోలింగ్ వాహనాల్లో డబ్బులు తరలించారనే విమర్శలను ఎదుర్కొన్నా ఏమాత్రం లెక్కచేయలేదు. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థికి సంబంధించిన డబ్బులను పోలీసులతో సీజ్ చేయించారని ప్రచారం జరిగింది. ఇలా అనేక అక్రమాలకు పాల్పడి విజయం సాధించిందని రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన రాజగోపాల్ రెడ్డి పదిహేను నెలల తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

జూబ్లీహిల్స్‌లోనూ సీన్‌ రిపీట్‌ కాకపోతే రివర్స్‌!

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో ఎలాగైతే ప్రత్యర్థి పార్టీల పట్ల అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరించిందో.. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే రకంగా వ్యవహరించిందంటున్నారు. పోలీసులను ప్రయోగించి బీఆర్ఎస్ ముఖ్య నాయకులను తమ అదుపులోకి తెచ్చుకున్నారని, బీఆర్ఎస్ నగదు పంపిణీని అడుగడుగునా అడ్డుకున్నారని చెబుతున్నారు. నాయకుల కదలికలపై నిత్యం నిఘా పెట్టారని సమాచారం. వేయి, రెండు వేల ఓట్ల బలం ఉన్న నాయకులను కూడా లోబర్చుకునే ప్రయత్నాలు చేశారని, వినని వారిపై పోలీసు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో బల ప్రయోగం చేశారని బీఆరెస్‌ కార్యకర్తలు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతారా? అనుమతులు లేని మీ ఇళ్ల కూల్చేయాలా? అంటూ బెదిరించారని అంటున్నారు. ఒక్కో ఓటరు కు రూ.2500 నగదుతో పాటు మిక్సీలు, కుక్కర్లు, కుర్చీలు, పట్టు చీరలు పంపారని బస్తీల్లో చర్చలు నడుస్తున్నాయి. తమది సంక్షేమ ప్రభుత్వమని, పేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు డబ్బుల పంపిణీ, తాయిలాల పైనే ఎక్కువగా ఆధారపడ్డారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పోలింగ్ రోజున మంత్రులందరూ హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుకుం జారీ చేశారంటే ఎంత ఆందోళనలో ఉన్నారనేది అర్థమవుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు.

వాళ్లకు వీళ్లకు తేడా ఏముంది?

హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం, బెదిరింపులకు పాల్పడిందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుంచి మున్ముందు వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి వస్తుందని, జాతీయ పార్టీగా ప్రజాస్వామ్యయుత వాతావరణం కల్పిస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also |

Jubilee Hills Exit Polls | జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు: ఎందుకంటే?
Earth’s magnetic field | భూ అయస్కాంత క్షేత్రం బలహీనపడుతున్నదా? దానితో విపత్తులేంటి?
Telangana High Court : కాళేశ్వరం కేసులో కేసీఆర్ కు బిగ్ రిలీఫ్