Vegetables Farming | ఆ గ్రామంలోని రైతులందరూ కోటీశ్వరులే.. కూరగాయల సాగుతో రూ. 16 కోట్ల సంపాదన..!
Vegetables Farming | ప్రతి గ్రామంలో రైతులు( Farmers ) ఉంటారు.. కానీ కొంతమంది రైతులు లాభాలు గడిస్తారు.. కొందరు నష్టాల పాలవుతుంటారు. అంటే లాభనష్టాలకు వారు వేసిన పంట కారణమై ఉండొచ్చు.. లేదంటే దిగుబడి సాధించడంలో అవగాహన లేమి ఉండొచ్చు. కానీ ఈ గ్రామంలోని రైతులు మాత్రం.. ప్రతి ఏడాది కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నారు. అది కూడా కూరగాయాల సాగు ( Vegetables Farming ) చేస్తూ.. ఏడాదికి రూ. 16 కోట్ల టర్నోవర్‌తో కోటీశ్వరులుగా మారిపోయారు. మరి ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే కేరళ( Kerala ) రాష్ట్రానికి వెళ్లక తప్పదు.

Vegetables Farming | కేరళ( Kerala ) రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని ఓ కుగ్రామం ఎలెవంచెరి( Elevancherry ). ఈ గ్రామంలో కేవలం 300 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. ఈ కుటుంబాలకు చెందిన రైతులందరూ( Farmers ) సమిష్టిగా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా.. కూరగాయల సాగు( Vegetables Farming ) ప్రారంభించారు. అది కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు.
సమిష్టిగా కూరగాయలు పండిస్తుండడంతో.. 1996లోనే కేరళలోని కూరగాయలు, పండ్ల ప్రమోషన్ కౌన్సిల్( VFPCK ) ఆధ్వర్యంలో ఒక స్వయం సహాయక రైతు సంఘాన్ని ప్రారంభించారు. పంటను వేయడం, ఆ పంటకు కావాల్సిన నీటిని సమకూర్చడం, ఎరువులు వేయడం, కోత కోయడం, మార్కెట్‌కు తరలించడం వంటివి అన్ని స్వయం సహాయక రైతు సంఘం ద్వారానే కొనసాగుతున్నాయి. ఇలా చేయడంతో మధ్యవర్తులు లేరు. పండించిన పంటను నేరుగా రైతులే అమ్ముకుంటున్నారు. లాభనష్టాలను రైతులందరూ సమానంగా పంచుకుంటున్నారు.
ఎలెవంచెరి గ్రామంలో మొత్తం 30 రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా గుమ్మడికాయ, పొట్లకాయ, లాంగ్ బీన్స్, బీరకాయ, కాకరకాయ, సొరకాయతో పాటు మరెన్నో రకాల కూరగాయలను పండిస్తున్నారు. ప్రతి ఏడాది దాదాపు 5 వేల టన్నుల కూరగాయలు ఈ గ్రామం నుంచే ఎగుమతి అవుతున్నాయి. దీంతో కేరళలో ఎలెవంచెరి అతిపెద్ద కూరగాయల ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది.
ఈ క్రమంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా విక్రయాలు ప్రారంభించారు. కేరళ నలుమూలల నుంచి కొనుగోలుదారులు ఎలెవంచెరికి వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గ్రామ రైతుల వ్యవసాయ క్షేత్రాలు ఇతర ప్రాంతాల రైతులకు శిక్షణా కేంద్రాలుగా మారిపోయాయి. వీరి విజయానికి కేవలం ఆధునిక వ్యవసాయ పద్ధతులే అని చెప్పొచ్చు. అంటే ఈ పద్ధతుల్లో సాగు చేయడం కారణంగా అధిక దిగుబడి వచ్చి లాభాల బాట పట్టారు.