Bad Memories | కలచివేసే చెడు జ్ఞాపకాలను ఇలా తుడిచివేయచ్చు!
కొందరికి కొన్ని విషయాలు ఎంత మర్చిపోదామన్నా సాధ్యం కాదు. ఏ పనిలో ఉన్నా ఏదో ఒక సమయంలో గుర్తుకు వచ్చి, మనసును కలచివేస్తుంటాయి. అపరాధ భావమో, అవమానమో, నష్టమో.. ఏదైనా సరే పదే పదే తలంపునకు వస్తే మనసు కకావికలమవుతుంది. దాని నుంచి బయటపడే మార్గం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అదికూడా మీరు ఊహించనంత సులభంగా!
Bad Memories | మన రోజువారీ అనుభవాలు, భావోద్వేగాలు, మన మానసిక ఆరోగ్యంపై జ్ఞాపకాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అనుభవంలోనూ ఉన్నదే. కానీ.. నిద్ర సమయంలో జ్ఞాపకాలను మన మెదడు ప్రాసెస్ చేసే తీరును మార్చివేస్తే? దీనికి సంబంధించిన ఒక కొత్త అధ్యయనం పీర్ రివ్యూడ్ జర్నల్ PNASలో పబ్లిష్ అయింది. ఇదొక బ్రేక్‌త్రూగా చెబుతున్నారు. పదే పదే వచ్చే చెడు జ్ఞాపకాలను నిద్రలో ఉన్నప్పుడు కొన్ని శబ్దాలు లేదా సంకేతాలను పంపడం ద్వారా తగ్గించవచ్చని, మంచి జ్ఞాపకాలను పెంచవచ్చని ఈ అధ్యయనం పేర్కొంటున్నది. పోస్ట్–ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD), యాంగ్జయిటీ, డిప్రెషన్‌లకు నిద్రను చికిత్సా సాధనంగా ఉపయోగించి చికిత్స చేసే విప్లవాత్మక పద్ధతిని ఈ అధ్యయనం ఆవిష్కరించింది.
నిద్రలో మన మెదడు చాలా పనులే చేస్తుంటుంది. నిజానికి మన జ్ఞాపకాలు స్థిరంగా ఉండటానికి నిద్ర ఎంతో ముఖ్యమైనది. ఈ సమయంలో మెదడు కొత్త సమాచారాన్ని స్థిరీకరించి, ఇప్పటికే ఉన్న వ్యవస్థలతో అనుసంధానం చేసే ప్రక్రియలో బిజీగా ఉంటుంది. అయితే.. నిద్ర అనేది మన జ్ఞాపకాలను భద్రపర్చడమే కాదు.. వాటిని పూర్తిగా మార్చివేగల శక్తిని కూడా కలిగి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మనం మెలకువతో ఉన్నప్పుడు కలిగే జ్ఞాపకాలను నిద్ర చురుకుగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. నాన్–ఆర్‌ఈఎం (ర్యాపిడ్ ఐ మూమెంట్) నిద్రంలో నిర్దిష్ట సంకేతాలు మెదడును ప్రతికూల జ్ఞాపకాలకంటే సానుకూల జ్ఞాపకాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి మార్గం నిర్దేశిస్తాయనే పరిశీలన నుంచి ఈ ఆవిష్కరణ వచ్చింది.
పదాలు, వాసన, శబ్దాలు వంటి సంకేతాలు మనిషి జ్ఞాపక శక్తిని ఎలా ప్రభావితం చేశారో ఈ అధ్యయనంలో అన్వేషించారు. నాన్–ఆర్‌ఈఎం నిద్రలో సూక్ష్మ రిమైండర్లు ప్లే చేయడం ద్వారా పరిశోధనలో పాల్గొన్నవారి జ్ఞాపక శక్తిని మరింత సానుకూల అనుబంధాలవైపు మళ్లించవచ్చునని గుర్తించారు. అయితే ఈ ప్రక్రియలో నెగెటివ్ జ్ఞాపకాలను పూర్తిగా చెరిపివేయలేకపోయినప్పటికీ.. అ చెడు జ్ఞాపకాలను బలహీనపర్చి, మరింత సానుకూల అనుభవాలకు తీసుకువెళ్లవచ్చని నిరూపించిందని అధ్యయనకారులు పేర్కొన్నారు. నిద్రలో సానుకూల సంకేతాలను పంపడం ద్వారా ప్రతికూల జ్ఞాపకాలపైకి సానుకూల జ్ఞాపకాలు చొచ్చుకుపోయే స్థాయిని పెంచగలిగారు. అంటే.. పరిశోధనలో భాగస్వామి అయిన వ్యక్తి తన పాత చెడు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకునే క్రమంలో ముందుగా సానుకూల జ్ఞాపకం యాక్టివ్ అవుతుంది. అంటే.. చెడు జ్ఞాపకంపై మంచి జ్ఞాపకం ఆధిపత్యం సాధించింది. ఈ క్రమంలోనే చెడు జ్ఞాపకాలు తగ్గిపోయి.. మంచి జ్ఞాపకాలు చురుకుగా ఉంటాయి.
సాధారణ భాషలో చెప్పాలంటే నిద్రకు ముందు మంచి జ్ఞాపకాలను మననం చేసుకోవడం, మంచి సాహిత్యం చదవడం, లేదా సానుకూల అంశాలపై చర్చించుకోవడం, నిద్రించే సమయంలో చక్కటి సంగీతాన్ని ఆస్వాదించడంలాంటిదే ఈ ప్రయోగం. ఏదైనా.. జ్ఞాపకశక్తిలో మార్పులు చేసేందుకు నిద్రను చికిత్సా విధానంగా ఉపయోగించేందుకు ఈ కొత్త ముందడుగు ద్వారాలను తెరిచిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ట్రామా, యంగ్జయిటీ వంటి వాటితో బాధపడుతున్నవారికి ఈ చికిత్సా విధానం బాగా ఉపకరిస్తుందని అంటున్నారు. మరిన్ని అధ్యయనాలు నిర్వహిస్తే ఈ చికిత్సా పద్ధతి మందులు, శస్త్రచికిత్సలను పక్కకు నెట్టేస్తుందని అధ్యయనకారులు పేర్కొంటున్నారు. అయితే దీనికి పరిమితులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ అధ్యయనం ప్రాథమికంగా కృత్రిమ, ప్రయోగశాల కేంద్రీకృతంగా నిర్వహించారని, ట్రామాటిక్ అనుభవాలతో బాధపడుతున్నవారిపై నిర్వహించిందని కాదని చెబుతున్నారు. ఈ ప్రక్రియను మరింత అర్ధం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు, పరిశోధనలు జరుగాల్సి ఉన్నదని అంటున్నారు. అదే సమయంలో ఈ విధానం ద్వారా చెడు జ్ఞాపకాలను పూర్తిగా చెరిపివేయడం సాధ్యం కానప్పటికీ.. వాటిని బలహీనం చేసేందుకు మాత్రం అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
Read Also |
Earth Second Moon | భూమికి మరో చందమామ? నాసా ఏం ధృవీకరిస్తున్నది?
Sholay Re-Release : కాస్కోండి..’షోలే’ రీ రిలీజ్ ఫిక్స్
Viral News | 16 ఏళ్ల అమ్మాయిని 2 సంవత్సరాలు గదిలో నిర్భంధించిన తల్లి.. రీసన్ తెలిస్తే షాకే!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram