TVK Vijay | పెళ్లి చేసుకుంటే 8 గ్రాముల బంగారం, ఒక పట్టుచీర.. మహిళలపై వరాల జల్లు కురిపించిన టీవీకే అధినేత విజయ్!

TVK Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీవీకే అధినేత విజయ్ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు 8 గ్రాముల బంగారంతో పాటు పట్టుచీరను ప్రభుత్వం తరఫున ఉచితంగా అందజేస్తామని తెలిపారు.

TVK Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీవీకే అధినేత విజయ్ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాడు మహాబలిపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సూపర్ సిక్స్ స్కీమ్‌ను ప్రకటించారు. మహిళా సంక్షేమం, రక్షణే ధ్యేయంగా పలు పథకాలను తీసుకొస్తున్నట్లు వివరించారు.

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మినహా 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని విజయ్ ప్రకటించారు. ఈ సొమ్మును నేరుగా మహిళల ఖాతాలో జమచేస్తామని తెలిపారు. అలాగే అన్ని కుటుంబాలకు ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన తల్లులకు అండగా ఉండటం కోసం అమ్మ ఒడి తరహాలో ఒక పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లులకు ఏడాదికి రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఆడబిడ్డలకు విజయ్ పెళ్లి కానుక

ఆడబిడ్డల పెళ్లి విషయంలో తల్లిదండ్రులపై భారం తగ్గించేందుకు “అన్న విజయ్ సాయం” అనే పథకాన్ని విజయ్ ప్రకటించారు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు 8 గ్రాముల బంగారంతో పాటు పట్టుచీరను ప్రభుత్వం తరఫున ఉచితంగా అందజేస్తామని తెలిపారు. పిల్లలు పుడితే గోల్డ్ రింగ్ ఇస్తామన్నారు. మహిళల ఆరోగ్యం కోసం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందజేస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం తమిళనాడులో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంలోని లోపాలను విజయ్ ఎత్తిచూపారు. ఉచిత బస్సు పథకాన్ని కొన్ని బస్సులకే పరిమితం చేయడం వల్ల మహిళలకు గంటల తరబడి బస్టాప్‌ల్లో ఎదురుచూడాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే మహిళలపై నేరాలను అరికట్టేందుకు బాడీ కెమెరాలతో కూడిన రాణివేలు నాచాయర్ ఫోర్సెస్ పేరుతో 500 ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేస్తామని విజయ్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా చీకటి ప్రాంతాలు లేకుండా పటిష్టమైన లైటింగ్, సీసీ టీవీ నిఘా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో స్మార్ట్ ప్యానిక్ బటన్లను ఏర్పాటు చేసి, కేవలం ఐదు నిమిషాల్లోనే పోలీసులు స్పందించేలా 24 గంటలు కమాండ్ సెంటర్‌కు అనుసంధానిస్తామని చెప్పారు.

 

 

Latest News