కాకినాడలో ‘NBK111’ సినిమా షూటింగ్‌లో గాయపడిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి వైద్యులు.. బాలకృష్ణ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ప్రమాదం కారణంగా బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలిందని పేర్కొంది. ప్రస్తుతం ఆయన క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పరీక్షలన్నీ పూర్తయ్యాక చికిత్స ప్రణాళికను ఖరారు చేయనున్నాం అని పేర్కొన్నారు.
గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న NBK111 (వర్కింగ్ టైటిల్) సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ లో బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ప్రమాదంలో బాలయ్య మోకాలు మసిల్ టియర్ అయింది.ఈ విషయం తెలియగానే బాలకృష్ణ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దర్శకుడు గోపిచంద్ ఎక్స్ లో వెల్లడించారు. బాలకృష్ణకు మెకాలి కండరాల వద్ద చిన్న మైనర్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత వైద్య నిపుణులు ఆయనకు సుమారు 5 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అని ఎక్స్ లో రాసుకొచ్చారు.
బాలకృష్ణకు సర్జరీ కావడంతో నెల పాటు ఎన్‌బీకే 111 చిత్రీకరణకు విరామం ఇవ్వాలని చిత్ర బృందం నిర్ణయించినట్టు సమాచారం. సినిమాలో మెజారిటీ సీన్స్ షూటింగ్ పూర్తయ్యిందని, విలన్ రోల్ చేస్తున్న మంచు మనోజ్, హీరో బాలకృష్ణ మీద యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ షెడ్యూల్ కంటిన్యూ చేయాలంటే బాలకృష్ణ సెట్స్‌కు రావాల్సి ఉంది. ఆయనకు సర్జరీ నేపథ్యంలో నెల రోజుల పాటు చిత్రీకరణకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చిత్ర బృందం పేర్కొంది.