• Telugu News
  • /Devotional

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన శ్రీమాలిక పవిత్ర గ్రంధాన్ని ఆవిష్కరించి ఆలయ అర్చకులకు, వేదపండితులకు అందజేశారు.

Reported by: raj | ఆధ్యాత్మికం | Mar 06, 2026, 10:34 pm IST
Read Time: 5 mins
కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు
*ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక

కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలమైన శ్రీమాలిక వంటి నాలుగు వందల పేజీల మహోజ్వల మంత్ర స్తోత్ర కథా వైభవాల అఖండ గ్రంధాన్ని వందల కొలది ప్రతులను ఉభయ దాతలకు, భక్తులకు, రాజకీయ సాంస్కృతిక రంగాల ప్రముఖులకు పంచేందుకు దేవస్థానానికి సమర్పించిన మాజీమంత్రి, కిమ్స్ హాస్పటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకు ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం ఉంటుందని దేవస్థానం డిప్యూటీ కమీషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన శ్రీమాలిక పవిత్ర గ్రంధాన్ని ఆవిష్కరించి ఆలయ అర్చకులకు, వేదపండితులకు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాహావతారమైన నృసింహావిర్భావఘట్టం అద్భుతమైన కథతో పాటు వేంకటాచలక్షేత్రమైన తిరుమల వైభవ వైభోగ విశేష కధనాలు, ఋషుల వరప్రసాదంగా అందిన స్తోత్రాలకు రమణీయ కమనీయ వ్యాఖ్యానాలు పురాణపండ శ్రీనివాస్ ఎంతో పవిత్రంగా, అందంగా అందించి భక్త జనహృదయాలను కొల్లగొట్టారని అభినందించారు.

ఈ దివ్య గ్రంథ శ్రీకార్యాన్ని బలపరిచి ప్రోత్సహించిన హిందూపూర్ శాసన సభ్యులు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటిలకు వెండిదండి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.గతంలో నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సమర్పించిన ‘శరణు … శరణు’ మహోజ్వలమైన లక్ష్మీ నరసింహ స్వామి వందల కొలది భారీ గ్రంధాలను తిరుమల, కదిరి, సింహాచలం క్షేత్రాలకు భక్త జనులకు, పాఠకులకు, పండిత వర్గాలకు అందజేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే ఇంద్రకీలాద్రి, వేంకటాద్రి, యాదాద్రి, శ్రీశైలం, అన్నవరం వంటి అనేక క్షేత్రాలలో గత రెండు దశాబ్దాలుగా పురాణపండ శ్రీనివాస్ రచనలు, సంకలనాలు అనేక ధార్మిక పారమార్ధిక గ్రంధాల రూపంలో లక్షలాది భక్తులను అలరిస్తున్నాయనేది స్పష్టమైన సత్యం.