Bala Krishna | నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు .. 50 ఏళ్ల నట ప్రస్థానానికి అంతర్జాతీయ గౌరవం

Bala Krishna | నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ మరోసారి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. నందమూరి తారకరామరావు నట వారసుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన బాలకృష్ణ, ఐదు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ ప్రత్యేక చరిత్ర సృష్టించారు. ఈ దీర్ఘకాల సినీ ప్రస్థానానికి గాను ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.

  • By: Sandeep |    movies |    Published on : Mar 26, 2026 11:09 AM IST
Bala Krishna | నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు .. 50 ఏళ్ల నట ప్రస్థానానికి అంతర్జాతీయ గౌరవం

Bala Krishna | నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌ మరోసారి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. నందమూరి తారకరామరావు నట వారసుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన బాలకృష్ణ, ఐదు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ ప్రత్యేక చరిత్ర సృష్టించారు. ఈ దీర్ఘకాల సినీ ప్రస్థానానికి గాను ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.

ఢిల్లీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును అందుకున్నారు. అదే వేదికపై బాలీవుడ్ దిగ్గజాలు ధ‌ర్మేంద్ర‌, ష‌ర్మిళ ఠాగూర్‌ల‌ను కూడా జీవిత సాఫల్య పురస్కారాలతో గౌరవించడం విశేషం.

మార్చి 31 వ‌ర‌కు..

‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ’ (IFFD 2026) వేడుకలు బుధవారం సాయంత్రం దేశ రాజధానిలో ఘనంగా ప్రారంభం కాగా, ఈ ఉత్స‌వాల‌కి ‘భారత్ మండపం’ వేదికైంది. మార్చి 31 వరకు కొనసాగనున్న ఈ చలనచిత్ర ఉత్సవాల్లో వివిధ భాషా చిత్రాలను ప్రదర్శించనున్నారు. సీఎం రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్‌ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమ మాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు.

బాలకృష్ణ సినీ ప్రయాణం విషయానికొస్తే… సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, హారర్ వంటి అనేక జానర్లలో 110కి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ఆయన నటించిన సినిమాల్లో ఎక్కువగా టైటిల్ ఓరియెంటెడ్ కథలే ఉండటం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గత 50 ఏళ్లుగా హీరోగానే కొనసాగుతూ, ఒక్కసారైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించకపోవడం ఆయన ప్రత్యేక గుర్తింపు.

సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌లోను..

ఈ విశిష్ట ప్రయాణంతో బాలకృష్ణ పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ వంటి ప్రతిష్టాత్మక రికార్డుల్లో చోటు సంపాదించింది. అంతేకాకుండా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో గంట మోగించిన తొలి హీరోగా కూడా ఆయన రికార్డు సృష్టించారు.ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆయనకు ఘన సన్మానం లభించింది. ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు జాతీయ అవార్డు రావడం మరో విశేషం.

సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బాలకృష్ణ తనదైన ముద్ర వేశారు. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అరుదైన రికార్డు సృష్టించారు. ఒక సినీ హీరోగా ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన అరుదైన ఘనత ఆయనకే దక్కింది.

అదేవిధంగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా సేవలందిస్తూ పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఒకవైపు ప్రజాసేవ, మరోవైపు సినీ ప్రస్థానం కొనసాగిస్తూ బాలకృష్ణ ఇప్పటికీ యాక్టివ్‌గా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఆయన లైన్‌లో ఉన్నాయి.