• Telugu News
  • /National

Bribery For Darshan | తమిళనాడులో వీఐపీ దర్శనాల దందా.. సాధారణ భక్తుడిలా వెళ్లి పూజారి బాగోతం బయటపెట్టిన మంత్రి..!

వీఐపీ దర్శనాల పేరిట తిరుచెందూర్ ఆలయంలో జరుగుతున్న అక్రమ దందాను తమిళనాడు మంత్రి రమేశ్ బయటపెట్టారు. మాస్క్ ధరించి మారువేషంలో వెళ్లి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పూజారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Reported by: Chandram | జాతీయం | May 29, 2026, 10:00 pm IST
Read Time: 5 mins
Bribery For Darshan | తమిళనాడులో వీఐపీ దర్శనాల దందా.. సాధారణ భక్తుడిలా వెళ్లి పూజారి బాగోతం బయటపెట్టిన మంత్రి..!

Bribery For Darshan | తమిళనాడులోని ప్రముఖ తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో త్వరిత దర్శనం పేరుతో భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీఐపీ దర్శనం పేరిట ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి ఆర్.రమేశ్ రంగంలోకి దిగాడు. మాస్క్ ధరించి సాధారణ భక్తుడిలో క్యూలైన్‌లో వచ్చి ఆకస్మిక తనిఖీ నిర్వహించి, పూజారి బాగోతాన్ని బయటపెట్టాడు.

తూత్తుకూడి జిల్లా తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో వీఐపీ దర్శనం పేరిట భక్తుల నుంచి డబ్బులు గంజుతున్నారని కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని దేవాదాయ శాఖ మంత్రి రమేశ్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా ఆలయంలో స్వయంగా తనిఖీలు చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో తనను ఎవరూ గుర్తుపట్టకుండా సాదాసీదా టీ షర్ట్ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఒక సామాన్య భక్తుడిలా ఉదయాన్నే తిరుచెందూర్ మురుగన్ ఆలయానికి చేరుకున్నారు.

ఆలయ క్యూలైన్‌లో మంత్రి రమేశ్ నిలబడిన సమయంలో ఒక పూజారి ఆయన దగ్గరకు వచ్చాడు. రూ. 4000 ఇస్తే గంటల తరబడి వేచి ఉండాల్సిన పని లేకుండా నేరుగా వీఐపీ దర్శనం కల్పిస్తానని చెప్పాడు. దీనికి రమేశ్ అంగీకరించి, తన మొబైల్ ద్వారా గూగుల్ పే నంబర్‌కు రూ.4వేలు పంపించారు. అకౌంట్‌లోకి డబ్బులు పడగానే.. సదరు పూజారి మంత్రిని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మంత్రి రమేశ్ తన ముఖానికి ఉన్న మాస్క్ తీసేశాడు. మాస్క్ వెనుక ఉన్నది దేవాదాయ శాఖ మంత్రి అని గుర్తించిన పూజారి ఒక్కసారిగా బిత్తరపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన పూజారిని దేవాదాయ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. ఇకపై ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడనని సదరు పూజారి చేతిలో స్వయంగా క్షమాపణ లేఖ రాయించుకున్నారు. కాగా పూజారితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లుగా దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి రమేశ్ మాట్లాడుతూ.. తిరుచెందూర్ ఆలయంలో అక్రమాలు, భక్తుల నుంచి డబ్బుల వసూళ్లపై అనేక ఫిర్యాదులు వచ్చాయని.. అందుకే తానే స్వయంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయంలో పూజారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై పూర్తి నివేదికను ముఖ్యమంత్రి విజయ్‌కు అందజేస్తామని చెప్పారు. ఆలయంలో అన్ని అవకతవకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.