New Rules From April | ఫాస్టాగ్ నుంచి క్రెడిట్‌కార్డుల వ‌ర‌కు.. ఏప్రిల్ నుంచి మారేవి ఇవే..!

  • Publish Date - March 30, 2024 / 03:43 AM IST

New Rules From April | రేప‌టితో మార్చి నెలతో పాటు ఆర్థిక సంవ‌త్స‌రం సైతం ముగియ‌బోతున్న‌ది. కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌ల‌వ‌నున్న‌ది. ఈ క్ర‌మంలో కొత్త‌గా ప‌లు మార్పుల‌తో పాటు నిబంధ‌న‌లు మార‌నున్నాయి. ఫాస్టాగ్‌తో పాటు ఆదాయ‌పు ప‌న్ను, క్రెడిట్‌కార్డుల నిబంధ‌న‌లు, ఎల్‌పీజీ గ్యాస్ ధ‌ర‌ల‌తో పాటు ప‌లు మార్పులో చోటు చేసుకోబుతున్నాయి. కొత్త సంవ‌త్స‌రంలో ఏయే అంశాల్లో మార్పులో చోటు చేసుకోనున్నాయో ఓసారి తెలుసుకుందాం రండి..!

ఫాస్టాగ్ కేవైసీ ఇక త‌ప్ప‌నిస‌రి..

కార్లు ఇత‌ర వాహ‌నాలున్న వారికి త‌ప్ప‌నిస‌రిగా ఫాస్టాగ్ అకౌంట్ ఉండే ఉంటుంది. మార్చి నెలాఖ‌రులోగా త‌ప్ప‌నిస‌రిగా ఫాస్టాగ్ కేవైసీని పూర్తి చేయాలి్సందే. లేక‌పోతే ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి ఫాస్టాగ్ అకౌంట్‌ను నిలిపివేసే అవ‌కాశం ఉన్న‌ది. దాంతో హైవేల‌పై వెళ్లే స‌మ‌యంలో టోల్‌గేట్ల వ‌ద్ద ఇబ్బందులు త‌ప్ప‌వు. ఫాస్టాగ్ ఆప‌రేష‌న్స్‌లో ఇబ్బందులు లేకుండా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్ప‌ష్టం చేసింది.

పాన్- ఆధార్ లింక్..

పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గ‌డువు మార్చి 31వ తేదీతో ముగియ‌నున్న‌ది. పాన్‌తో ఆధార్ అనుసంధానం చేయ‌లేక‌పోతే డీయాక్టివేట్ చేసే ప్ర‌మాదం ఉంటుంది. మ‌ళ్లీ ఏప్రిల్ ఒక‌టి త‌ర్వాత ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు భారీగా జ‌రిమానా విధించే అవ‌కాశం ఉన్న‌ది. ప్ర‌స్తుతం రూ.1000 పెనాల్టీతో పాన్- ఆధార్ లింక్ చేసుకునేందుకు అవకాశం ఉన్న‌ది. జ‌రిమానా మ‌రింత పెరిగే అవ‌కాశాలున్నందున ఇప్ప‌టి వ‌ర‌కు ఆధార్‌-పాన్ లింక్ చేయ‌ని వారు ఆదివారంలోగా పూర్తి చేస్తే జ‌రిమానాను త‌ప్పించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఇక పీఎఫ్ అకౌంట్ ఆటోమేటెడ్ ట్రాన్స్‌ఫర్..

ఉద్యోగుల‌కు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ సంబంధించి ఏప్రిల్ 1 నుంచి స‌రికొత్త నిబంధ‌న‌లు అమ‌లులోకి రాబోతున్న‌ది. ఈపీఎఫ్ఓ వచ్చే నెల నుంచి ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ది. ఉద్యోగి ఒక కంపెనీ నుంచి.. మ‌రో కంపెనీలోకి మారిన స‌మ‌యంలో మ్యానువ‌ల్‌గా అకౌంట్ ట్రాన్స్‌ఫ‌ర్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉండేది. ప్ర‌స్తుతం దాని స్థానంలో ఆటోమేటెడ్ ట్రాన్స్‌ఫ‌ర్ విధానం తేబోతున్న‌ది. దాంతో యూజ‌ర్ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌నున్నాయి.

ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్‌ కార్డు రూల్స్..

కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌కార్డుల రూల్స్‌ను మార్చ‌బోతున్న‌ది. ఇకపై క్రెడిట్ కార్డుతో చేసే రెంట్ పేమెంట్లపై రివార్డ్ పాయింట్ల‌పై కోత విధించింది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్ల జారీని నిలిపివేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఏప్రిల్ 15, 2024 నుంచి అన్ని క్రెడిట్ కార్డులకు అమలు చేసే అవ‌కాశం ఉన్న‌ది. అలాగే ప‌లు డెబిట్‌కార్డుల ఫీజుల‌ను సైతం పెంచింది. ఏప్రిల్ ఒక‌టి నుంచి అమ‌లులోకి రానున్నాయి.

ఎల్‌పీజీ గ్యాస్ ధరలు..

సిలిండ‌ర్ ధ‌ర‌లు పెర‌గ‌డం లేదంటే త‌గ్గే అవ‌కాశాలున్నాయి. సాధారణంగా చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెల మొదటి రోజున ఎల్‌పీజీ గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి. మార్కెట్‌కు అనుగుణంగా సవరణలు చేస్తూ వ‌స్తుంటాయి. ధరలు పెంచడం, తగ్గించడం.. లేదంటే యథాతధంగా కొనసాగించడం చేస్తుంటాయి. ఇటీవ‌ల సార్వ‌త్రిక ఎన్నిల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. ఈ క్ర‌మంలో కేంద్రం ధ‌ర‌లు త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ఇటీవ‌ల సిలిండ‌ర్‌పై రూ.100, పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున త‌గ్గించిన విష‌యం విధిత‌మే.

కొత్త ట్యాక్స్ విధానం..

ఆదాయ‌పు పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం రెండు పన్ను విధానాలు అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 1 త‌ర్వాత ఎవరైనా పన్ను విధానం ఎంచుకోకపోతే.. వారికి కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా అమ‌లులోకి రానున్న‌ది. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, కాంప్లియన్స్‌ని ప్రోత్సహించేందుకు ఆటోమేటిక్ ట్రాన్సిషన్ అమలు చేయ‌బోతున్న‌ది ఐటీశాఖ‌. సవరించిన నిబంధనలకు అనుగుణంగా ట్యాక్స్ పేయర్స్ కొత్త పన్ను విధానంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉండ‌నున్న‌ది.

Latest News