విధాత: పదవతరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ కి హనుమకొండ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. 20వేల పూచి కత్తు, ఇద్దరి షూరిటీతో, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళవద్దని విచారణకు సహకరించాలన్న షరతులతో బెయిల్ మంజూరు చేశారు.
సంజయ్ బెయిల్ పిటిషన్ పై హన్మకొండ జిల్లా కోర్టులో పోలీసులు తరపు న్యాయవాదికి, సంజయ్ న్యాయవాదులకు మధ్య అసాధారణంగా ఎనిమిది గంటల పాటు ఉత్కంఠ భరిత వాదనలు సాగాయి. రాత్రి 10 గంటలకు బెయిల్ మంజూరు చేశారు. విచారణ కీలక దశలో ఉన్నందున బండి సంజయ్ కి బెయిల్ ఇవ్వద్దని పీపీ కోరారు. ఇస్తే బండి సంజయ్ సాక్షాలను తారుమారు చేస్తారని వాదించారు.
సంజయ్ ఫోన్ మిస్సయిందని దాంట్లో విలువైన డాటా ఉందంటూ పిపి ఫోన్ కోసం పట్టుబట్టారు. అలాగే సంజయ్ కు ఈరోజే బెయిల్ ఇవ్వాలని లేదంటే పిటిషన్ డిస్మిస్ చేయాలని సంజయ్ తరపు న్యాయవాదులు వాదించారు. సోమవారానికి కేసు వాయిదా వేస్తామని జడ్జి చెప్పగా వరుస సెలవుల నేపధ్యంలో వాయిదా వద్దని, ఇదే రోజు బెయిల్ పై నిర్ణయానికి ప్రకటించాలని, లేదంటే పిటిషన్ డిస్మిస్ చేస్తే హైకోర్టు కు వెలుతామని సంజయ్ తరపు న్యాయవాదులు కోరారు.
ఈ సందర్భంగా జడ్జీ పిటిషనర్ గ్రౌండ్ కింద విచారణ సాగిస్తానని, ఈ తరహా కేసును తను ఇప్పటివరకు చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు. ప్రశ్న పత్రం లీకేజ్ చేసిన వ్యక్తికి బండి సంజయ్ కి ఏ సంబంధం లేదని అలాంటప్పుడు కేవలం వాట్సాప్ మెసేజ్ ల ఆధారంగా సంజయ్ ను నిందితుడిగా పోలీసులు ఎలా పేర్కొంటారని, కుట్ర కోణం అభియోగాలు ఎలా మోపుతారని సంజయ్ తరపు న్యాయవాదులు వాదించారు.
వరంగల్ సిపి రంగనాథ్ రెండు రోజుల తేడాలో ప్రశ్నపత్రం లీకేజీ కేసులో పరస్పరం భిన్నంగా చెప్పిన మాటలను వారు జడ్జికి వినిపించారు. రేపు సంజయ్ అత్తగారి కర్మ ఉండటంతోపాటు 8వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమం ఉన్నందున సంజయ్ కి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
బెయిల్ మంజూరు ఉత్తర్వులను సంజయ్ తరపు న్యాయవాదులు కరీంనగర్ జైలు అధికారులకు అందించేందుకు బయలుదేరారు. కాగా సంజయ్ ని పోలీస్ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ పై సోమవారం వాదనలు సాగనున్నాయి.
20000 పూచికత్తు
దాదాపు 8 గంటల పాటు సాగిన వాదనల అనంతరం జడ్జి ఎట్టకేలకు తీర్పును ప్రకటించారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని న్యాయవాదులు చెబుతున్నారు. 20000 పూచికత్తు పై, ఇద్దరు వ్యక్తుల జమానతుదారుల పూచి కత్తు ఇవ్వాలని పేర్కొన్నారు. దేశం విడిచి పోవద్దని, విచారణకు సహకరించాలని షరతులు విధించినట్లు సంజయ్ తరుపు లాయర్లు వెల్లడించారు. చివరికి బెయిల్ మంజూరు చేసినట్లు చెప్పారు.
రేపు విడుదల అయ్యే అవకాశం
బెయిల్ మంజూరైన పేపర్లను ఈ రాత్రికి గాని రేపు ఉదయం గాని కరీంనగర్ జైల్లో అందజేసిన అనంతరం బండి సంజయ్ విడుదలకు అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.
సంజయ్ బెయిల్‌తో సంబరాలు
బండి సంజయ్ కి బెయిల్ మంజూరు చేయడంతో బిజెపి కార్యకర్తలు శ్రేణులు పెద్ద సంఖ్యలో కోర్టు ఆవరణ ఆవరణకు చేరుకొని సంబరాలు జరుపు కున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టిన కేసు పై న్యాయపోరాటం ద్వారా తేల్చుకుంటామని ప్రకటించారు.