Site icon vidhaatha

ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాల‌కు 20ల‌క్ష‌ల ప‌రిహార‌మివ్వాలి

ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాల‌కు 20ల‌క్ష‌ల ప‌రిహార‌మివ్వాలి

13 అంశాలు చెప్పి.. రెండు గ్యారెంటీలు పూర్తి చేశామంటున్నారు

ఆరోగ్య‌శ్రీ ద్వారా ఎవ‌రికైనా ప‌ది ల‌క్ష‌లు ఇచ్చారా?

అదానీని రాహుల్ వ్య‌తిరేకిస్తే.. మీరు ఎంవోయూలా?

నిల‌దీసిన బీఆరెస్ ఎమ్మెల్యేలు

గవర్నర్ ప్రసంగం అంశాలపై అసెంబ్లీలో రచ్చ

బీఆరెస్ ఎమ్మెల్యేలు.. మంత్రుల మధ్య వాగ్వివాదం

విధాత : గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీఆరెస్ ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ మంత్రులకు మధ్య పలుమార్లు వాదప్రతివాదాలు చోటుచేసుకున్నాయి. ఆటో డ్రైవర్ల సమస్యలను బీఆరెస్ సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో లెవనెత్తిన సందర్భంగా మంత్రులకు, బీఆరెస్ సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆరెస్ త‌ర‌ఫున‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. గవర్నర్‌తో ముప్ఫై మోసాలు, అరవై అబద్ధాలు చెప్పించారని విమర్శిచారు. కాంగ్రెస్ ఇచ్చిన పలు హామీలు గవర్నర్‌ ప్రసంగంలో లేవన్నారు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. 13 హామీలిచ్చి రెండు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నార‌ని ఆక్షేపించారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టం ఇవ్వాలని, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెంచాలని సూచించారు. గత ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింద‌ని ప‌ల్లా చెప్పారు. పదేళ్లలో 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అదానీ ఇక్కడకు వస్తే తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆగిపోతుందన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.20 కోట్లు ఖర్చు చేస్తే రూ.60 కోట్లు ప్రచారం చేసుకున్నారని ఎద్దేశా చేశారు.

13 అంశాల్లో అమ‌లు చేసిన‌వి రెండే

13 అంశాల్లో కేవలం రెండు మాత్రమే అమలుచేశారని ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి విమర్శించారు. మహిళలకు ఉచిత ప్ర‌యాణం అన్నారు కానీ.. బస్సుల సంఖ్య, ట్రిప్పులు పెంచలేదని ఆరోపించారు. ప్రమాణ స్వీకారం రోజునే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము అడుగుతున్నామని చెప్పారు. ఆరున్నర లక్షల మందికిపైగా ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెండు నెలల్లో 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణను ఎవ్వరు ఇవ్వలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. బ్రిటీష్ వాళ్లు స్వాతంత్రం ఇవ్వలేదని, దేశ ప్రజలు పోరాడి సాధించుకున్నారన్నారని, అదే తరహాలో తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. అయితే కేసీఆర్ స్వయంగా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పి కుటుంబంతో పాటు వెళ్లి ఆమెను కలిసిన సంగతిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. అనంరతం పల్లా ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని కేసీఆర్‌ సాధించారని స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌కు కంచెలు పెట్టామన్న కాంగ్రెస్‌.. అసెంబ్లీ ముందు కొత్త కంచెలు పెట్టిందని ఆరోపించారు. ప్రజాభవన్‌కు వచ్చేవారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరని.. ఇప్పటివరకు ఎవరి సమస్యలనైనా పరిష్కరించారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ కనీసం వారానికి ఒక్కసారి కూడా ప్రజావాణికి హాజరుకాలేదని విమర్శించారు. చట్టసభల్లో అబద్దాలు చెప్పడం తీవ్ర నేరమన్నారు.అగ్రికల్చర్‌ యూనివర్సిటీ భూములు తీసుకోవద్దంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనను పోలీసులతో అణిచివేస్తుందన్నారు. మార్పు అంటే నంబర్‌ ప్లేట్లు మార్చడం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు చిల్లి గవ్వ ఇవ్వకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదన్నారు. దావోస్ కు వెళ్లి పెట్టుబడులను సాధించడంపై గతంలో మమ్మల్ని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు వారు అదే పనిచేసి పెట్టుబడులను సాధించడ సంతోషకరమన్నారు. రాహుల్ గాంధీ అదానీ పెట్టుబడులను వ్యతిరేకిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆదానీతో ఎంవోయులు కుదుర్చుకున్నారని పల్లా విమర్శంచారు.

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి శ్రీధర్ బాబు

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో వెల్లడించారు. బీఆరెస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పల్లా లేవనెత్తిన సమస్యలపై ఆయన సమధానమిస్తూ చిన్నచిన్న సమస్యలు వస్తాయనే మ్యానిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అభయమిచ్చిందన్నారు. ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఈ మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వచ్చే బడ్జెట్లో దీనిని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. “రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి అనేది నిత్యం కొనసాగుతుంది. అందరికి అవకాశం ఇవ్వాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశం ఒకరిద్దరికే అవకాశం ఇవ్వొద్దని రాహుల్ గాంధీ చెప్పారు. పెట్టుబడుదారులను రాష్ట్రానికి స్వాగతిస్తాం తెలంగాణ అభివృద్ధిపై సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. రాజకీయాలు పదిలి రాష్ట్ర ప్రగతిపై మాట్లాడదాం అని హితవు పలికారు.

ఉచిత ప్రయాణ వసతిపై బీఆరెస్ అక్కసు : మంత్రులు పొన్నం..సీతక్క

ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం రూ.530 కోట్లను ఇచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. “మీరు. ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేశారా పదేళ్లలో నెలకు రూ. వెయ్యి ఇచ్చారా? సభను తప్పుదోవ పట్టించేలా బీఆరెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని, మహిళలకు ఉచిత ప్రయాణ వసతిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. మంత్రి సీతక్క, మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? చెప్పాలని నిలదీశారు. మహిళలు ఉచితంగా తిరిగితే మీకేంటి సమస్య అని, ఆటో డ్రైవర్లలో భావోద్వేగాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బీఆరెస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తాము మహిళలకు ఉచిత ప్రయాణ పథకానికి వ్యతిరేకం కాదని, అదే సమయంలో ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.

ఉద్యమ ఆకాంక్షలను విస్మరించిన బీఆరెస్ పాలన : కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం

అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన బీఆరెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను, ఆకాంక్షలను విస్మరించి పదేళ్ల పాలనలో నిర్భంధాన్ని అమలు చేసిందన్నారు. ప్రజలు స్వేచ్చను కోరుకుని పాలనలో మార్పు తెచ్చుకుని కాంగ్రెస్ ను గెలిపించుకున్నారన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రజాపాలనను ప్రతిబింబిస్తోందన్నారు. ఉద్యమ సమయంలో జయజయహే తెలంగాణ గీతం స్ఫూర్తిని నింపిందని… ప్రజా ప్రభుత్వంలో జయజయహే.. తెలంగాణ రాష్ట్ర గీతం కావడం గర్వకారణమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన మొదలైందని చెప్పారు బీఆరెస్ పదేళ్ల పాలనలో తెలంగాణ పాఠశాలలు నిర్వీర్యమైపోయాయని, పాఠశాలలు, హాస్టల్స్ సమస్యల మయంగా మారిపోయాయన్నారు. ధరణి పేరుతో వేలాది ఎకరాల భూములను హాంఫట్ చేశారని ఆరోపించారు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అమలు చేస్తామంటే విమర్శించారు. చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగే వారు ఇప్పుడు ఆటోల్లో వచ్చారని ఎద్దేవా చేశారు. నెల రోజులకే మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చారని బీఆరెస్ ను ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే.. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. తప్పుడు జీవోలతో దాదాపు 800 ఎకరాలు మాయం చేశారని మండిపడ్డారు. గతంలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని చూశామని, కానీ మా సీఎం సచివాలయం నుంచి పరిపాలన చేస్తున్నారన్నారు. సీఎంతోపాటు మంత్రులు కూడా అందరినీ కలుస్తూ అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. మే పాలకులం కాదు.. సేవకులంగా పాలన చేస్తున్నామన్నారు. మేం చెప్పినట్లుగా టిఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం.. త్వరలోనే ధరణిని కూడా ప్రక్షాళన చేసి.. రైతుల సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. టిఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని… కాంగ్రెస్ పాలనలో పారిశ్రామిక ప్రగతిని సాధిస్తామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Exit mobile version