Site icon vidhaatha

TRSకు షాక్‌: గుర్తుల తొలగింపు.. పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

విధాత: కారును పోలిన 8 గుర్తులను తొలిగించాల‌న్న టీఆర్ఎస్ పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నందున ప్ర‌స్తుతం జోక్యం చేసుకోలేమ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. కారును పోలిన గుర్తుల‌ను తొలిగించాల‌ని టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ స్పందించ‌డం లేదు కాబ‌ట్టి కోర్టు జోక్యం చేసుకోవాల‌ని కోరుతూ టీఆర్ఎస్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

శ‌నివారం రోజు హౌజ్ మోష‌న్ దాఖ‌లు చేయ‌గా హైకోర్టు అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు నిరాక‌రించింది. నిన్న లంచ్‌మోష‌న్‌కు కూడా నిరాక‌రించింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థ‌న మేర‌కు ఈరోజు విచార‌ణ చేసింది. కారు గుర్తును పోలిన గుర్తులు కెమెరా, చపాతీ రోలర్‌, డాలీ, రోడ్‌ రోలర్‌, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్‌, ఓడ గుర్తుల వల్ల ఓటర్లలో గందరగోళం ఏర్పడుతున్న‌ద‌ని దీనివ‌ల్ల టీఆర్ఎస్ అభ్య‌ర్థులు న‌ష్ట‌పోతున్నారని పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

గ‌తంలో 2018లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో చెన్నూరు, దుబ్బాక‌, సిద్దిపేట, ఆసీఫాబాద్‌, బాన్స్‌వాడ‌, నాగార్జున సాగ‌ర్‌ల‌లో ఇదే జ‌రిగింది. మునుగోడులో ఇలాంటి ప‌రిస్థితే పున‌రావృత‌మ‌తుంద‌ని పేర్కొన్న‌ది. బీఎస్పీ, క‌మ్యూనిస్టులు, కొంత మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థుల కంటే ఈ గుర్తుల‌కు ఓట్లు ఎక్కువ వ‌చ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించింది. కాబ‌ట్టి ఆ గుర్తుల‌ను తొలిగించాల‌ని కోరారు. 2018లో కొన్ని గుర్తుల‌ను తొలిగించారని, ప్ర‌స్తుతం ఈసీ నుంచి ఎలాంటి స్పంద‌న లేద‌ని టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున న్యాయ‌వాది హైకోర్టులో కోరారు.

అయితే ఎన్నిక‌ల క‌మిష‌న్ దినిపై స్ప‌ష్ట‌త ఇచ్చింది. తాము టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విన‌తిప‌త్రాన్ని అన్ని కోణాల్లో ప‌రిశీలించిన త‌ర్వాతే గుర్తులు కేటాయించామ‌ని తెలిపారు. 2018లో టీఆర్ఎస్ కొన్ని అభ్యంత‌రాలు చెబుతూ త‌మ‌కు ద‌ర‌ఖాస్తు చేసింది. అప్పుడు కొన్ని గుర్తులు తొలిగించిన‌ట్టు ఈసీ వివ‌రించింది.

ప్ర‌స్తుతం ఉన్న ఈ 8 గుర్తుల ప‌ట్ల 2018లో టీఆర్ఎస్ ఎలాంటి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేదు. కారు డిజైన్ కొంత మార్పు చేసుకోవాల‌ని కోర‌గా దానికి అంగీక‌రించాం. కానీ ప‌దే ప‌దే ఈవిధంగా కోర‌డం వీలుకాదు. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే గుర్తులు ఉన్నాయి. కాబ‌ట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వీటిపై ఓట‌ర్ల‌కు స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం. క‌నుక ప్ర‌స్తుతం ఈ గుర్తుల‌ను తొలిగించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. అన్నివాదన‌లు విన్న త‌ర్వాత ఈ సీ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించి టీఆర్ఎస్ పిటిష‌న్‌ను తొలిగించింది.

Exit mobile version