- రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణం
- పార్లమెంటు ఎన్నికల తర్వాతా ఏదైనా జరగొచ్చు
- బీఆరెస్ ఎమ్మెల్యేలు..ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు
- రాష్ట్రంలో బీఆరెస్ మునిగిన పడవ…కాంగ్రెస్ మునగబోయే పడవ
- భవిష్యత్తు బీజేపీదే.. రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్
విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల తర్వాతి రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా ఉండబోతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడి, అసహనంతో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారన్నారు. తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితి తలెత్తవచ్చన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో సొంత పార్టీ వారే అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్నారు. దీంతో ఆ రాష్ట్ర సీఎం రాజీనామా చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయమంటు తన నిస్సాహాయతను వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కర్ణాటకలోనూ అదే రీతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగబడుతున్నారన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబోటీ మెజార్టీతో 64సీట్లతో ఉందని, తుమ్మితే ఊడిపోయే పరిస్థితిలో ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాతా తెలంగాణలో ఏం జరుగుతుందో చూడండని, ఏదైనా జరుగవచ్చన్నారు. తెలంగాణ మరో కర్నాటక అవుతుందా హిమాచల్ ప్రదేశ్ అవుతుందో చూడండన్నారు. ఢిల్లీలో లేని కాంగ్రెస్ తెలంగాణలో ఎంత మొత్తుకుంటే లాభమేంటన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇబ్బందులు పడుతుందన్నారు. ఈ నేపధ్యంలో ఇక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్ మాదిరిగా కాంగ్రెస్‌లో తిరుగుబాటు రావచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డినే స్వయంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పడం చూస్తే ఇంకా 1లక్ష 53వేల కోట్లు అవసరముందన్నారు. గత ప్రభుత్వం అవినీతిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎం మాదిరిగా మార్చుకున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, కాంగ్రెస్ ను గెలిపిస్తే, రాహుల్‌గాంధీని ప్రధానిగా చేస్తే మీకిచ్చిన హామీలను, గ్యారంటీలను అమలు చేస్తామని లింకు పెడుతున్నారన్నారు. అధికారంలోకి రాగానే హామీల విషయంలో మాట మారుస్తున్నారన్నారు. కాంగ్రెస్ చేతులు విరిచి కొడితే గాని హామీలు అమలు కాలేవన్నారు. తెలంగాణకు మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, ఇచ్చిన నిధులను మరిచిపోయి రాజకీయంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు మోడీని విమర్శిస్తున్నారన్నారు. వారికి ప్రజలే కర్రు కాల్చి వాత పెడుతారన్నారు. రేవంత్ మాదిరిగా తనకు అలాంటి భాష రాదని, గతంలో కరీంనగర్‌లో కేసీఆర్ కూడా హిందుగాళ్లు..బొందుగాళ్లు అని ప్రజలు తిరస్కరణకు గురయ్యాడన్నారు.
ఇక తెలంగాణలో బీఆరెస్ పరిస్థితి దారుణంగా ఉందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాతా ఆ పార్టీ మనుగడ కష్టమేనన్నారు. ఆ పార్టీ అడ్రస్ గల్లంతైందన్నారు. తెలంగాణలో బీఆరెస్ ఒక్క ఎంపీ సీటు గెలిచి పరిస్థితి లేదన్నారు. నిజంగా ఆ పార్టీకి ఎంపీ సీట్లు గెలుస్తదన్న నమ్మకం ఉంటే కేటీఆర్, హరీశ్‌రావులు ఎంపీగా పోటీ చేయాలన్నారు. సిటింగ్ బీఆరెస్ ఎంపీలు ఎవరు కూడా పోటీకి సిద్ధంగా లేరని, వారంతా మాతో టచ్‌లో ఉన్నారన్నారు. బీఆరెస్ పార్టీ మునిగిపోయిన పడవ అయితే మునగబోయే పడవ కాంగ్రెస్ అని అన్నారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనన్నారు. తెలంగాణలో బీజేపీ 17ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. గెలిచే గుర్రాలనే బరిలోకి దింపుతున్నామన్నారు.