Site icon vidhaatha

ఈ రోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం! ఈ ఏడాది ప్రత్యేకతేంటో తెలుసా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. అంతర్జాతీయ వద్ధుల దినోత్సవం.. అంతర్జాతీయ ఆ దినోత్సవం.. ఈ దినోత్సవం.. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.. ఈ కోవలోనే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కూడా నిర్వహిస్తుంటారు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకునేముందు అసలు ఇది ఏ రోజు నిర్వహిస్తారు? దీనిని ఎవరు ముందుకు తీసుకొచ్చారు.. అనే విషయాలను చూస్తే.. ప్రతి ఏటా నవంబర్‌ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకొంటారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమస్యలుంటాయి. ప్రతి సమూహానికి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి. అలానే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలూ ఉంటాయి. పురుషులు రకరకాల పాత్రల్లో ఉంటారు. తండ్రిగానో, సోదరుడిగానో, భర్తగానో.. కీలక భూమిక నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారి ఆరోగ్యం, శ్రేయస్సు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు దీనిని ఉద్దేశించారు. ప్రపంచానికి పురుషులు అందిస్తున్న సానుకూల సహకారాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడంతోపాటు.. సానుకూల ఆదర్శ మూర్తులుగా వారికి స్ఫూర్తి కల్గించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తుంటారు.


ఇదీ ఈ ఏడాది ప్రత్యేకత

ఏటా ఒక్కో ఇతివృత్తంతో నిర్వహించే ఈ ఉత్సవాలకు.. ఈ ఏడాది ‘ఏ ఒక్క పురుషుడూ ఆత్మహత్య చేసుకోకూడదు’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. దీనిని ఎంచుకోవడానికీ ఒక ప్రత్యేక కారణం ఉందండోయ్‌.. అదేమంటే.. ఆత్మహత్యలను గమనిస్తే.. అందులో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది. అందుకే దీనిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ఈ సారి ఈ థీమ్‌ను ఎంపిక చేశారు. ప్రత్యేకించి 45 ఏళ్ల వయసులోపు ఉన్న పురుషుల్లో మరణాలకు ఆత్మహత్య అనేది అతిపెద్ద కారణంగా ఉన్నది. ఈ నేపథ్యంలో పురుషులు తమ మానసిక ఆరోగ్యం గురించి బాహాటంగా చెప్పడానికి అవకాశం కల్పించడం ఈ ఏడాది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం లక్ష్యం.


పురుషుల హక్కుల కోసం నిలబడిన మహిళ

విశేషం ఏమిటంటే.. భారతదేశంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి ప్రాముఖ్యం తీసుకురావడంలో విశేష కృషి చేసినది ఒక మహిళ. ఉమా చల్లా అనే పురుష హక్కుల న్యాయవాది.. పురుష వ్యతిరేక న్యాయ వ్యవస్థలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పొందుతున్న దూషణలకు వ్యతిరేకంగా చైతన్యం తెచ్చేందుకు ఆమె కృషి చేస్తున్నారు.


ఇదీ చరిత్ర

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం వెబ్‌సైట్‌ ప్రకారం.. ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగోలోని వెస్టిండీస్‌ యూనిర్సిటీలో చరిత్ర ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న డాక్టర్‌ జెరోమి తీలక్‌సింఘ్‌ దీని రూపకర్త. 1999 నుంచి ప్రతి ఏటా అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 80కి పైగా దేశాల్లో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కేవలం పురుషుల కోసమే కాదండోయ్‌.. పురుషుల్లో మరింత అవగాహన తీసుకురావడం ద్వారా లింగ సమానతను సాధించడం కూడా దీని ప్రధాన ఉద్దేశాలలో ఒకటి. ఎంతైనా.. పురుషుడు మంచిగా ఉంటేనే.. సమాజం కూడా మంచిగా ఉంటుంది కదా!

Exit mobile version