- తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు
- వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ బదులు టీజీ
- అహంభావంతో చేసిన చిహ్నాలను సరిచేస్తాం
- 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ,
- 500 కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలపై నిర్ణయం
విధాత: గత ప్రభుత్వం వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో రూపొందించిన చిహ్నాలను సరిచేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర గేయంగా.. ప్రముఖ కవి అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గేయాన్ని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం సమావేశ వివరాలు, నిర్ణయాలను మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు మీడియాకు వివరించారు. ఒక వ్యక్తిని స్ఫురింపజేసేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని, అందులో తాము మార్పులు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు మరో రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందించే హామీలకు మంత్రివర్గం తెలిపింది. ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథార్టీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైకోర్టుకు వంద ఎకరాలు కేటాయింపు నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఖైదీలకు క్షమాభిక్షపై చర్చించిన మంత్రివర్గం, వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ప్రధాన నినాదంగా తీసుకొచ్చిన కులగణనను రాష్ట్రంలో చేపట్టాలని నిర్ణయించారు.
వాహనాలకు టీజీ
టీజీ అని కేంద్రం గెజిట్ ఇస్తే.. నాటి ముఖ్యమంత్రి టీఎస్ అని పెట్టారని, వారి పార్టీ టీఆర్‌ఎస్‌లోని రెండు అక్షరాలు ప్రతిబింబించేలా టీఎస్ అని వాహనాల కోడ్ కేటాయించారని శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇకపై తెలంగాణలో వాహనాలకు టీజీ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేయాలని మంత్రివర్గం తీర్మానించిందని శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలిస్తామని స్పష్టం చేశారు. ఖజానాను గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా.. తాము మాత్రం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి తీరుతామని చెప్పారు. తెలంగాణ తల్లి ఎవరో రూపొందిస్తే ఆమోదించేది లేదని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కొత్త మూర్తిని రూపొందిస్తామని వెల్లడించారు. బీఆరెస్ సర్కారు హయాంలో అంహంభావంతో రూపొందించిన అన్ని చిహ్నాలను సరిచేస్తామని స్పష్టం చేశారు.
ఉర్రూతలూగించిన జయ జయహే తెలంగాణ
ప్రముఖ కవి అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ జనని జయకేతనం..ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ సాగే పాట తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జనాన్ని ఉర్రూతలూగించి, వారిని ఉద్యమ పథంలో సాగేలా చేసింది. గతంలో ఈ గేయాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేస్తారని భావించినప్పటికీ.. గేయ కవి, రచయితపై ఆయనకు ఉన్న కోపంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినీ విద్యార్థులు ఈ పాటను కొన్నాళ్లుగా పాడుతున్నారు. కొన్ని పాఠ్యపుస్తకాల్లో ఆ పాటను పొందుపరిచారు. తొలుత జూన్ 2న జరిగే తెలంగాణ అవిర్భావ దినోత్సవాల్లో ఆ పాటను పాడగా, తదుపరి కేవలం జాతీయ గీతాన్ని మాత్రమే పాడాలని నిర్దేశించారు. ‘జయ జయహే తెలంగాణ’ పాటను తాము రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తించలేదని అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రం గీతం రాసుకున్నప్పుడు దాని గురించి ప్రకటన చేస్తామని చెప్పారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దళిత కవి అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో ఆ పాటను అభిమానించే అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర శకటానికి సైతం జయ జయహే తెలంగాణగా నామకరణం చేయడం గమనార్హం. తాజాగా నంది అవార్డుల పేర్లను గద్దర్ అవార్డులుగా మార్చి ఆయనను గౌరవించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గేయంగా గుర్తించడం తెలంగాణ ఉద్యమ గీతాన్ని గౌరవించడమేనంటున్నారు ఉద్యమకారుకారులు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోదండరామ్‌ను ఎంపిక చేయడం కూడా ఉద్యమకారుల మన్నననలు పొందింది. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కంచెను తొలగించి ప్రజాభవన్‌గా మార్చి తెలంగాణ సమాజం కోరుకునే స్వేచ్చను గౌరవిస్తు ఒక్కో నిర్ణయం తీసుకుంటుండటం పట్ల ఉద్యమకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.