- ఫామ్‌హౌజ్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
- బీఆరెస్ ఎల్పీ నేత ఎంపికపై కసరత్తు
- భవిష్యత్తు వ్యూహాలపై చర్చ
విధాత : మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో తన ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో సమావేశమయ్యారు. ముందుగా తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వారంతా భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ వారందరినీ ఫామ్‌హౌజ్‌కు పిలువడంతో అంతా అక్కడికే వెళ్లారు. ఈ సమావేశంలో ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను కేసీఆర్ వారితో సమీక్షించారు.
అలాగే బీఆరెస్ ఎల్పీ నేత ఎంపిక, భవిష్యత్తు కార్యాచరణలపై చర్చించారు. పార్టీ శాసన సభ పక్షనేతగా కేటీఆర్, కడియం శ్రీహరి పేర్లు చర్చకు వచ్చాయని సమాచారం. డిప్యూటీ సీఎంగా, ఎంపీగా పనిచేసిన దళిత వర్గానికి చెందిన సీనియర్ లీడర్ కడియంను బీఆరెస్‌ఎల్పీ నేతగా పెట్టుకోవాలా? లేక భవిష్యత్తు రాజకీయాల నేపథ్యంలో కేటీఆర్‌ను ఎంపిక చేసుకోవాలా? అన్న అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది.
ముఖ్యంగా ఓటమితో డీలా పడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారని తెలిసింది. పార్టీకి ఇది పెద్ద తేడాతో కూడిన ఓటమి కాదని, కాంగ్రెస్‌కు సైతం పెద్ద మెజార్టీ లేకపోవడం, ఆ పార్టీలో గ్రూపుల లొల్లి వంటి కారణాలతో రాజకీయ అస్థిరత తప్పదని కేసీఆర్ సహా ముఖ్య నేతలు అభిప్రాయ పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆరెస్‌కు తిరిగి మంచి భవిష్యత్తు వస్తుందన్న నమ్మకం పార్టీ నేతల్లో వ్యక్తమైందని బీఆరెస్ వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి కచ్చితంగా సానుకూల ఫలితాలు వస్తాయన్న విశ్వాసాన్ని వారంతా వ్యక్తం చేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీహరి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ సహా దానం నాగేందర్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎల్వీ రమణ తదితరులు పాల్గొన్నారు.
కౌంటింగ్ రోజే ఫాంహౌజ్‌కు
ఎన్నికల ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నానికే పార్టీ ఓటమి అర్థమైన కేసీఆర్.. తన అధికారిక నివాసం ప్రగతిభవన్ నుంచి ఫాంహౌజ్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అధికార కాన్వాయ్‌లో కాకుండా.. సాధారణ వ్యక్తిలా సొంతవాహనంలో ఆయన ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్‌కు చేరుకున్నారు.