- ప్రతిపాదించిన మమతాబెనర్జీ, కేజ్రీవాల్!
- ఎన్నికల తర్వాత నిర్ణయిద్దామన్న కాంగ్రెస్ నేత
- 20 రోజుల్లోగా పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తి
- ఆ వెంటనే ఉధృతంగా ప్రచార కార్యక్రమాలు
- పార్లమెంటులో సస్పెన్షన్లపై జనంలోకి
- ప్రతిపక్ష కూటమి నేతల సమావేశం నిర్ణయం
న్యూఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ,ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. అయితే.. ఈ చర్చ ఇప్పుడే వద్దని ఖర్గే వారించారని సమాచారం. పార్లమెంటు ఉభయ సభల నుంచి ప్రతిపక్ష ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్ల నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.
సీట్ల పంపకం, ప్రధాని అభ్యర్థిత్వంతోపాటు.. భద్రతావైఫల్యంపై ప్రశ్నించిన ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్లపైనా చర్చలు జరిపారని తెలుస్తున్నది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారని సమాచారం. ప్రధాని అభ్యర్థి ఎవరన్న అంశంపై మమతాబెనర్జీ మాట్లాడుతూ దళిత నేతగా ఖర్గే పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. అయితే.. ఆయనే ఈ అంశాన్ని పక్కన పెడతామని చెప్పారని సమాచారం. మొత్తం 28 భాగస్వామ్య పక్షాలకుగాను 12 పార్టీలు ఖర్గే ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపర్చాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరో నిర్ణయిస్తామని చెప్పిన మమతాబెనర్జీ ఇప్పుడు ఖర్గేను ప్రతిపాదించడం విశేషం.
సమావేశం అనంతరం ఎండీఎంకే నాయకుడు, ఎంపీ వైగో మీడియాతో మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే ప్రధాని అభ్యర్థిత్వంపై సమావేశంలో వ్యతిరేకత రాలేదని తెలిపారు. ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చలు జరిగినా తుది నిర్ణయం తీసుకోలేదని, ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయం ఉంటుందని జేఎంఎం ఎంపీ మహువా మాజీ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయేను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 28 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) పేరిట ఒక్కతాటిపైకి వచ్చిన విషయం తెలిసిందే. సీట్ల పంపకానికి సంబంధించి రానున్న 20 రోజుల్లో ఏకాభిప్రాయం సాధించాలన్న నిర్ణయానికి నాయకులు వచ్చారని సమాచారం.
కనీసం 400కుపైగా స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలనే ఆలోచనలో ఇండియా నేతలు ఉన్నట్టు తెలుస్తున్నది. టికెట్ల పంపకం ఖరారు కాగానే ఉమ్మడి ప్రచార కార్యక్రమాలను కూడా ఉధృతంగా మొదలు పెట్టాలని నేతలు నిర్ణయించారు. ‘చర్చలు చాలా స్పష్టంగా సాగాయి. సీట్ల కేటాయింపు, విస్తృత ప్రజాబాహుళ్యాన్ని కలవడం వంటివి 20 రోజుల్లో మొదలవుతాయి. అన్ని నిర్ణయాలు ఈ మూడు వారాల్లో తీసుకుంటాం’ అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తెలిపారు.
నేనేమీ కోరుకోవడం లేదు : ఖర్గే
‘బడుగు బలహీన వర్గాల కోసం నేను పనిచేస్తాను. ముందుగా ఎన్నికల్లో గెలుద్దం. ఆ తర్వాత ఆలోచిద్దాం. నేనేమీ కోరుకోవడం లేదు’ అని ఖర్గే చెప్పారు. ‘ఈ రోజు మోదీ ప్రభుత్వం నిర్దయగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది. ప్రజా వాణిని వినిపించిన వారి ప్రతినిధులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితిలో మన ఐక్యతే మనకు బలం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే మన సంకల్పమే మన శక్తి’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.