Site icon vidhaatha

MLC Kavitha | ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ.. మూడో రోజు 10 గంటలకు పైగా సాగిన విచారణ!

Delhi Liquor Scam, MLC Kavitha

విధాత: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుమార్తె కల్వకుంట్ల కవిత మూడో రోజు సుదీర్ఘ విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో ఆమెను ఉదయం 11.30 నుంచి విచారించారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఆమెను విచారించిన అధికారులు మూడో విడత విచారణను రాత్రి 9.40 గంటలకు ముగించారు.

మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈడీ కార్యాలయంలోకి కవిత వెళ్లగా కార్యాలయంలోని మూడో అంతస్థులో కవితను విచారించినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా కవిత మొబైల్‌ ఫోన్ల విషయంలో ప్రశ్నలు గుప్పించినట్టు తెలుస్తున్నది. కవిత తన ఫోన్‌లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

దీనిని తోసిపుచ్చిన కవిత.. తన పాత మొబైల్‌ ఫోన్లను కవర్లలో తీసుకుని లోనికి వెళ్లిన సంగతి తెలిసిందే. 10 సెల్ ఫోన్‌ల‌ను ఈడీ అధికారుల‌కు ఇచ్చిన క‌విత‌. దీనిపై ఈ రోజు సాంకేతిక అంశాల ఆధారంగానే విచారణ జరిగినట్టు చెబుతున్నారు. కవిత సమర్పించిన మొబైల్‌ఫోన్లను ఫోరెన్సిక్‌ విభాగానికి అధికారులు పంపిస్తారని సమాచారం. వీటిని ఫోరెన్సిక్‌ విభాగం పరిశీలించడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.

సాయంత్రం టెన్షన్‌

ముందే ఈడీ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించిన భద్రతాధికారులు.. చీకటి పడుతున్న సమయంలో వద్ద బలగాలను మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేయడంతో ఉత్కంఠ నెలకొన్నది. కొంతసేపటికి ఈడీ ఆదేశాల మేరకు కవిత న్యాయవాదుల బృందం కొన్న పత్రాలను తీసుకుని ఈడీ కార్యాలయానికి చేరుకున్నది. కవిత తరఫు న్యాయవాది సోమా భరత్‌కుమార్‌తోపాటు బీఆర్‌ఎస్‌ నాయకుడు, టీఎన్‌జీవో పూర్వ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ సైతం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఇప్పటి వరకూ 30 గంటల విచారణ

కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది మూడో రోజు. తొలుత మార్చి 11న 9 గంటల పాటు ప్రశ్నించారు. రెండో విడత విచారణ జరిగిన మార్చి 20 తేదీన అది పది గంటలకు పెరిగింది. తాజా మూడో రోజైన మంగళవారం 10 గంటల పైనే కొనసాగింది. అంటే మొత్తంగా మూడు విడతల్లో కవిత 30 గంటల పాటు ఈడీ ప్రశ్నలను ఎదుర్కొన్నారు.

Exit mobile version